తెల్లారితే శుభకార్యం.. ఇంతలో ప్రమాదం
జంగారెడ్డిగూడెం: తెల్లారితే ఆ ఇంట్లో శుభకార్యం జరుగనుంది. ఇంతలో కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు డాబాపై నుంచి పడి మృతిచెందడంతో తీరని విషాదం నెలకొంది. పగలంతా తన కుమారుడు ఒడుగు నిమిత్తం ఏర్పాట్లలో నిమగ్నమై పనులన్నీ పూర్తిచేసి అలసటతో నిద్రించిన అతడు బుధవారం వేకువజామున మృత్యుఒడికి చేరుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం 20వ వార్డు రాజీవ్‌నగర్‌లో సయ్యద్ అక్బర్ జానీ (31) పిట్టగోడ లేని డాబాపై నుంచి పడి మృతిచెందాడు. అక్బర్ జానీ ఏడేళ్ల కుమారుడు ఇలియాజ్‌కు బుధవారం ఒడుగు కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం బంధువులు, మిత్రులను పిలుచుకుని శుభకార్యం నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మంగళవారం రాత్రి వంటకు సంబంధించిన టిప్‌టాప్ సామాన్లు తీసుకువచ్చి ఇంటి వద్ద ఉంచి పనులు పూర్తయిన తర్వాత డాబాపైకి వెళ్లి నిద్రించాడు. వేకువజామున పిట్టగోడ లేని డాబాపై నుంచి కింద ఉన్న ఇనుపపొయ్యి పైపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జానీ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.అక్బర్ జానీకి భార్య, కుమారుడు ఇలియాజ్, కుమార్తె రహీమా ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో వీరంగా అనాథలుగా మిగిలారు. అక్బర్ జానీ కుటుంబాన్ని టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, మందపల్లి లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు. జానీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.