న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 5.5 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 29.5 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతి అయింది. తద్వారా కరెంటు ఖాతా లోటుపై బంగారం భారం తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 31.2 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అయితే, బంగారం దిగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడమే కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగారం దిగుమతుల విలువ ప్రతికూలంగా ఉండగా, జనవరిలో మాత్రం 38.16 శాతం పెరిగి 2.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ, ఫిబ్రవరిలో తిరిగి 10.8 శాతం క్షీణించి దిగుమతులు 2.58 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఆభరణాల కోసమే మనదగ్గర ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయి.
జెమ్స్, జ్యుయలరీ ఎగుమతుల్లో క్షీణత
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో జెమ్స్, జ్యూయలరీ ఎగుమతులు 6.3 శాతం తగ్గి 28.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు (ఎగుమతులు, దిగుమతుల విలువ మధ్య అంతరం) జీడీపీలో 2.9 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. 2017–18లో బంగారం దిగుమతులు 22.43 శాతం పెరిగి 955.16 టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 780 టన్నులుగా ఉండడం గమనార్హం. బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలను కూడా అమల్లోకి తెచ్చింది.
5.5% తగ్గిన బంగారం దిగుమతులు
Published Mon, Mar 25 2019 5:14 AM | Last Updated on Mon, Mar 25 2019 5:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment