న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,205 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి రూ.655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.22,760 కోట్లకు ఎగసిందని వివరించింది. రూ.3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.8,057 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.33 శాతం నుంచి 3.64 శాతానికి చేరిందని తెలిపింది.
మెరుగుపడిన రుణ నాణ్యత...
నికర లాభం తగ్గినా, ఈ బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 8.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 6.37 శాతానికి అలాగే నికర మొండి బకాయిలు 3.65 శాతం నుంచి 1.60 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.3,994 కోట్ల నుంచి రూ.2,506 కోట్లకు తగ్గాయి.
ఆల్‌టైమ్ హైకి ఐసీఐసీఐ బ్యాంక్...
నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్‌లు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.473ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.469 వద్ద ముగిసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,131 కోట్లు
Published Tue, Oct 29 2019 5:59 AM | Last Updated on Tue, Oct 29 2019 5:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment