జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయితే, ఇలా దాచుకున్న డిపాజిట్లలో వివాదాస్పద నల్లధనం ఎంత? సక్రమమైన డిపాజిట్ల మొత్తమెంత? అనే వివరాలు ఇందులో లేవు.
అలాగే, వివిధ దేశాల నుంచి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు చేసిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలు కూడా ఈ డేటాలో లేవు. భారత్‌లోని స్విస్ బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్ల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఎన్‌బీ ఈ డేటా రూపొందించింది. స్విస్ ఖాతాల్లో బ్లాక్‌మనీ దాచుకునే నల్ల కుబేరులపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్‌ఎన్‌బీ గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకు ఖాతాల్లో విదేశీ ఖాతాదారుల సొమ్ము దాదాపు 4 శాతం క్షీణించి 1.4 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (దాదాపు రూ. 99 లక్షల కోట్లు) స్థాయికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment