న్యూఢిల్లీ/జ్యూరిక్: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ సంస్థల నిధులు గతేడాది గణనీయంగా తగ్గాయి. 2022తో పోలిస్తే 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సుమారు రూ. 9,771 కోట్లు) పడిపోయాయి.
2021లో 3.83 బిలియన్ ఫ్రాంక్ల గరిష్ట స్థాయిని చేరిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం నిధులు వరుసగా రెండవ సంవత్సరం క్షీణించాయి. ఇది 14 సంవత్సరాలలో అత్యధికం. బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేసే నిధుల్లో భారీగా తగ్గుదల ఉండటమే 2023లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.
భారత్‌లోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, నిధులలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయని డేటా వెల్లడించింది. స్విస్ బ్యాంకులు క్రోడీకరించి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్‌బీ)కి నివేదించిన ఈ గణాంకాలు స్విట్జర్లాండ్‌లో భారతీయులు ఎంత నల్లధనాన్ని కలిగి ఉన్నాయో పేర్కొనలేదు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, ఎన్ఆర్ఐలు లేదా ఇతరులు థర్డ్ కంట్రీ సంస్థల పేరిట ఉన్న డబ్బును కూడా ఈ గణాంకాల్లో చేర్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment