డిసెంబర్‌లో రూ.41,156 కోట్లు
నవంబర్‌తో పోల్చితే మారిన పరిస్థితి
2024 మొత్తం మీద రూ.3.94 లక్షల కోట్లు
డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
టాప్‌లేపిన సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డిసెంబర్ నెలలో దుమ్మురేపాయి. అక్టోబర్ నెలలో నికరంగా 14 శాతం మేర పెట్టుబడులను కోల్పోయిన ఈక్విటీ ఫండ్స్.. తిరిగి డిసెంబర్ నెలలో రూ.41156 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో నికర ఈక్విటీ పెట్టుబడులు రూ.35,943 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. వరుసగా 46వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి.
ఈక్విటీలోని అన్ని విభాగాల పథకాల్లోకి నికర పెట్టుబడులు వచ్చాయి. 2024 మొత్తం మీద ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్లు రూ.3.94 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టారు. 2023తో పోల్చితే 144 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎప్పటి మాదిరే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు తమ జోరును కొనసాగించాయి. ఈ రెండు విభాగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు.
థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌కు సైతం డిమాండ్ కొనసాగింది. డిసెంబర్‌లో డెట్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.3 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్‌లో రూ.80,355 కోట్లను ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా పరిశ్రమ నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) నెలవారీగా 1.7 శాతం తగ్గి డిసెంబర్ చివరికి రూ.66.9 లక్షల కోట్లకు పరిమితమైంది.
విభాగాల వారీగా..
→ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,667 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,093 కోట్లు వచ్చాయి. నవంబర్ నెలతో పోల్చి చూస్తే స్మాల్‌క్యాప్‌లోకి 13 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 4 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
→ లార్జ్‌క్యాప్ పథకాలు రూ.2,010 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. నవంబర్‌లో వచి్చన రూ.2,500 కోట్లతో పోల్చితే 20% తగ్గాయి.
→ సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,331 కోట్లను ఆకర్షించాయి. నవంబర్‌లో వచి్చన రూ.7,658 కోట్లతో పోల్చితే
రెట్టింపయ్యాయి.
→ డిసెంబర్‌లో 33 కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఎన్‌ఎఫ్‌వో) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.13,643 కోట్లను రాబట్టాయి. నవంబర్‌లో మొత్తం 18 ఎన్‌ఎఫ్‌వో ఇష్యూలు రాగా, అవి సమీకరించిన మొత్తం రూ.4,000 కోట్లు కావడం గమనార్హం. ఏకంగా మూడింతలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది.
→ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,770 కోట్లు వచ్చాయి. నవంబర్‌లో వచి్చన రూ.5,084 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. మల్టీక్యాప్ ఫండ్స్ 15 శాతం తక్కువగా రూ.3,075 కోట్లను ఆకర్షించాయి.
→ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.3,811 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.
→ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ.640 కోట్లను ఆకర్షించాయి. 2024 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.11,226 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
సిప్ పెట్టుబడుల్లో వృద్ధి
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డిసెంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.26,459 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. నవంబర్ నెల సిప్ పెట్టుబడులు రూ.25,320 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం పెరిగాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ పెట్టుబడుల విలువ రూ.13.63 లక్షల కోట్లకు చేరింది.
ఇన్వెస్టర్లలో నమ్మకానికి నిదర్శనం
‘‘ఎన్‌ఎఫ్‌వోలు, సిప్ పెట్టుబడులు, ఏక మొత్తంలో కొనుగోళ్లు నికర పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పడ్డాయి. పెట్టుబడులు బలంగా రావడం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం’’అని కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. మార్కెట్ అస్థిరతల్లోనూ సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం అన్నది దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టు మిరే అస్సెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సురంజన బోర్తకుర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment