ముంబై: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2023 మార్చి నాటికి సగటున రూ.40.05 లక్షల కోట్లకు చేరాయి. 2022 మార్చి నాటికి ఉన్న రూ.37.70 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ నికరంగా 0.72 శాతమే పెరగడం గమనార్హం. అదే కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.5.86 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఏయూఎంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించిన ఏయూఎం (ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్) 2023 మార్చి చివరికి రూ.6,83,296 కోట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వెళ్లడం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ మార్కెట్ల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించడంగా యాంఫి సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితుల్లోనూ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉండడాన్ని ప్రస్తావించారు.
2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిప్ రూపంలో నెలవారీ పెట్టుబడులు కూడా ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలకు చేరుతున్నాయి. 2023–24 సంవత్సరంలోనూ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం మెరుగ్గానే ఉంటుందన్న అంచనాను వెంకటేశ్ వ్యక్తం చేశారు. సిప్ ఖాతాల సంఖ్య మార్చి చివరికి 6.36 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో 21.65 లక్షలు మేర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment