న్యూఢిల్లీ: దేశ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సరికొత్త మైలురాయికి చేరుకుంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 2023 డిసెంబర్ ముగింపునకు రూ.50 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించాయి. గతేడాది మొత్తం మీద ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 27 శాతం (రూ.10.9 లక్షల కోట్లు) వృద్ధి చెంది రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి.
2022లో కేవలం 5.7 శాతం మేర (రూ.2.65 లక్షల కోట్లు) ఫండ్స్ ఏయూఎం పెరిగింది. 2021 చివరికి ఫండ్స్ ఏయూఎం రూ.37.72 లక్షల కోట్లుగా ఉంటే, 2022 చివరికి రూ.39.88 లక్షల కోట్లకు చేరింది. గతేడాది మెరుగైన పనితీరుకు.. ఈక్విటీ మార్కెట్లలో ఆశావహ ధోరణి, మ్యూచువల్ ఫండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, బలమైన ఆర్థిక మూలాలు, ఫండ్స్ పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, ఇవన్నీ అనుకూలించాయి. గత డిసెంబర్‌లో ఫండ్స్ ఏయూఎం (అన్ని విభాగాలు కలిపి) 3.53 శాతం పెరిగింది.
వరుసగా 11వ ఏడాదీ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు పెరిగాయి. గతేడాది రూ.1.61 లక్షల కోట్లు ఈక్విటీ పథకాల్లోకి రాగా, హైబ్రిడ్ పథకాలు రూ.87,000 కోట్లను ఆకర్షించాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొదటి రూ.10 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు సమకూర్చుకోవడానికి 50 ఏళ్లు పట్టింది. రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్లకు చేరుకోవడం ఏడాదిలోనే సాధ్యపడింది’’అని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు.
ఈక్విటీ పథకాలకు దన్ను..
2023 డిసెంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.16,997 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ నెలలో వచ్చిన రూ.15,536 కోట్లతో పోల్చి చూస్తే 9.40 శాతం వృద్ధి కనిపించింది.
► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా నెలవారీగా వచ్చే పెట్టుబడులు నూతన గరిష్టాలకు చేరాయి. డిసెంబర్‌లో రూ.17,610 కోట్లు సిప్ ద్వారా వచ్చాయి.
► డిసెంబర్‌లో థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ వెలుగులో నిలిచాయి. ఈ విభాగమే అత్యధికంగా రూ.6,005 కోట్లను ఆకర్షించింది. నవంబర్‌లో ఇదే విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.1,965 కోట్లుగానే ఉన్నాయి.
► వీటి తర్వాత స్మాల్‌క్యాప్ పథకాలు అత్యధికంగా రూ.3,865 కోట్లను రాబట్టాయి.
► లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.2,339 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.1,852 కోట్లు ఆకర్షించాయి.
Comments
Please login to add a commentAdd a comment