Asset Under Management
-
రూ. 50 లక్షల కోట్లకు ఫండ్స్ ఆస్తులు
న్యూఢిల్లీ: దేశ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సరికొత్త మైలురాయికి చేరుకుంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 2023 డిసెంబర్ ముగింపునకు రూ.50 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించాయి. గతేడాది మొత్తం మీద ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 27 శాతం (రూ.10.9 లక్షల కోట్లు) వృద్ధి చెంది రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. 2022లో కేవలం 5.7 శాతం మేర (రూ.2.65 లక్షల కోట్లు) ఫండ్స్ ఏయూఎం పెరిగింది. 2021 చివరికి ఫండ్స్ ఏయూఎం రూ.37.72 లక్షల కోట్లుగా ఉంటే, 2022 చివరికి రూ.39.88 లక్షల కోట్లకు చేరింది. గతేడాది మెరుగైన పనితీరుకు.. ఈక్విటీ మార్కెట్లలో ఆశావహ ధోరణి, మ్యూచువల్ ఫండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, బలమైన ఆర్థిక మూలాలు, ఫండ్స్ పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, ఇవన్నీ అనుకూలించాయి. గత డిసెంబర్లో ఫండ్స్ ఏయూఎం (అన్ని విభాగాలు కలిపి) 3.53 శాతం పెరిగింది. వరుసగా 11వ ఏడాదీ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు పెరిగాయి. గతేడాది రూ.1.61 లక్షల కోట్లు ఈక్విటీ పథకాల్లోకి రాగా, హైబ్రిడ్ పథకాలు రూ.87,000 కోట్లను ఆకర్షించాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొదటి రూ.10 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు సమకూర్చుకోవడానికి 50 ఏళ్లు పట్టింది. రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్లకు చేరుకోవడం ఏడాదిలోనే సాధ్యపడింది’’అని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ఈక్విటీ పథకాలకు దన్ను.. 2023 డిసెంబర్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.16,997 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ నెలలో వచ్చిన రూ.15,536 కోట్లతో పోల్చి చూస్తే 9.40 శాతం వృద్ధి కనిపించింది. ► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా నెలవారీగా వచ్చే పెట్టుబడులు నూతన గరిష్టాలకు చేరాయి. డిసెంబర్లో రూ.17,610 కోట్లు సిప్ ద్వారా వచ్చాయి. ► డిసెంబర్లో థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ వెలుగులో నిలిచాయి. ఈ విభాగమే అత్యధికంగా రూ.6,005 కోట్లను ఆకర్షించింది. నవంబర్‌లో ఇదే విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.1,965 కోట్లుగానే ఉన్నాయి. ► వీటి తర్వాత స్మాల్‌క్యాప్ పథకాలు అత్యధికంగా రూ.3,865 కోట్లను రాబట్టాయి. ► లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.2,339 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.1,852 కోట్లు ఆకర్షించాయి. -
బజాజ్ అలియాంజ్ లైఫ్ సరికొత్త మైలురాయి
ముంబై: బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.లక్ష కోట్ల మైలు రాయిని అధిగమించాయి. దేశంలో టాప్–10 బీమా సంస్థలో వేగంగా వృద్ధిని సాధిస్తున్న కంపెనీల్లో ఒకటని తెలిపింది. 2019–20 నాటికి నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రూ.56,085 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. కంపెనీ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసానికి తాజా మైలురాయి నిదర్శనమని సంస్థ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ అభివరి్ణంచారు. గడిచిన మూడేళ్లుగా వ్యక్తిగత నూతన వ్యాపార ప్రీమియంలో ఏటా 41 శాతం చొప్పున వృద్ధిని సాధించినట్టు చెప్పారు. జీవిత బీమా పరిశ్రమలో బజాజ్ అలియాంజ్ లైఫ్ మార్కెట్ వాటా 2019–20 నాటికి 2.6 శాతంగా ఉంటే, 2022–23 నాటికి 5 శాతానికి పెరిగినట్టు తెలిపారు. ప్రైవేటు జీవిత బీమా మార్కెట్లో తమ వాటా 4.6 శాతం నుంచి 7.6 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. -
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నిరంతరాయంగా, బలంగా వస్తూనే ఉన్నాయి. దీంతో అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలోని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) నవంబర్ చివరికి రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎంలో 69 శాతం వృద్ధి కనిపిస్తోంది. అక్టోబర్ నెల స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎంతో పోల్చి చూసినా కానీ, 10 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం అనూహ్యమైన వృద్ధిని చూసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో అనుకూల వాతావరణం, బారీ పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్ వరకు స్మాల్‌క్యాప్ ఫండ్స్ నికరంగా రూ.37,178 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇందులో అత్యధికంగా అక్టోబర్‌లో రూ.4,495 కోట్లు వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది 11 నెలల్లో లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,688 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంటే స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో దేశీ ఇన్వెస్టర్లు ఎంతో బుల్లిష్ గా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడులపై పరిమితులు చిన్న కంపెనీల్లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు రావడంతో షేర్ల ధరలను గణనీయంగా పెరిగేందుకు దారితీస్తోంది. ‘‘పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు గడిచిన త్రైమాసికంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకపై పరిమితులు విధించాయి. పెట్టుబడులు గణనీయంగా రావడం, కంపెనీల వ్యాల్యూషన్లు ఖరీదుగా మారడం ఫండ్ మేనేజర్లను ఆందోళనకు గురి చేస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా తన త్రైమాసికం వారీ నివేదికలో పేర్కొంది. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించిన ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) సైతం 62 లక్షలు పెరిగి నవంబర్ చివరికి 1.6 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 97.52 లక్షలుగా ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం స్మాల్‌క్యాప్ ఫండ్స్ కనీసం 65 శాతం పెట్టుబడులను స్మాల్‌క్యాప్ కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో ఉండే అనిశి్చతుల దృష్ట్యా ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవాలని యూనియన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఈవో జి.ప్రదీప్ కుమార్ సూచించారు. -
ఫండ్స్ ఆస్తులు రూ.37.75 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ చివరికి) రూ.37.75 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. 2021 జూన్ నాటికి ఫండ్స్ ఆస్తులు రూ.33.2 లక్షల కోట్లతో పోలిస్తే 14 శాతం పెరుగుదల నమోదైంది. ఈక్విటీ పథకాల్లోకి స్థిరమైన పెట్టుబడుల రావడం ఇందుకు తోడ్పడింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వివిధ వర్గాలు ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో నిర్వహణ ఆస్తులు మరింత వృద్ధి చెందుతాయని నిపుణులు అంటున్నారు. అయి తే, ఈ ఏడాది మార్చి నాటికి (క్రితం త్రైమాసికం) ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.38.8 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ రకంగా చూస్తే వార్షికంగా ఏయూఎం పెరిగినప్పటికీ.. త్రైమాసికం వారీ తగ్గుదల నమోదైంది. డెట్ విభాగంలో పెట్టుబడుల రాకపోకలు అస్థిరంగా ఉంటుంటాయి. ఈ ప్రభా వం త్రైమాసికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫండ్స్ ఆస్తుల్లో వార్షికంగా వృద్ధి నమోదు కావడం ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుందనడానికి నిదర్శంగా ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. నిషేధం లేకపోతే మరింతగా.. ‘‘జూన్ త్రైమాసికంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), లంప్సమ్ (ఏక మొత్తంలో) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయి. నూతన పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) ఆవిష్కరణకు అనుమతిస్తే ఈ పెట్టుబడుల రాక మరింత మెరుగ్గా ఉండేది’’అని శామ్కో సెక్యూరిటీస్ గ్రూపు హెడ్ ఓంకారేశ్వర్ సింగ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని అమలు చేసే వరకు కొత్త పథకాల ప్రారంభాన్ని సెబీ నిలిపివేసింది. ‘‘ఈక్విటీ పెట్టుబడులు అందిస్తున్న సంపద సృష్టి మార్గాన్ని మరింత మంది ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. దీర్ఘకాల పరిశ్రమ వృద్ధి అంచనాలకు అనుగుణంగానే గణాంకాలు ఉన్నాయి’’అని ఎన్జే ఏఎంసీ సీఈవో రాజీవ్ శాస్త్రి పేర్కొన్నారు. ‘‘సాధారణంగా మార్కెట్లు పెరగడం లేదా అదనపు పెట్టుబడుల రావడం వల్ల ఆస్తుల్లో వృద్ధి కనిపిస్తుంది. కానీ, మార్కెట్ గత ఏడాది కాలం నుంచి ఫ్లాట్‌గా (వృద్ధి లేకుండా స్థిరంగా) ఉంది. కనుక ఆస్తుల్లో వృద్ధి ప్రధానంగా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వల్లే నమోదైంది’’అని ప్రైమ్ ఇన్వెస్టర్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. గతంతో పోలిస్తే నేడు కార్పొరేట్, రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను గుర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాల లేదా దీర్ఘకాల పెట్టుబడులను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అత్యధికి నిర్వహణ ఆస్తులతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి స్థానంలో కొనసాగింది. -
ఫండ్స్‌కు కొత్త నిబంధనల అమలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సంబంధించి మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇకపై నెలకోసారి తమ నిర్వహణలోని ఆస్తుల వివరాలు ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటే అందుకు తగిన కారణాలను వెల్లడించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రంగంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన తాజా నిబంధనలను ఫండ్ హౌస్‌లు ఇకపై తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వివిధ విభాగాలకు చెందిన పథకాల ద్వారా ఫండ్స్ నిర్వహిస్తున్న ఆస్తులు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తమ వెబ్సైట్ల ద్వారా ప్రతీ నెల కు సంబంధించిన వివరాలను 7 రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెబ్సైట్లలో కూడా వివరాలను ప్రకటించాలి. ఈ బాటలో ప్రతీ క్వార్టర్ ముగిశాక 10 రోజుల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలి. వార్షిక నివేదికలోనూ ఈ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఓటింగ్ హక్కుల వినియోగంపై ఆడిటర్ల నుంచి సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 45 ఫండ్ హౌస్‌లు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 9 లక్షల కోట్లకుపైనే.