న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ చివరికి) రూ.37.75 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. 2021 జూన్ నాటికి ఫండ్స్ ఆస్తులు రూ.33.2 లక్షల కోట్లతో పోలిస్తే 14 శాతం పెరుగుదల నమోదైంది. ఈక్విటీ పథకాల్లోకి స్థిరమైన పెట్టుబడుల రావడం ఇందుకు తోడ్పడింది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వివిధ వర్గాలు ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో నిర్వహణ ఆస్తులు మరింత వృద్ధి చెందుతాయని నిపుణులు అంటున్నారు. అయి తే, ఈ ఏడాది మార్చి నాటికి (క్రితం త్రైమాసికం) ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.38.8 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ రకంగా చూస్తే వార్షికంగా ఏయూఎం పెరిగినప్పటికీ.. త్రైమాసికం వారీ తగ్గుదల నమోదైంది. డెట్ విభాగంలో పెట్టుబడుల రాకపోకలు అస్థిరంగా ఉంటుంటాయి. ఈ ప్రభా వం త్రైమాసికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫండ్స్ ఆస్తుల్లో వార్షికంగా వృద్ధి నమోదు కావడం ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుందనడానికి నిదర్శంగా ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.
నిషేధం లేకపోతే మరింతగా..
‘‘జూన్ త్రైమాసికంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), లంప్‌సమ్ (ఏక మొత్తంలో) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయి. నూతన పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) ఆవిష్కరణకు అనుమతిస్తే ఈ పెట్టుబడుల రాక మరింత మెరుగ్గా ఉండేది’’అని శామ్కో సెక్యూరిటీస్ గ్రూపు హెడ్ ఓంకారేశ్వర్ సింగ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని అమలు చేసే వరకు కొత్త పథకాల ప్రారంభాన్ని సెబీ నిలిపివేసింది.
‘‘ఈక్విటీ పెట్టుబడులు అందిస్తున్న సంపద సృష్టి మార్గాన్ని మరింత మంది ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. దీర్ఘకాల పరిశ్రమ వృద్ధి అంచనాలకు అనుగుణంగానే గణాంకాలు ఉన్నాయి’’అని ఎన్‌జే ఏఎంసీ సీఈవో రాజీవ్ శాస్త్రి పేర్కొన్నారు. ‘‘సాధారణంగా మార్కెట్లు పెరగడం లేదా అదనపు పెట్టుబడుల రావడం వల్ల ఆస్తుల్లో వృద్ధి కనిపిస్తుంది.
కానీ, మార్కెట్ గత ఏడాది కాలం నుంచి ఫ్లాట్‌గా (వృద్ధి లేకుండా స్థిరంగా) ఉంది. కనుక ఆస్తుల్లో వృద్ధి ప్రధానంగా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వల్లే నమోదైంది’’అని ప్రైమ్ ఇన్వెస్టర్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. గతంతో పోలిస్తే నేడు కార్పొరేట్, రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను గుర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాల లేదా దీర్ఘకాల పెట్టుబడులను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అత్యధికి నిర్వహణ ఆస్తులతో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి స్థానంలో కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment