గతేడాది మొదలైన అస్థిరతలు మార్కెట్లలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం అని ఇన్వెస్టర్లకు తెలిసిన విషయమే. ఇలాంటి అస్థిరతలు, అధిక, చౌక వ్యాల్యూషన్ల మధ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అందుకు బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనుకూలమని చెప్పుకోవాలి. ఈ విభాగంలో బరోడా బీఎన్‌పీ పారిబాస్ బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఒక మోసర్తు రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం.
పెట్టుబడుల విధానం
బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ పథకాలు ఈక్విటీతోపాటు, డెట్‌లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ పథకాల్లో నష్టాలు తక్కువగా ఉంటాయి. కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది.
రాబడులు
బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో టాప్ పథకాల్లో ఇది కూడా ఒకటి. స్థిరమైన పనితీరు చూపిస్తోంది. నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 50:50 ఇండెక్స్‌ను మించి పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 నవంబర్‌లో మొదలైంది. అంటే నాలుగేళ్ల చరిత్రే ఉంది. అయినా కానీ ఆరంభం నుంచి చూస్తే వార్షికంగా 12.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 8 శాతంగా ఉంటే, మూడేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతానికి పైనే రాబడుల చరిత్ర ఉంది.
పెట్టుబడుల విధానం
ఈ పథకం ఈక్విటీ, డెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. పరిస్థితులు, మార్కెట్ అవకాశాలకు తగ్గట్టు డెట్‌లో గరిష్టంగా 35 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీలకు 86–87 శాతం వరకు కేటాయింపులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా మారాయని భావించినప్పుడు ఈక్విటీల పెట్టుబడులు తగ్గించి, డెట్ పెట్టుబడులను ఫండ్ మేనేజర్ పెంచుతారు. ఈక్విటీలు కరెక్షన్‌కులోనై ఆకర్షణీయ స్థాయికి చేరినప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని, ఈక్విటీలకు పెంచుకోవడం చేస్తుంటారు. ఉదాహరణకు 2020 మార్చి సమయంలో మార్కెట్లు కరోనా భయంతో భారీ దిద్దుబాటుకు గురి కావడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను మొత్తం పోర్ట్‌ఫోలియోలో 87 శాతానికి చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. తిరిగి 2020 సెప్టెంబర్ నుంచి ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకోవడం మొదలు పెట్టారు. కనిష్టాల నుంచి సెప్టెంబర్ నాటికి మార్కెట్లు ర్యాలీ చేయడంతో ఈ విధానాన్ని అమలు చేశారు. 2022 జూన్–జూలైలోనూ ఈక్విటీలు దిద్దుబాటుకు గురికాగా, అప్పుడు ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెంచుకుని, తిరిగి ఇటీవలి కాలంలో తగ్గించుకున్నారు. పీఈ, బుక్ వ్యాల్యూ, డివిడెండ్ ఈల్డ్ ఆధారంగా స్టాక్స్, మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది.
పోర్ట్‌ఫోలియో..
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.3,146 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 67 శాతం ఈక్విటీలో, 29.59 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంది. 3 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 40 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడుల్లో దాదాపు మొత్తం కూడా క్రెడిట్ రేటింగ్ మెరుగ్గా ఉన్న సాధనాల్లో ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ 23 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు 7.50 శాతం, ఇంధన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు చెరో 6 శాతంపైనే కేటాయింపులు చేసింది.
అస్థిరతల్లో స్థిరమైన పనితీరు
Published Mon, Feb 27 2023 9:36 AM | Last Updated on Mon, Feb 27 2023 9:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment