న్యూఢిల్లీ:ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా అక్టోబర్ నెలలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన రూ.12,976 కోట్లను అధిగమించాయి.
సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మార్కెట్ ర్యాలీల్లో, పతనాల్లోనూ పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుంది. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి రిస్క్ తగ్గుతుంది.దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పైగా నెలవారీ సంపాదనకు అనుగుణంగా ప్రణాళిక మేరకు, నిర్దేశిత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ సానుకూలతలపై రిటైల్ ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, దీని రూపంలో వచ్చే పెట్టుబడులు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి.
అక్టోబర్ నెలకు సంబంధించి ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నుంచి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లకు పైనే నమోదవుతున్నాయి. మే నెలలో రూ.12,286 కోట్లు, జూన్ లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు చొప్పున వచ్చాయి. ఏప్రిల్ నెలకు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి.
ఏడు నెలల్లో రూ.87,000 కోట్లు
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో సిప్ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద రూ.1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయి. ‘‘మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలకు, స్థానిక రేట్ల పెంపునకు స్పందిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు తమ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ, సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు’’అని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ తెలిపారు.
ఈక్విటీ నిర్వహణ ఆస్తులు, ఫోలియోల్లోనూ వృద్ధి ఉన్నట్టు చెప్పారు. అక్టోబర్ నెలలో కొత్తగా 9.52 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే నంబర్‌ను ఫోలియోగా పేర్కొంటారు. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య అక్టోబర్ చివరికి 5.93 కోట్లకు చేరింది. సిప్ రూపంలో స్థిరమైన పెట్టుబడుల రాక మన ఈక్విటీ మార్కెట్లలో కొంత స్థిరత్వానికి సాయపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఈక్విటీల్లోకి రూ.9,390 కోట్లు
ఇక అక్టోబర్ నెలకు ఈక్విటీ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉన్నాయి. దీంతో వరుసగా 20వ నెలలోనూ (2021 మార్చి నుంచి) ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్టయింది. కాకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.14,100 కోట్లతో పోలిస్తే చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి.
మార్కెట్లలో అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్లు వచ్చాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.2,818 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని రకాల విభాగాలు కలిపి చూస్తే ఫండ్స్ పరిశ్రమలోకి అక్టోబర్‌లో రూ.14,047 కోట్లు వచ్చాయి. దీంతో ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.39.5 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ చివరికి ఇది రూ.38.4 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment