ఏడునెలల్లో 25 లక్షల మంది దూరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నా చిన్న ఇన్వెస్టర్లకి నమ్మకం కల్పించడంలో విఫలమవుతున్నాయి. దీంతో మార్కెట్లు ఏమాత్రం పెరిగినా కొత్తగా ఇన్వెస్ట్ చేయడం సంగతి అటుంచి ఇప్పుడున్న వాటిని కూడా అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలంలోనే ఈక్విటీ ఫండ్స్ నుంచి 25 లక్షమందికిపైగా ఇన్వెస్టర్ల ఖాతాలు తగ్గినట్లు సెబీ గణాంకాలను బట్టి తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నాటికి 3.32 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఫండ్ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య ఈ ఏడాది 3.06 కోట్లకు పడిపోయింది. 2008లో మార్కెట్లు గరిష్టస్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయిన వాళ్ళు ఇప్పుడు తిరిగి ఆ స్థాయి విలువ రావడంతో వెనక్కి తీసుకుంటున్నారని ఒక ఫండ్ మేనేజర్ వ్యాఖ్యానించారు. ఈ ఏడు నెలల కాలంలో సెన్సెక్స్ సుమారు 9 శాతం లాభాలను అందించింది. దీనికితోడు మార్కెట్లు బాగా ఒడిదుడుకులతో ఉండటం, ఈ మధ్య కొన్ని ఈక్విటీ పథకాలను కలిపేయడం కూడా ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్ల సంఖ్య బాగా తగ్గుతుండటంపై సెబీ చైర్మన్ యూ.కె.సిన్హా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
డెట్‌పై మోజు: కాని ఇదే సమయంలో డెట్ పథకాల కేసి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వడ్డీరేట్లు పెరుగుతుండటంతో డెట్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తున్నాయి. దీంతో 7 నెలల్లో డెట్ పథకాల్లో ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 4.22 లక్షలు పెరిగాయి. ప్రస్తుతం డెట్ పథకాల్లో ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 66 లక్షలకు చేరుకుంది. మొత్తం మీద అన్ని అన్ని రకాల ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఖాతాల సంఖ్య 20 లక్షలు తగ్గాయి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో 4.28 కోట్లుగా ఉన్న ఖాతాల సంఖ్య ఈ ఏడాది 4.07 కోట్లకు పడిపోయింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి ఫండ్ ఖాతాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.