
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. దీన్ని ఎలా అమలు చేస్తారు? – ఎస్ అశోక్
ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికీ ఎగ్జిట్ లోడ్ గురించి తెలియాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిర్దేశిత కాలంలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు అమలు చేసే చార్జీయే ఎగ్జిట్ లోడ్. ఫండ్ నిబంధనల్లో ఇది స్పష్టంగా ఉంటుంది. ఫండ్ రకాన్ని బట్టి ఎగ్జిట్ లోడ్ వేర్వేరుగా ఉంటుంది. ఏకమొత్తంలో (లంప్‌సమ్) పెట్టుబడి లేదా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి వాయిదా నుంచి ఈ తేదీ పరిగణనలోకి వస్తుంది. ఒకవేళ ఎగ్జిట్ లోడ్ చార్జీలను మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్చినట్టయితే.. పెట్టుబడి పెట్టిన తేదీ నాటికి ఉన్న ఎగ్జిట్ లోడ్ విధానమే, ఉపసంహరణ సమయంలో అమలవుతుంది.
ఉదాహరణకు రూ.లక్షను 2022 నవంబర్ 1న ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసినట్టు అనుకుందాం. ఆ సమయంలో ఎగ్జిట్ లోడ్ 365 రోజులకు 1 శాతంగా ఉంది. పెట్టుబడి తేదీ నాటికి పథకం ఎన్‌ఏవీ 20గా ఉంది. దీంతో రూ.లక్ష పెట్టుబడికి 5,000 యూనిట్లు వచ్చాయి. 2023 సెప్టెంబర్ 15న రూ.50వేలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎన్‌ఏవీ 25 ఉందని అనుకుందాం. రూ.50వేల కోసం 2,000 యూనిట్లను విక్రయించాలి. దీంతో ఏడాదిలోపు (365 రోజుల్లోపు) విక్రయించినట్టు అవుతుంది. కనుక ఎగ్జిట్ లోడ్ పడుతుంది. రూ.50,000 ఉపసంహరణ విలువపై ఒక శాతం ఎగ్జిట్ అంటే రూ.500 చెల్లించాలి. కనుక చేతికి రూ.49,500 వస్తాయి. ఒకవేళ ఈ ఉపంసంహరణను 2023 నవంబర్ 1 తర్వాత తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడదు. సిప్ రూపంలో ఒక్కో పెట్టుబడికి విడిగా ఇది అమలవుతుంది. ఉదాహరణకు 2022 నవంబర్ 1న సిప్ రూపంలో ఒక పథకంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేశారు. ఎన్‌ఏవీ రూ.20గా ఉంది. దీంతో 500 యూనిట్లు వచ్చాయి. అప్పటికి 1 శాతం ఎగ్జిట్ లోడ్ ఉంది. 2022 డిసెంబర్ 1 నుంచి ఎగ్జిట్ లోడ్ 1.5 శాతానికి పెరిగింది. డిసెంబర్ 1న సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేశారు. ఆ సమయంలోనూ ఎన్‌ఏవీ రూ.20 దగ్గరే ఉండడంతో మరో 500 యూనిట్లు వచ్చాయి. దీంతో ఉపసంహరణ సమయంలో యూనిట్ల విక్రయంపై ఎగ్జిట్ లోడ్ వేర్వేరుగా అమలవుతుందని గ్రహించాలి.
మనీ మార్కెట్ ఫండ్ అంటే ఏమిటి? ఎవరు ఈ ఫండ్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు? – నాగరాజు
మనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్‌స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇవి రిస్క్‌లేని అంచనా వేయతగిన రాబడులను ఇవ్వగలవు. ఎందుకంటే అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రాబడులు స్థిరంగా ఉంటాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు దాదాపు రిస్క్‌లేని, ఎంతో రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంటే ఈ సాధనాల్లోకి మళ్లించుకోవచ్చు.
మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ సరిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment