మార్కెట్లు అస్థిరతల మధ్య ఉన్నప్పుడు, ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడకు పెట్టుబడులను మళ్లించే ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎంతో ఆకర్షణీయమని చెప్పుకోవాలి. అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఏదో ఒక విభాగంలో ఇంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలనే షరతుల్లేని విభాగం ఇది. పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఈ విభాగంలో మెరుగ్గా రాణిస్తోంది. ఏడేళ్లు అంతకుమించిన కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఈ విభాగం అనుకూలం.
రాబడులు
ఈ పథకంలో గడిచిన ఏడాది కాలంలో రాబడులు లేకపోగా, 6 శాతానికి పైగా నికర నష్టాలు చూపిస్తున్నాయి. కానీ, ఈక్విటీ ఫండ్స్ పనితీరును ఎప్పుడూ ఏడాది కాలానికి పెద్దగా పరిగణనలోకి తీసుకోకూడదు. మూడేళ్ల కాలంలో ఇదే పథకం ఏటా 35 శాతం చొప్పున రాబడిని ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 13 శాతానికి పైనే ఉంది. ఇక ఏడేళ్లలోనూ ఏటా 15 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోలిస్తే 7 శాతం అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉంది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ సూచీ కంటే మెరుగైన పనితీరు చూపించింది.
పెట్టుబడుల విధానం
ఈ పథకం పెట్టుబడుల విషయంలో సౌకర్యంగా వ్యవహరిస్తుంది. మిడ్‌క్యాప్ విభాగం ఎక్కువ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయంగా అనిపిస్తుంటే, సదరు విభాగంలోని కంపెనీలకు పెట్టుబడులను పెంచుతుంది. ఇదే మాదిరి స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల విషయంలోనూ వ్యవహరిస్తుంది. అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీనివల్ల పథకం పెట్టుబడుల్లో స్థిరత్వం ఎక్కువ ఉంటుందని భావించొచ్చు. 2020 ఆరంభం వరకు ఈ పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 60 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే కలిగి ఉండేది. మిగిలిన మొత్తాన్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది.
2020 మార్చి మార్కెట్ పతనం తర్వాత తన విధానంలో కొంత మార్పు చేసింది. లార్జ్‌క్యాప్ పెట్టుబడులను 50 శాతం లోపునకు తగ్గించి, స్మాల్, మిడ్‌క్యాప్ విభాగాలకు కేటాయింపులు పెంచింది. ఆ కాలంలో మిడ్, స్మాల్‌క్యాప్ గణనీయంగా దిద్దుబాటుకు గురికావడంతో ఈ పని చేసింది. కానీ, గత ఏడాది కాలంలో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిపోవడంతో.. తిరిగి లార్జ్‌క్యాప్ పెట్టుబడులను 60 శాతానికి పైగా పెంచింది. గ్రోత్, వ్యాల్యూ రెండు రకాల పెట్టుబడుల విధానాలను అనుసరిస్తుంటుంది. మూమెంటమ్‌గా (తాత్కాలికంగా) వచ్చే అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుంది. ఇందుకు ఉదాహరణ కరోనా వైరస్ కాలంలో ఫార్మాలో పెట్టుబడులు పెంచుకోవడాన్ని ప్రస్తావించొచ్చు.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.5,199 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 89 శాతం కేటాయించి, 9.74 శాతం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఒకవేళ ఈక్విటీలు మరింత దిద్దుబాటుకు గురైతే అప్పుడు డెట్ నుంచి ఈక్విటీలకు ఎక్స్‌పోజర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. పైగా వడ్డీ రేట్లు పెరగడం వల్ల డెట్ సాధనాలు కూడా ఆకర్షణీయంగా మారాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ లార్జ్‌క్యాప్‌లో 66 శాతం పెట్టుబడులు ఉంటే, మిడ్‌క్యాప్ కంపెనీలకు 22 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 12 శాతం మేర కేటాయింపులు చేసింది. పోర్ట్‌ఫోలియోలో 40 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 20 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 17 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 10 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 9 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment