ముంబై: దేశంలోనే మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) పరంగా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 90 వేల కోట్ల మేర ఆస్తులను పెంచుకుంది. దీంతో సంస్థ నిర్వహణలోని మొత్తం ఏయూఎం మార్చి నాటికి ఉన్న రూ.7.10 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.8 లక్షల కోట్లకు చేరుకుంది.
వచ్చే 12 నుంచి 18 నెలల్లో మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ, చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డీపీ సింగ్ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోవాలనే లక్ష్యాన్ని అంతర్గతంగా విధించుకున్నట్టు చెప్పారు. మార్కెట్లో ఏదైనా తీవ్ర పతనాన్ని చూస్తే తప్పితే, తాము దీన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఏయూఎం జూన్ చివరికి రూ.43.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.
8 శాతం మార్కెట్ వాటా: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ.43.2 లక్షల కోట్ల ప్రకారం చూస్తే, ఎస్‌బీఐ ఫండ్ ఏయూఎం వాటా 18%. ఇందులో రూ.5.5 లక్షల కోట్ల ఆస్తులు ఈక్విటీలకు సంబంధించినవిగా సింగ్ వెల్లడించారు. ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో తమ పథకాల్లోకి రూ.2,200 కోట్లు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ పెట్టుబడులు టాప్–30 పట్టణాల నుంచి ఉన్నాయన్నారు. ఎస్‌బీఐ నిర్వహణలోని ఫోలియోల్లో (పెట్టుబడి ఖాతా) 35% చిన్న పట్టణాలవేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment