గడిచిన ఏడాదిన్నర కాలంలో మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు చాలా వరకు దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో దీర్ఘకాల పెట్టుబడి అవకాశాల దృష్ట్యా ఇవి ఆకర్షణీయంగా మారాయి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ సమయంలో ఆయా విభాగాలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను పరిశీలించొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకం ఒక మంచి ఎంపిక అవుతుంది. మార్కెట్ ర్యాలీల్లో మంచి పనితీరును చూపించడమే కాకుండా, మార్కెట్ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడం ఈ పథకం పనితీరు ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇందుకు నిదర్శనం గత ఏడాది కాలంలో ఇదే విభాగంలోని ఇతర పథకాలు, బెంచ్ మార్క్ సూచీతో పోలిస్తే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకం మెరుగైన రాబడులు ఇచ్చింది.
రాబడులు
గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 16 శాతం రాబడులు ఇచ్చింది. బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్‌ఐతో పోల్చి చూసినా, లేదా స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చినా నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ పథకమే ఎక్కువ ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 47 శాతంగా ఉంది. ఐదేళ్లలో చూసినా 16%, ఏడేళ్లలో 21%, పదేళ్లలో 26 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. సూచీతో పోల్చినా, స్మాల్‌క్యాప్ విభాగంతో పోల్చినా ఈ పథకమే 5–6% అదనపు రాబడిని వార్షికంగా అందిస్తోంది. కనీసం ఐదేళ్లు, అంతకు మించి కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సిప్ మార్గంలో ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవడాన్ని పరిశీలించొచ్చు.
పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం
పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పాటిస్తుంటుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 169 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకంలో 26వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆస్తులు ఉండడంతోపాటు విడిగా ఒక్కో స్టాక్ వారీగా పెట్టుబడులను పరిమితం చేయడం వల్ల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ కనిపిస్తున్నాయి. అన్ని రకాల మార్కెట్ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. అలాగే, ఏదో ఒక రంగానికి ఎక్కువగా కేటాయింపులు చేయదు. ప్రస్తుతం ఈక్విటీల్లో 96.79 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తం నగదు రూపంలో ఉంది. పెట్టుబడుల్లో 16 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 36 శాతం పెట్టుబడులు ఉన్నాయి.
స్మాల్‌క్యాప్ పథకం కదా, మిడ్‌క్యాప్‌లో అన్నేసి పెట్టుబడులు ఎందుకు ఉన్నాయనే సందేహం రావచ్చు..? ఈ పథకం మల్టీబ్యాగర్ల వృద్ధిని చూసే సామర్థ్యాలనున్న చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీంతో అవి మిడ్, లార్జ్ కంపెనీలుగా దీర్ఘకాలంలో అవతరిస్తుంటాయి. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 48 శాతం పెట్టుబడులు ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అత్యధికంగా 17 శాతం కేటాయించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 13 శాతం కేటాయించగా, కెమికల్స్ కంపెనీల్లో 9 శాతం పెట్టుబడులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment