వడ్డీ రేట్లు దాదాపు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పదేళ్లకు మించిన లక్ష్యాల కోసం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. మన దగ్గర దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల సాధనాలు పరిమితం. పీపీఎఫ్, ఎన్‌పీఎస్ పథకాలు ఉన్నా, వీటిల్లో లాకిన్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణకు వీలు కాదు. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై రెగ్యులర్ ఆదాయం వస్తుంటుంది. వడ్డీపై వ్యక్తిగత పన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ గడువు కంటే ముందే వైదొలగాలని అనుకుంటే లిక్విడిటీ పెద్దగా ఉండదు. కానీ, లాంగ్ డ్యురేషన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కోరుకున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య ఫండ్ పదేళ్లకు మించిన లక్ష్యాలకు అనుకూలం. కోరుకున్నప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు.
పెట్టుబడుల విధానం..
నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య అనేది ఓపెన్ ఎండెడ్ డెట్ పథకం. కనుక ఎప్పుడైనా పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలంతో కూడిన జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. సగటున 20–25 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే (గడువు ముగిసే) సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. పైగా వ్యయాలు చాలా తక్కువ. డైరెక్ట్ ప్లాన్‌లో కేవలం 0.16 శాతమే ఎక్స్‌పెన్స్ రేషియో వసూలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టిన మొదటి మూడేళ్లలో కేవలం 20 శాతం యూనిట్లనే విక్రయించుకోగలరు. ఈ మొత్తంపై ఎగ్జిట్ లోడ్ పడదు. ఇంతకుమించిన మొత్తం ఉపసంహరించుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత ఎలాంటి పరిమితులు, చార్జీలు లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం దీర్ఘకాల పెట్టుబడులకు ఉద్దేశించినది. కనుక స్వల్పకాలంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరుత్సాహపరిచేందుకు ఈ నిబంధన విధించడం జరిగింది. దీర్ఘకాల జిసెక్‌లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువ. పరిమితి విధించడానికి ఇది కూడా ఒక కారణం. కనుక కనీసం 8–10 ఏళ్లకు మించిన కాలానికే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.
సరైన సమయమే..
గతంలో వడ్డీ రేట్ల సైకిల్ 8–8.5 శాతం వద్ద గరిష్టానికి చేరి, 5–5.5 శాతం వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం ఈల్డ్స్ 7.4 శాతానికి చేరాయి. గరిష్టానికి ఒక శాతం తక్కువ. సాధారణంగా వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడే లాంగ్ డ్యురేషన్ ఫండ్స్/సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు అధిక రాబడులు పొందొచ్చు. ఏ సైకిల్‌లో అయినా గరిష్ట రేటును అంచనా వేయడం కష్టం. కనుక ఇక్కడి నుంచి ఈల్డ్స్ ఇంకా పెరుగుతాయా? అన్నది చెప్పలేం. కనుక ఇక్కడి నుంచి లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఆరంభించుకోవచ్చు. వడ్డీ రేట్ల క్షీణత ఆరంభమైన తర్వాత తాజా పెట్టుబడులు నిలిపివేసుకోవచ్చు.
రాబడులు..
డెట్ పథకాల్లో మూడేళ్లు పూర్తయ్యే వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. నివేష్ లక్ష్య తదితర లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో గడిచిన ఏడాది, మూడేళ్ల కాల రాబడులు అంత ఆకర్షణీయంగా అనిపించవు. ఎందుకంటే ఈ కాలంలో వడ్డీ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. వీటిల్లో రాబడులను సైకిల్ ఆధారంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరిగితే లాంగ్ డ్యురేషన్ పథకాల్లోని పెట్టుబడుల ఎన్‌ఏవీ సైతం తగ్గుతుంది. గడిచని ఏడాదిలో 5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 6 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. కానీ, ఎనిమిదేళ్లు అంతకుమించిన కాలానికి ఈ పథకాలు ద్రవ్యోల్బణంతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment