మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్
దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఎందుకంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది.
రాబడులు
ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు ఇవ్వలేక పోయింది. ఇందుకు మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది తప్పిస్తే దీర్ఘకాలంలో నమ్మకమైన పనితీరును గమనించొచ్చు. మూడేళ్లలో 20 శాతం, ఐదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే ‘నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్‌ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 7 శాతం, 18 శాతం, 13 శాతంగానే ఉండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది. పదేళ్లలో వార్షిక రాబడి 22 శాతంగా ఉంటే, ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి వార్షిక ప్రతిఫలం 20 శాతంగా ఉంది.
పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌నకు 35-65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.24,643 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 99 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉండగా, మిగిలిన ఒక శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 53.5 శాతం లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 42 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 4 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 71 స్టాక్స్ ఉన్నాయి.
ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 36 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 28 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాత ఆటోమొబైల్‌లో కంపెనీల్లో 9.46 శాతం, ఇంధన రంగ కంపెనీల్లో 9.36 శాతం, టెక్నాలజీలో 8.22 శాతం, హెల్త్‌కేర్‌లో 7 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. దీంతో గత ఏడాది కాలంలో ఈ పథకం రాబడులను ఇవ్వలేకపోయింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం మొత్తం మీద మార్కెట్‌తో పోలిస్తే నష్టాలను పరిమితం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment