దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. సెబీ 2017లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్‌వర్గీకరణకు ముందు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండేది. అనంతరం ఎక్కువ పెట్టుబడులను లార్జ్ క్యాప్ విభాగానికి కేటాయించే విధంగా మార్పులు చేసింది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం కిందకు ఇది వస్తుంది. 5 స్టార్ రేటెడ్ పథకం కావడం గమనార్హం.
రాబడులు
ఈ పథకంలో ఏడాది రాబడులు 19 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షికంగా 26 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అలాగే, ఐదేళ్లలో వార్షికంగా 17 శాతం, ఏడేళ్లలో వార్షికంగా 18 శాతం, పదేళ్లలో 23 శాతం చొప్పున రాబడులను అందించింది. కానీ, ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా భావించే బీఎస్‌ఈ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ సూచీ పెరుగుదల ఏడాదిలో 21 శాతం, మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో 14.58 శాతం చొప్పునే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. ఏడాది కాలం మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. ఇక ఈ పథకం 2010 జూలై 9న ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 19.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది.
పెట్టుబడుల విధానం
లార్జ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం, గరిష్టంగా 65 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం గత పనితీరును పరిశీలించినట్టయితే కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. తర్వాతి సంవత్సరాల్లో అద్భుత రాబడులతో సగటున మెరుగైన పనితీరును చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తులో బ్లూచిప్ కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలను గుర్తించి వాటిల్లో ఎక్స్‌పోజర్ తీసుకుంటుంది.
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.25,332 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం తనవద్దనున్న పెట్టుబడుల్లో 98.66 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ముఖ్యంగా మెగాక్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 55 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉండగా, మిడ్‌క్యాప్‌లో 40 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కొంచెం అదనపు రాబడులను దీర్ఘకాలంలో ఇస్తాయి. కనుక మూడు విభాగాల్లోనూ ఎక్స్‌పోజర్ ఉండడం రాబడుల పరంగా అనుకూలమైనది.
ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 79 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 28 శాతం వరకు పెట్టుబడులను ఈ రంగంలోని కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 9 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆటోమొబైల్ కంపెనీలకు 8.32 శాతం పెట్టుబడులు కేటాయించింది. టెక్నాలజీ రంగ కంపెనీల్లో 8.23 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7.85 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.66 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment