ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా సాధనాల్లో ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది. కానీ, చాలా మంది దీన్ని ఆచరించలేరు. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారే ఎక్కువ. ఈ తరుణంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పన్ను ఆదాకుతోడు మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినప్పుడే అసలైన ప్రయోజనం నెరవేరుతుంది.
ఈ విధంగా చూసుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) మెరుగైన సాధనం అవుతుంది. ఒకవైపు సెక్షన్ 80సీ కింద ఈ పథకాల్లో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మరోవైపు మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో ఇతర అన్ని సాధనాల కంటే మెరుగైన రాబడులను వీటిల్లో పొందొచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగంలో కెనరా రొబెకో ట్యాక్స్ సేవర్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు.
రాబడులు
ఈ పథకానికి మెరుగైన, స్థిరమైన రాబడుల చరిత్ర ఉంది. సాధారణంగా పన్ను ఆదా సాధనం కనుక ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టిన మూడేళ్ల తర్వాతే వెనక్కి తీసుకోగలరు. కనుక ఏడాది రాబడులు కాకుండా మూడేళ్ల కాలంలో రాబడులను చూసినట్టయితే ఏటా 20 శాతం రాబడులను ఇచ్చింది. అలా కాకుండా ఆ పెట్టుబడులను ఐదేళ్ల పాటు కొనసాగించి ఉంటే ఏటా 14 శాతం, ఏడేళ్ల పాటు అయితే ఏటా 14 శాతం, 10 ఏళ్లపాటు ఉంచినప్పుడు ఏటా 14 శాతం రాబడులను ఈ పథకం ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇదంతా రెగ్యులర్ ప్లాన్‌లో. డైరెక్ట్ ప్లాన్‌లో అయితే 15 శాతంపైనే రాబడులు ఉన్నాయి. బీఎస్‌ఈ 500టీఆర్‌ఐ, ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే కాస్త అధిక రాబడులు ఉన్నాయి. మధ్యస్థ రిస్క్ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలం. పన్ను ఆదా అవసరం లేని వారు, లాకిన్ ఉన్న సాధనాలు కోరుకునే వారికి కూడా ఇవి అనుకూలమే.
పెట్టుబడుల విధానం
పెట్టుబడులకు మల్టీక్యాప్ విధానం అనుసరిస్తుంది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఎక్కువ పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. కనుక రాబడుల్లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. లార్జ్‌క్యాప్ కేటాయింపులు ఎక్కువ కావడంతో గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో నష్టాలు కేవలం మూడు శాతానికి పరిమితమయ్యాయి. కానీ, గడిచిన ఏడాది కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలు విడిగా 20–30 శాతం మధ్య దిద్దుబాటుకు గురికావడం గమనార్హం. పరిస్థితులకు అనుగుణంగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కేటాయింపులను ఈ పథకం మార్పు చేర్పులు చేస్తుంటుంది.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,583 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 97 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా 3 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విట్లీలోనూ 77 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే కలిగి ఉంది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు ఒక్క శాతం లోపే ఉండడం గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 58 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 33 శాతం వీటికే కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీల్లో 11 శాతం, ఆటోమొబైల్‌లో 7 శాతం, హెల్త్ కేర్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.
చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే!
Comments
Please login to add a commentAdd a comment