1) నా వయసు 41 సంవత్సరాలు. గ్రాట్యుటీ కింద తాజాగా రూ.9 లక్షలు వచ్చాయి. ఇటీవలే ఉద్యోగం మారిపోయాను. దీంతో గ్రాట్యుటీగా వచ్చిన డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికితోడు నేను ప్రతీ నెలా రూ.25,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. – రవీష్
సంతోషకరమైన విషయం ఏమిటంటే మీకు గ్రాట్యుటీగా వచ్చిన మొత్తం కూడా పన్ను రహితమే. ఇది ఆదాయం కింద పరిగణనలోకి రాదు. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షలకు పెంచింది. కనుక గ్రాట్యుటీ కింద రూ.20లక్షల వరకు వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మీరు నిర్ణయించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ డబ్బులతో అవసరం తిరిగి ఎప్పుడు ఉంటుందన్నది మీకే తెలుస్తుంది.
చదవండి: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్?
మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. వచ్చే ఐదు, ఏడేళ్ల వరకు ఈ నిధి అవసరం మీకు లేకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై మీకు అనుభవం ఉంటే కనుక ఫ్లెక్సీక్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ నిధి మొత్తాన్ని ఒకే విడత కాకుండా. వచ్చే 12–18 నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అయితే ఈక్విటీ లేదా ఈక్విటీ/డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడమే సముచితం. మీ అనుభవం ఆధారంగా పథకాన్ని ఎంపిక చేసుకోండి. ఒకవేళ వచ్చే రెండు మూడేళ్లకే ఈ డబ్బులతో మీకు అవసరం ఉంటే కనుక (ఏదైనా అవసరం కోసం) అప్పుడు ఈక్విటీ కాకుండా.. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనమైన షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
2) వృద్ధులకు సెక్యూర్డ్ డిబెంచర్లు సురక్షితమేనా? నమ్మకమైన రాబడుల కోసం ఏ క్రెడిట్ రేటింగ్ చూడాలి? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో వీటిని పోల్చి చూసేదెలా? – పరమేశ్వర్
సెక్యూర్డ్ డిబెంచర్లకు ఆస్తులు హామీగా ఉంటాయి. కానీ, చాలా డిబెంచర్లు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటుంటాయి. వీటికి మద్దతుగా ఎటువంటి ఆస్తులు ఉండవు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. రిటైర్ అయిన అందరూ ఏఏఏ రెటెడ్ లేదా కనీసం ఏఏ రేటింగ్ కంటే తక్కువ రేటింగ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేయడం సులభమే. అంతా సాఫీగానే నడిస్తే అప్పుడు వడ్డీ ఆదాయం, మీ పెట్టుబడి సకాలంలో మీకు తిరిగి వస్తాయి. ఒకవేళ ఏదైనా అంచనాలు తప్పితే అప్పుడు వచ్చేదేమీ ఉండదు. కనుక వీటి విషయంలో రిస్క్ ఉంటుంది.
ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. సెక్యూర్డ్ డిబెంచర్ల వంటి వాటిల్లో పెట్టుబడులు 2–5 శాతానికి మించవు. కనుక నష్టాలు వచ్చినా పరిమితంగానే ఉంటాయి. పెట్టుబడులను భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం కారణంగా రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. డిబెంచర్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే పూర్తి కాలం వరకు మీ పెట్టుబడులను లాక్ చేసుకుంటున్నట్టు అవుతుంది. మధ్యలో మీ పెట్టుబడులు కావాలంటే లిక్విడిటీ కష్టం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ లిక్విడిటీ సమస్య ఉండదు. కోరుకున్నప్పుడు మీ పెట్టుబడులను మొత్తం వెనక్కి తీసేసుకోవచ్చు. దీనికితోడు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. మూడేళ్ల తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకోవచ్చు. డిబెంచర్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో దానిపై వచ్చే వడ్డీ ఆదాయం మొత్తం కూడా పన్ను పరిధిలోకే వస్తుంది. రెండింటి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలను పరిశీలించుకోవాలి. డిబెంచర్‌లోనే ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అధిక క్రెడిట్ రేటింగ్ వాటినే ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన రేటింగ్ ఉంటే రాబడి రేటు అంత ఎక్కువ ఉండదన్నది నిజం.
3) దీర్ఘకాల డెట్ పెట్టుబడుల కోసం ఏ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి? – అంకిత్‌జైన్
రిస్క్ వద్దు అనుకుంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ మినహా వేటిని కూడా చూడొద్దు. కాకపోతే కొంచెం రిస్క్ ఉన్నా ఫర్వాలేదనకుంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. అలాంటప్పుడు ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు పెట్టుకోవడం అవుతుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 15–20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తుంటాయి. ఈ పథకాల్లో దీర్ఘకాలానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ఐదు–ఏడేళ్లకు మించిన కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటి నుంచి అందుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment