న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కల్పించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు నూతన నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెబీ ప్రకటించింది.
మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్ అని రెండు రకాలు ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దీంతో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. దీనివల్ల రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్లలో దీర్ఘకాలంలో అధిక రాబడులు పొందొచ్చు. ఫలితంగా డైరెక్ట్ ప్లాన్ల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో జెరోదా తదితర స్టాక్ బ్రోకర్లతోపాటు, పేటీఎం మనీ తదితర ఎన్నో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వీటిని ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎవరైనా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు క్లయింట్లు కానక్కర్లేదు. ఇలా తమ క్లయింట్లు కాని వారికి కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాల డైరెక్ట్ ప్లాన్లలో కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలకు వీలు కల్పించే సంస్థలకు జవాబుదారీ ఉండాలని సెబీ భావించి ఈ దిశగా నిబంధనలను ప్రకటించింది. ఇప్పటి వరకు క్లయింట్లు కాని వారికి సేవల విషయంలో నియంత్రణ లేదు.
Comments
Please login to add a commentAdd a comment