న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లలో అస్థిరతలతో సంబంధం లేకుండా ప్రతి నెలా నికర సిప్ పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉండడం దీన్నే సూచిస్తోంది. గత నాలుగు నెలలుగా నెలవారీ సిప్ పెట్టుబడుల రాక రూ.12,000 కోట్లపైనే నమోదవుతోంది. ఆగస్ట్‌లో సిప్ పెట్టుబడులు అత్యధికంగా రూ.12,693 కోట్లకు చేరాయి. ఒక నెలలో ఇదే గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవి. ఈ ఏడాది మే నెలకు రూ.12,286 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్ల చొప్పున సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సిప్ పెట్టుబడులు రూ.61,258 కోట్లకు చేరాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి.
క్రమబద్ధమైన పెట్టుబడులు..
సిప్ ద్వారా ప్రతి నెలా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ల ర్యాలీల్లో పాల్గొనొచ్చు. అదే సమయంలో మార్కెట్లలో కరెక్షన్ల సమయంలోనూ కొనుగోలుకు అవకాశం లభిస్తుంది. ఏకమొత్తంలో పెట్టుబడికి ఈ వెసులుబాటు ఉండదు. అందుకని సిప్ రూట్‌లో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో అస్థిరతలను సులభంగా అధిగమించి రాబడులు పొందేందుకు వీలుంటుంది. ఈ వెసులుబాటే సిప్‌కు ఆదరణ పెంచుతోంది. వేతన జీవులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిప్ అన్నది పొదుపు అలవాటును ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు (పెట్టుబడులు) 2022 మర్చి చివరికి రూ.5.76 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.6.4 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి.
వార్షికంగా సిప్ ఆస్తులు 30 శాతం మేర పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణ ఆస్తుల వృద్ధి కంటే ఇది రెండు రెట్లు అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద నమోదైన మొత్తం సిప్ ఖాతాలు ఆగస్ట్ చివరికి 5.72 కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రధానంగా సిప్ పెట్టుబడులపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రూ.64.935 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించగా, ఇందులో రూ.61,258 కోట్లు సిప్ రూపంలో రావడం దీన్నే తెలియజేస్తోంది. వచ్చే 18-24 నెలల్లో సిప్ ద్వారా ప్రతి నెలా వచ్చే పెట్టుబడులు రూ.20,000 కోట్లకు చేరతాయని భావిస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ ఎండీ, సీఈవో ఆశిష్ శంకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment