ఏడాది వ్యవధిలో 56 శాతం వరకు రాబడులు
పరిశ్రమ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రపంచంలో బిజినెస్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. విస్తృత మార్కెట్‌తో పోలిస్తే ఇవి మెరుగ్గా రాబడులు అందిస్తుండటం ఇందుకు కారణం. గత ఏడాది వ్యవధిలో ఈ ఫండ్స్ 56 శాతం వరకు రాబడులు ఇచ్చినట్లు పరిశ్రమ గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం హెచ్‌ఎస్‌బీసీ, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ మొదలైన ఫండ్ హౌస్‌ల స్కీములు 50 శాతం పైగా రాబడులు అందించాయి.
ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీ 35.11 శాతం రాబడులు అందించింది. ఈ నేపథ్యంలో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. నిర్దిష్ట ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల్లో రాణించే రంగాలకు చెందిన స్టాక్స్‌ని గుర్తించి, ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ సైకిల్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి.
ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, రికవరీ తొలినాళ్లు, వృద్ధి మధ్య దశ, చివరి దశ వంటి పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో పెట్టుబడులను మారుస్తుంటాయి. ఉదాహరణకు మాంద్యం దశలో యుటిలిటీస్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలు మెరుగ్గా రాణించగలవు. అయితే వృద్ధి ప్రారంభమయ్యే తొలినాళ్లలో ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన స్టాక్స్ లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను అటూ–ఇటూ మారుస్తుండటమనేది ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
స్వల్ప సమయంలో అధిక రాబడులు అందిస్తుండటంతో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతోందని ఎప్సిలాన్ గ్రూప్‌లో భాగమైన మల్టీ ఆర్క్ వెల్త్ ఏవీపీ సిద్ధార్థ్ ఆలోక్ తెలిపారు. పరిస్థితులను బట్టి వివిధ సెక్టోరల్ ఫండ్స్‌కి మారేందుకు, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను పట్టుకునేందుకు వ్యక్తిగతంగా పరిశోధిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునే భారాన్ని ఈ ఫండ్స్ తగ్గిస్తాయని విస్‌డమ్ ఎడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యవస్థాపకుడు భావేష్ దమానియా తెలిపారు. అయితే, సాధారణంగా థీమ్యాటిక్ ఫండ్స్ పనితీరును లెక్కగట్టేందుకు కనీసం అయిదేళ్ల పాటైనా కార్యకలాపాలు ఉండాలని, ఇవన్నీ ఈ మధ్యే వచ్చాయి కాబట్టి ఇటీవలి కాలంలో పనితీరుపైనే ఆధారపడటం సరికాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.
16 ఫండ్స్..
ప్రస్తుతం దేశీయంగా 16 బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉండగా, 10 ఫండ్స్‌కి ఏడాది పైగా ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా గత 12 నెలల్లో నిఫ్టీ 500 టీఆర్‌ఐకి మించిన రాబడులు అందించాయి. పరిశ్రమ డేటా ప్రకారం 10 ఫండ్స్ సగటున 42 శాతం రాబడి అందించాయి. గత ఏడాది వ్యవధిలో అక్టోబర్ 17 వరకు.. హెచ్‌ఎస్‌బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 56.3 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 56.17 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 50.8 శాతం రాబడులు అందించాయి.
మరిన్ని విశేషాలు..
అధిక రాబడులు అందించిన వాటిలో బరోడా బీఎన్‌పీ పారిబా బిజినెస్ సైకిల్ ఫండ్ (44.58 శాతం రాబడి), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (42.27 శాతం), టాటా బిజినెస్ సైకిల్ ఫండ్ (41.26 శాతం), కోటక్ బిజినెస్ సైకిల్ ఫండ్ (40.03 శాతం), యాక్సిస్ బిజినెస్ సైకిల్ ఫండ్ (39.02 శాతం), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ (36.33 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ సైకిల్ ఫండ్ (31.97 శాతం) ఉన్నాయి.
→గత ఆరు నెలల వ్యవధిలో హెచ్‌ఎస్‌బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 26.72 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 20.88 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 17.7 శాతం రిటర్న్‌లు ఇచ్చాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఇండెక్స్ 15.2 శాతమే రాబడినిచి్చంది. మిగతా ఏడు ఫండ్స్ 13 శాతం నుంచి 23 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment