ఇటీవలి సమీక్షలో ఆర్‌బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయించింది. కీలక రేట్లలోనూ మార్పులు చేయలేదు. రేట్ల పెంపు 2022లోనే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కనుక భవిష్యత్తు రేట్ల విషయమై అనిశ్చితి ఉన్న సమయంలో.. మూడేళ్లకాలం కోసం ఇన్వెస్టర్లు డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఏఏఏ రేటెడ్ డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంపిక చేసుకోవడం సురక్షితం. ఐడీఎఫ్‌సీ బాండ్ ఫండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ (ఐడీఎఫ్‌సీ ఎస్‌టీఎఫ్), కోటక్ బాండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ (కోటక్ ఎస్‌టీఎఫ్) రెండూ ఈ విభాగంలో నాణ్యమైన పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తూ మెరుగైన పనితీరును చూపిస్తున్నాయి.
పెట్టుబడుల విధానం
షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ సాధారణంగా మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్లు అయిన కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సాధారణంగా వీటి కాల వ్యవధులు 1–3 ఏళ్ల మధ్య ఉంటుంది. అంటే దీర్ఘకాలం సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఈ డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయమే రాబడి అవుతుంది. ఇలా తక్కువ కాల వ్యవధి కలిగి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగితే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ మేరకు ప్రయోజనం అందుకోవచ్చు. అదే మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఫండ్స్ కొంచెం ఎక్కువ కాలంతో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కనుక.. వాటిల్లో వెంటనే ప్రయోజనం ఉండదు. అందుకే స్వల్పకాలానికి షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలం.
రాబడులు..
షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ విభాగం కంటే ఐడీఎఫ్‌సీ ఎస్‌టీఎఫ్, కోటక్ ఎస్‌టీఎఫ్ మెరుగైన పనితీరును చూపిస్తున్నాయి. కనీసం ఐదేళ్లకు పైగా పనిచేస్తూ.. రూ.300 కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులున్న పథకాలతో పోలిస్తే ఈ రెండు పథకాలు మెరుగ్గా ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 7.6 శాతంగా ఉంటే.. ఐడీఎఫ్‌సీ ఎస్‌టీఎఫ్, కోటక్ ఎస్‌టీఎఫ్ మాత్రం 7.9 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ విభాగం సగటు వార్షిక రాబడి 7.2 శాతంగాను, ఐదేళ్లలో 7.4 శాతం చొప్పున ఉండగా.. కోటక్ ఎస్‌టీఎఫ్, ఐడీఎఫ్‌సీ ఎస్‌టీఎఫ్ సగటున మూడేళ్లలో 7.6 శాతం, ఐదేళ్లలో 7.9 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించాయి. రాబడులను చూసేవారు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విభాగంలో అధిక రాబడులను అందించే ఇతర పథకాలు కూడా ఉన్నాయి. కానీ, వాటితో పోలిస్తే ఈ రెండు పథకాలు పెట్టుబడుల పరంగా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుసుకోవచ్చు. ఏఏఏ రెటెడ్ పేపర్లను ఎక్కువ భద్రతకు భరోసాగా చూడొచ్చు.
పోర్ట్‌ఫోలియో..
ఐడీఎఫ్‌సీ బాండ్ ఫండ్ ఎస్‌టీఎఫ్ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.12,700 కోట్ల పెట్టుబడులున్నాయి. వీటిల్లో 94 శాతం ఏఏఏ రేటెడ్ పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అదే విధంగా కోటక్ ఎస్‌టీఎఫ్ 95 శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు.. గత పెట్టుబడులను పరిశీలించినా కానీ ఏఏఏ రేటెడ్ సాధనాల్లో ఈ రెండు పథకాలు సగటున 90 శాతం, అంతకుపైనే నిర్వహిస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఎస్‌టీఎఫ్ పోర్ట్‌ఫోలియోలోని డెట్ సాధనాల సగటు మెచ్యూరిటీ (గడువు తీరే కాలం) 2.1 సంవత్సరాలుగా ఉంటుంది. కోటక్ ఎస్‌టీఎఫ్ మాత్రం రిస్క్‌ను వైవిధ్యం చేసేందుకు వీలుగా.. భిన్న కాల వ్యవధులతో కూడిన డెట్ సాధనాలను ఎంపిక చేసుకుంటోంది. కనుక ఈ పథకం పోర్ట్‌ఫోలియో సగటు మెచ్యూరిటీ 1.4 నుంచి 3.9 సంవత్సరాల మధ్య గత ఐదేళ్లలో ఉంది. ఈ రెండు పథకాలు 2021 ఏప్రిల్ నుంచి జీ–సెక్యూరిటీల్లో పెట్టుబడులను పెంచుకుంటున్నాయి. స్వల్ప కాలం కోసం (2–3 ఏళ్లు) ఇన్వెస్టర్లు ఈ పథకాలను పరిశీలించొచ్చు.
షార్ట్‌డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు ఎలా ఉంటాయి?
Published Mon, Oct 11 2021 11:00 AM | Last Updated on Mon, Oct 11 2021 11:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment