స్మాల్‌క్యాప్ ఫండ్స్ దీర్ఘకాలం పెట్టుబడులకు (రిటైర్మెంట్) అనుకూలమేనా? – వర్షిల్ గుప్తా
స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటీ సరిపోదు. నష్టాలకు, యూనిట్ల విలువ క్షీణతకు తట్టుకోగలిగి ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. అయినప్పటికీ స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు సులభమేమీ కాదు. అవి అదే పనిగా నిర్ణీత సమయాల్లో నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందకుండా ఉండడం కష్టం.
అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులుగా పెట్టరాదు. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారిందనడానికి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ పెద్దది, ఓ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కాదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది.
అనుకూలతలు
దీర్ఘకాంలో చిన్న కంపెనీలు సంపదను సృష్టించగలవు. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు. సాధారణంగా చిన్న కంపెనీలను ఎక్కువ మంది అనుసరించరు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మరీ చిన్న కంపెనీలకు దూరంగా ఉంటాయి.
ప్రతికూలతలు
ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువే ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా డైనమిక్‌గా ఉండేవి తక్కువే.
డెట్, ఈక్విటీల మధ్య అస్సెట్ (పెట్టుబడులు) అలోకేషన్ పరంగా ఏ విభాగం డెట్ ఫండ్స్ అనుకూలం? – ఎస్‌కే శర్మ
ఫైనాన్షియల్ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు అస్సెట్ అలోకేషన్ ముఖ్యమైనది. ఈక్విటీలు దీర్ఘకాలంలో రాబడులను ఇస్తాయి. డెట్ సాధనాలు తక్కువ రాబడులనే ఇచ్చినా, పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నిస్తాయి. డెట్ ఫండ్స్ రాబడులను వడ్డీ రేట్లు ప్రభావితం చేస్తాయనే దానిపై ఇన్వెస్టర్లకు అవగాహన ఉండాలి. బాండ్ల ధరలు, వడ్డీ రేట్ల మధ్య వ్యతిరేక సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే బాండ్ల ధరలు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుంటే బాండ్ల ధరలు పెరుగుతాయి. దీర్ఘకాల డెట్ ఫండ్స్‌లో అస్థిరతలు ఎక్కువ. డెట్ ఫండ్స్ పరంగా ఇన్వెస్టర్ల ముందు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల రిస్క్ లేదా క్రెడిట్ రిస్క్ ఎక్కువగా ఉండకూడదని అనుకుంటే.. అప్పుడు లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా లో డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ కూడా 91 రోజుల నుంచి ఏడాది కాలం సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అస్సెట్ అలోకేషన్ పరంగా డెట్ విభాగం నుంచి షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌కు చోటు ఇవ్వాలి.
ఏడాదిలోపే పెట్టుబడులను తిరిగి తీసుకునేట్టు అయితే లిక్విడ్ లేదా లో డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు హైబ్రిడ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే ఎక్కువ పెట్టుబడులను డెట్‌కు, ఈక్విటీలకు 25 శాతం మించకుండా కేంటాయింపులు చేస్తుంటాయి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు ఈక్విటీలకు 65–80 శాతం వరకు, మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తుంటాయి. ఇక డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాల మేనేజర్లు మార్కెట్లు, వడ్డీ రేట్ల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తుంటారు. ఈక్విటీలు ఎక్కువ దిద్దుబాటుకు లోనై స్టాక్స్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉంటే, అప్పుడు డెట్‌కు కేటాయింపులు తగ్గించి ఈక్విటీలకు పెంచుతారు. ఈక్విటీల వ్యాల్యూషన్లు ఖరీదుగా మారాయిని భావించినప్పుడు కొంత మేర విక్రయించి డెట్ పెట్టుబడులు పెంచుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment