దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్‌ఏ, పీఈ డీల్ ఇన్‌సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..
కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి.
డీల్స్ తీరిలా
క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్‌లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్‌ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి.
కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్‌లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్‌లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం.
Comments
Please login to add a commentAdd a comment