Real Estate Sector Likely To Raise Up To 13 Billion Dollars Equity Capital In 2023-24: CBRE - Sakshi
Sakshi News home page

దేశీ రియల్టీలో భారీ పెట్టుబడులు: ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు!

Published Wed, Mar 29 2023 12:47 AM | Last Updated on Wed, Mar 29 2023 3:44 PM

Real Estate Sector Likely To Raise Up To 13 Billion dollers Equity Capital In 2023-24 - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో(2023-24) దేశీ రియల్టీ రంగంలో 13 బిలియన్‌ డాలర్ల(రూ. 1,07,081 కోట్లు) వరకూ ఈక్విటీ పెట్టుబడులు లభించవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. గత ఐదేళ్లలో 32 బిలియన్‌ డాలర్ల(రూ. 2,63,584 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులు రియల్టీలోకి ప్రవహించినట్లు సీబీఆర్‌ఈ పేర్కొంది. రానున్న రెండేళ్లలో పెట్టుబడులు గరిష్టంగా కార్యాలయ ఆస్తులకు మళ్లవచ్చని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ సీబీఆర్‌ఈ అభిప్రాయపడింది.

ఏడాదికి 6-7 బిలియన్‌ డాలర్ల చొప్పున రెండేళ్లలో దేశీ రియల్టీ రంగం 12-13 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకునే వీలున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), పెన్షన్‌ ఫండ్స్, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, కార్పొరేట్‌ గ్రూప్‌లతోపాటు రీట్స్‌ తదితరాలు చేపట్టే ఈక్విటీ పెట్టుబడులపై సీబీఆర్‌ఈ నివేదిక రూపొందించింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

ఇతర విభాగాలకూ
రియల్టీ రంగ ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం ఆఫీస్‌ ఆస్తుల విభాగంలోకి ప్రవహించనుండగా.. ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్, స్థలాలు, ల్యాండ్‌ పార్శిల్స్‌ తదుపరి స్థానాల్లో నిలవనున్నాయి. ఇక వీటికి అదనంగా డేటా సెంటర్లకు ప్రధానంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌) లభించనున్నాయి. దేశీయంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి వంటి మూలాలు బలంగా ఉన్నట్లు సీబీఆర్‌ఈ చైర్మన్‌(ఆసియా, ఆఫ్రికా) అన్షుమన్‌ మ్యాగజైన్‌ పేర్కొన్నారు. వీటికితోడు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్యం రానున్న ఏడాదిలో రియల్టీ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు.

సరఫరా చైన్‌ అవసరాల రిస్కులను తగ్గించుకునేందుకు పలు ప్రపంచ కార్పొరేట్లు చైనా+1 వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఉత్పాదక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైతం దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండియాకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. వెరసి రానున్న ఐదారేళ్లలో గ్లోబల్‌ సప్లై చైన్‌ రంగంలో ఇండియా మార్కెట్‌ వాటా బలపడనున్నట్లు అంచనా వేశారు. ఈ సానుకూల అంశాలతో ఆర్థిక వ్యవస్థ వార్షికంగా వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రపంచ సగటును మించుతూ దేశీ రియల్‌ ఎస్టేట్‌ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు.  (ఇండియన్‌ టెకీలకు గిట్‌హబ్‌ షాక్‌: టీం మొత్తానికి ఉద్వాసన )

నగరాల ముందంజ
సీబీఆర్‌ఈ నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రధానంగా మెట్రో నగరాలు, టైర్‌–1 పట్టణాలు రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. 2018లో దేశీ రియల్టీ రంగంలో 5.9 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు లభించగా, 2019లో 6.4 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఈ బాటలో 2020లో 6 బిలియన్‌ డాలర్లు, 2021లో 5.9 బిలియన్‌ డాలర్లు, 2022లో 7.8 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు దేశీ రియల్టీలో నమోదైనట్లు సీబీఆర్‌ఈ గణాంకాలు తెలియజేశాయి. (స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్‌ గ్రోవర్‌ భావోద్వేగం)

2018-22 కాలంలో ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2018 నుంచి పెట్టుబడుల్లో ఈ నగరాలు 63 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే గత ఐదేళ్లలో నమోదైన 32 బిలియన్‌ డాలర్లలో 20 బిలియన్‌ డాలర్లు ఇక్కడికే ప్రవహించాయి. కాగా.. కార్యాలయ ఆస్తులు 13 బిలియన్‌ డాలర్లతో 40 శాతం వాటాను ఆక్రమించాయి. ఇదేవిధంగా స్థలాలు, ల్యాండ్‌ పార్శిల్స్‌ 12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అందుకున్నాయి. ఇది ఐదేళ్ల మొత్తం పెట్టుబడుల్లో 39 శాతం వాటాకు సమానం!

ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు
  2023-24పై ఇండియా రేటింగ్స్‌
  2022–23లో 8-10 శాతం మేర పెరగొచ్చు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చని ఇళ్ల ధరలు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపింది. రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి తటస్థ అంచనాలతో ఉన్నట్టు తెలిపింది. ‘‘నివాస రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2022–23లో క్రమబద్ధమైన అప్‌డ్రెంట్‌లో ఉంది. టాప్‌ 8 రియల్‌ ఎస్టేట్‌ క్లస్టర్లలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాలు పెరిగినా, మార్ట్‌గేజ్‌ రేట్లు పెరిగినా, దేశీయంగా, అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి తగ్గినా అమ్మకాలు పెరగడం ఆశాజనకనం’’అని ఇండియా రేటింగ్స్‌ తన నివేదికలో తెలిపింది.

మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్వల్పకాలానికి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపించొచ్చని, మొత్తం మీద నివాస రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఈ ఒత్తిళ్లను సర్దుబాటు చేసుకోగలదనే అంచనాలను వ్యక్తం చేసింది. డిమాండ్‌ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపింది. అమ్మకాల ఊపు కొనసాగుతుందని, మొత్తం మీద వార్షికంగా చూస్తే విక్రయాలు 9 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 2022-23లో నిర్మాణ వ్యయాలు 8–10 శాతం మేర పెరిగాయని, దీంతో డెవలపర్లకు నిర్మాణ బడ్జెట్‌ 5–6 శాతం మేర అధికం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ డెవలపర్లు వచ్చే ఆరేడు నెలలపాటు ధరలు పెంచకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో డిమాండ్‌ బలపడే వరకు వేచి చూడొచ్చని పేర్కొంది.

అందుబాటు ధరలు..
అందుబాటు ధరలు 2021-22లో ఇళ్ల అమ్మకాలను నడిపించినట్టు ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ‘‘అయితే ద్రవ్యోల్బణం అమ్మకాల ధరలను పెంచేలా చేశాయి. 2022 మే నుంచి ఆర్‌బీఐ వరుసగా రెపో రేటు పెంపు 2022- 23లో అందుబాటు ధరల ఇళ్ల విభాగం డిమాండ్‌కు సవాలుగా నిలిచాయి. అంతేకాదు, మధ్య, ప్రీమియం విభాగంలోనూ కొనుగోళ్లను వాయి దా వేయడానికి దారితీశాయి. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని పెద్ద సంస్థలు, మంచి బ్రాండ్‌ విలువ కలిగినవి, 2023-24లో బలమైన నిర్వహణ పనితీరు చూపిస్తాయి. తద్వారా వాటి మార్కెట్‌ షేరు పెరగొచ్చు’’అని పేర్కొంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని డెవలపర్లు బలహీన అమ్మకాలు, వసూళ్లు, నిధుల లభ్యత పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement