హైదరాబాద్‌లో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రూ. 36,461 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ తన నివేదికలు వెల్లడించింది. ఈ సేల్స్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు సమాచారం. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య (59,386) కూడా గణనీయంగా పెరిగింది.
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2023లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 6,304 యూనిట్లు (రూ. 3,459 కోట్లు). 2024 సెప్టెంబర్‌లో ఈ అమ్మకాలు కేవలం 4,903 యూనిట్లు (రూ.2,820 కోట్లు) మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇళ్ల అమ్మకాలు ఈ సెప్టెంబర్‌లో 22 శాతం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లో రూ. 50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల విక్రయాలు 9 శాతం నుంచి 14 శాతానికి చేరాయి.
సెప్టెంబర్ 2024లో హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. 2000 అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తుల సేల్స్ కూడా ఆశాజనంగానే ఉన్నాయి.
జిల్లా స్థాయిలో, మేడ్చల్-మల్కాజ్‌గిరి మార్కెట్‌లో 42 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. సెప్టెంబర్ 2023లో ఈ రిజిస్ట్రేషన్స్ 45 శాతం కావడం గమనార్హం. మొత్తం రిజిస్ట్రేషన్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా 39 శాతం, 19 శాతం వాటా కలిగి ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర సెప్టెంబర్ 2024లో 3 శాతం పెరిగింది. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 7 శాతం పెరుగుదల జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డిలు వరుసగా 3 శాతం, 2 శాతం పెరుగుదల జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment