LTCG Tax
-
స్టాక్ మార్కెట్‌పై పన్నుల పిడుగు
రూపాయి: 83.72 ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అటు ఇంట్రాడే, ఇటు ముగింపు రెండింటిలో చరిత్రాత్మక కనిష్టాలను చూసింది. ఇంట్రాడేలో 83.72 స్థాయిని తాకితే, చివరికి క్రితం ముగింపుతో పోలి్చతే 3 పైసలు నష్టంతో 83.69 వద్ద ముగిసింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేట్ల పెంపు రూపాయి నష్టానికి కారణం. న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచాయి.అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్ సరీ్వసెస్, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, సరీ్వసెస్, ఫార్మా, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు బడ్జెట్ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 80,725 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎఫ్అండ్ఓ సెక్యూరిటీలపై ఎస్టీటీ, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ పన్నుల పెంపు ప్రకటనలతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 1,278 పాయింట్లు క్షీణించి 79,224 పాయింట్ల వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు కుప్పకూలి 24,074 పాయింట్ల వద్ద కనిష్టాలను తాకాయి.పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రకటన తరువాత.., కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో సూచీలు కనిష్టాల నుంచి రికవరీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది. ‘‘బడ్జెట్లో మూలధన వ్యయాలకు అధిక కేటాయింపులు ఉండొచ్చని ఆశించారు. స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ)0.1%, 0.02 శాతం పెంపు అంశాలు స్టాక్ మార్కెట్‌కు కచి్చతంగా ప్రతికూల అంశాలు.స్వల్ప కాలం పాటు ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అధిక కేటాయింపు ప్రకటనలు మార్కెట్ నష్టాలు తగ్గించాయి’’ మెహ్తా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. ⇒ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపుతో పాటు ఉద్యోగ కల్పనలకు పెద్ధ పీట వేయడంతో కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. ఐటీసీ షేరు 5%, టాటా కన్జూమర్స్ ప్రొడెక్ట్స్, డాబర్ షేర్లు 3% పెరిగాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడెక్ట్స్, హెచ్‌యూఎల్, మారికో, బ్రిటానియా, కోల్గేట్, యూనిటెడ్ బేవరేజెస్, యూనిటెడ్ స్పిరిట్స్, బలరామ్‌పుర్ చినీ షేర్లు 2% నుంచి ఒకశాతం లాభపడ్డాయి. -
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
స్టాక్స్‌లో లాభాలపై పన్ను ఆదా..!
రూపాయిని ఆదా చేశామంటే.. రూపాయిని సంపాదించినట్టే. ఇది ఎప్పటి నుంచో మనం వినే సామెతే. అన్ని తరాలకూ ఇది వర్తిస్తుంది. కరోనా కల్లోలం వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన వాతావరణంలో చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి అడుగుపెట్టారు. ఇంటి నుంచే అదనపు ఆదాయం కోసం స్టాక్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకున్నారు. దీనికి నిదర్శనం సీడీఎస్ఎల్ వద్ద ఆరు నెలల్లోనే కోటి డీమ్యాట్ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు పెట్టుబడులు, విక్రయాలపైనే దృష్టి పెడుతుంటారు కానీ, పన్ను అంశాన్ని అంతగా పట్టించుకోరు. స్టాక్ మార్కెట్లో ఆర్జించే లాభాలపై పన్ను చెల్లించాలన్న అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ‘స్మార్ట్’గా అడుగులు వేయడం ద్వారా ఈ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో.. ఇవి గమనించండి... ► ఏడాది, అంతకుమించిన పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు లాభంపై పన్ను ఉండదు. ► రూ.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభం కనిపిస్తుంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు భాగాలుగా తీసుకోవచ్చు. ► లాభాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. నష్టాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా పన్ను తగ్గించుకోవచ్చు. ► నివాస గృహంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్టీసీజీ భారాన్ని దింపుకోవచ్చు. నష్టాలతో సర్దుబాటు.. 2018 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఎల్టీసీజీ పన్నును ప్రతిపాదించారు కనుక ఆ ముందు రోజు వరకు చేసిన పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. ‘‘నూతన నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఉన్న పెట్టుబడులకు సాధారణంగా మినహాయింపునిస్తుంటారు. దీన్నే గ్రాండ్‌ఫాదరింగ్ అంటారు. కనుక 2018 జనవరి 31 నాటి వరకు చేసిన పెట్టుబడులు గ్రాండ్ ఫాదరింగ్‌కు అర్హత కలిగినవి’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ తెలిపారు. అంటే 2018 జనవరి 31 వరకు చేసిన పెట్టుబడులకు.. కొనుగోలు తేదీగా 2018 జనవరి 31ని పరిగణిస్తుంది చట్టం. ఆ తర్వాత తేదీ నుంచి ఆర్జించిన దీర్ఘకాల మూలధన లాభాలపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాలు రెండింటితోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. అదే ఎల్టీసీఎల్ అయితే ఎల్టీసీజీతోనే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా ఎనిమిదేళ్లపాటు దీర్ఘకాల, స్వల్పకాల మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే.. అందుకోసం గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే. పన్ను బాధ్యత ఈక్విటీల్లో (స్టాక్స్) నేరుగా చేసిన పెట్టుబడులు లేదా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్టాక్స్‌లో పెట్టుబడులైనా సరే.. ఏడాది, అంతకు మించి కొనసాగించిన తర్వాత విక్రయించినట్టయితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా (ఎల్టీసీజీ) ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. ఒకవేళ నష్టం వస్తే దాన్ని దీర్ఘకాలిక మూలధన నష్టం(ఎల్టీసీఎల్)గా చూస్తారు. అదే ఏడాది లోపు విక్రయించగా వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ)గాను.. నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం(ఎస్టీసీఎల్)గాను పరిగణిస్తారు. ఎల్టీసీజీపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. రూ.లక్షకు మించి ఉన్న లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్‌టీసీజీపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఇందులో బేసిక్ పరిమితి అంటూ ఏదీ లేదు. అంటే ఏడాదిలోపు పెట్టుబడులపై లాభం రూ.1,000 వచ్చినా ఆ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఎల్టీసీజీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొద్ది కొద్దిగా... పన్ను ఆదా చేసుకునేందుకు మరో మార్గం.. ఒకే విడత వెనక్కి తీసేసుకోకుండా పరిమితి పాటించడం. ‘‘ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపంలో షేర్లపై ఎల్టీసీజీ రూ.2లక్షలు ఉందనుకుంటే ఒకే పర్యాయం మొత్తాన్ని విక్రయించకుండా రెండు భాగాలు చేసుకుని.. ఒక భాగాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలోనూ, మరో భాగాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వెనక్కి తీసుకోవాలి’’ అని ట్యాక్మన్కు చెందిన వాధ్వాన్ సూచించారు. అప్పుడు పన్ను భారం సున్నా అవుతుంది. ఒకవేళ మూలధన లాభాల పన్ను గణనీయంగా ఉన్నట్టయితే.. అప్పుడు రెండు భాగాలు చేసినా కానీ చెల్లించాల్సిన పన్ను గణనీయంగా ఏమీ తగ్గదు. పన్ను ఆదా కోసం పెట్టుబడుల ఉపసంహరణను మరింత దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం కూడా సరికాదు. దీనివల్ల మార్కెట్లో పరిస్థితులు మారిపోతే రిస్క్‌లో చిక్కుకున్నట్టు అవుతుంది. దీనికి మోహన్ మరో పరిష్కారాన్ని సూచించారు. ‘‘పెద్ద పోర్ట్‌ఫోలియో నిర్వహించే వారు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం మినహాయింపు తర్వాత కూడా పన్ను చెల్లించాల్సిన లాభం ఉన్నట్టయితే పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లడమే’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ పేర్కొన్నారు. అంటే మూలధన లాభాల పన్ను రూ.లక్షకు సమీపించగానే విక్రయించడం.. తిరిగి మరుసటి రోజు కొనుగోలు చేయడం. దీనివల్ల లావాదేవీల వ్యయాలే తప్పించి మూలధన లాభాల పన్ను భారం ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కూ ఇదే అమలవుతుంది. ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసిన (సిప్ అయితే విడిగా ప్రతీ సిప్ కొనుగోలు చేసిన తేదీ నుంచి) నాటి నుంచి ఏడాది, ఆ తర్వాత విక్రయించగా వచ్చిన లాభంపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను చెల్లించాలి. కనుక షేర్లు, ఈక్విటీ ఫండ్స్ విషయంలో పెట్టుబడి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే అందులోని మూలధన లాభాన్ని రూ.లక్ష వరకు తీసేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే ఏడాది రాకుండా విక్రయిస్తే పన్ను భారం 15 శాతం అవుతుందని మర్చిపోవద్దు. అలాగే, మీ పోర్ట్ఫోలి యోలోని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు అన్నింటికీ పన్ను లేని మూలధన లాభం గరిష్టంగా రూ.లక్షే అవుతుంది. ఒక్కో దానికి విడిగా రూ.లక్ష అనుకోవద్దు. ఇల్లు కొనుక్కోవడం ఈక్విటీ షేర్ల విక్రయాలపై ఎల్టీసీజీ పన్ను మినహాయింపు కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ కింద.. నూతన ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి ఆ మొత్తాన్ని వినియోగించాలి. కేవలం లాభాలే కాకుండా విక్రయం ద్వారా సమకూరిన మొత్తాన్ని నూతన ఇంటిపై వినియోగించాలి. మొదటి ఇంటికే ఇది పరిమితం. నూతన ఇల్లు కొనుగోలు అయితే ఈక్విటీ షేర్లను విక్రయించిన నాటి నుంచి రెండేళ్లలోగా చేయాలి. నూతన ఇంటి నిర్మాణం కోసం వినియోగించేట్టు అయితే మూడేళ్లలోగా చేయాలి. అంతేకాదు ఇలా చేసిన తర్వాత ఏడాది లోపు రెండో ఇల్లు కొనుగోలు చేయకూడదు లేదా మూడేళ్లలోపు రెండో ఇంటిని నిర్మించకూడదు. అలాగే మూలధన లాభాల పన్ను మినహాయింపునకు కొనుగోలు చేసిన మొదటి ఇంటిని లేదా నిర్మించుకున్న ఇంటిని మూడేళ్ల వరకు విక్రయించకూడదు. ఈ నిబంధనలను పాటించకపోతే కల్పించిన మినహాయింపులను త్యజించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించిన సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు సమయం సమీపిస్తున్నట్టయితే క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని రిటర్నుల్లో పేర్కొనాలి. ఆ తర్వాత చట్టం అనుమతించిన సమయంలోపు మొదటి ఇంటిని సమకూర్చుకోవడంపై వ్యయం చేయాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించడానికి ముందు ఏడాదిలోపు నూతన ఇంటిని కొనుగోలు చేసినా పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను భారం వద్దనుకుంటే అందుకోసం 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఎక్కువ ఆదా అయితేనే ప్రయోజనం చిన్న ఇన్వెస్టర్లకు ఇంతకు ముందు పేర్కొన్న విధాలనాలతో పన్ను ఆదా చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. మరి రూ.కోట్లలో పెట్టుబడులను నిర్వహించే వారు ఏటా రూ.లక్ష వరకే మూలధ లాభాలను పరిమితం చేసుకోవడం ఆచరణలో అసాధ్యం. కనుక వారు మొత్తం పోర్ట్‌ఫోలియోని సమీక్షించుకుని.. స్వల్పకాల నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా.. అటు స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను భారాన్ని కొంత వరకు అయినా తగ్గించుకోవచ్చు. ‘‘ఎల్‌టీసీజీని సరిగ్గా మదింపు వేసుకోవడమే కాకుండా లాభ, నష్టాల సర్దుబాటులో భాగంగా విక్రయించిన స్టాక్స్‌ను మరుసటి రోజు మళ్లీ కొనుగోలు చేసుకోవాలి. విక్రయించిన పెట్టుబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేసేందుకు సమయం తీసుకుంటే ఈ లోపు ఆ నిధులు వేరే అవసరాలకు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల విషయంలో రాజీపడాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంటుంది. విక్రయించిన ధరకే తిరిగి కొనుగోలు చేసకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ ఉంటుందని చెప్పడానికి లేదు. ధరల్లో గణనీయమైన వ్యత్యాసం కూడా రావచ్చు. విక్రయించిన తర్వాత స్టాక్ ధర పడిపోతే లాభమే కానీ, పెరిగిపోతేనే సమస్య. మ్యూచువల్ ఫండ్స్ అయితే విక్రయించిన మేర ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు చేరుకునేందుకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి తీసుకోవచ్చు. కనుక తిరిగి ఇన్వెస్ట్ చేసే సమయానికి ధరల్లో వ్యత్యాసం వస్తే ఈ విధమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే ఇలా చేయడం వల్ల ఎంత మేర మూలధన లాభాల పన్ను ఆదా అవుతుందన్న అంచనాకు ముందుగానే రావాలి. కనీసం 10–20 శాతం మేర ఆదా అవుతుందనుకుంటే ధరల పరంగా రిస్క్‌ను అధిగమించే వెసులుబాటు ఉంటుంది. అంతేకానీ, కొద్ది మేర పన్ను ఆదా కోసం హోల్డింగ్స్‌ను విక్రయించడం అంతగా కలసిరాకపోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ అయితే స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజీ, ఎక్సే్ఛంజ్ చార్జీలు చెల్లించుకోవాలి. దీనికి ధరల్లో వ్యత్యాసం అదనం. -
ఎల్టీసీజీ రద్దు చేయాలి...
ఎల్టీసీజీ ఎత్తివేత వంటి డిమాండ్లను కేంద్రం ఈసారైనా పరిగణనలోకి తీసుకోవాలని మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమ కోరుతోంది. వీటితో దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు తోడ్పాటు లభించడంతో పాటు ఎకానమీని పటిష్టంగా చేసేందుకు, బాండ్ మార్కెట్ మరింతగా విస్తృతి చెందేందుకు, ఇన్ఫ్రా వృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధుల లభ్యత పెరగగలదని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ పేర్కొంది. అలాగే, పెట్టుబడులను భౌతికరూపంలో పసిడి నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌లకు కూడా మళ్లించేలా చర్యలు తీసుకుంటే ద్రవ్య లోటు కూడా కట్టడి కాగలదని తెలిపింది. ►తక్కువ వ్యయాలు, తక్కువ రిస్కులతో పాటు పన్ను మినహాయింపుల ప్రయోజనం ఉండే డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ►పన్ను విషయంలో యులిప్స్, ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌ను సరిసమానంగా పరిగణించాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ని రద్దు చేయాలి. రిడెంప్షన్ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌పై విధిస్తున్న ఎస్టీటీని రద్దు చేయాలి. ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ చెల్లించే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను తొలగించాలి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అటూ, ఇటూ మారేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►మ్యూచువల్ ఫండ్స్‌ను స్పెసిఫైడ్ లాంగ్ టర్మ్ అసెట్స్‌గా పరిగణించాలి. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 54 ఈసీ కింద ఎల్టీసీజీ నుంచి మినహాయింపునివ్వాలి. ►లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల తరహాలోనే ఎల్టీసీజీ విధింపునకు సంబంధించి బంగారం, కమోడిటీ ఈటీఎఫ్‌లలో హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలి. ►డెట్ స్కీమ్‌లపై డీడీటీని తగ్గించాలి. -
‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: మందగమన బాటలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును మెరుగుపర్చేందుకు, విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు.. మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) ట్యాక్స్, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)లను తగ్గించే విధంగా.. వాటి స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీతి అయోగ్, ఆర్థిక శాఖలో భాగమైన రెవెన్యూ విభాగంతో కలిసి ప్రధాని కార్యాలయం (పీఎంవో) వీటిని సమీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నవంబర్ ఆఖరు నాటికి దీనిపై కసరత్తు పూర్తి కావచ్చు. బడ్జెట్లో లేదా అంతకన్నా ముందే ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చు‘ అని వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న కేంద్రం ప్రవేశపెట్టవచ్చని అంచనా. సావరీన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా తదితర రంగాల సంస్థలు.. దేశీ ఈక్విటీల్లో మరింత పెట్టుబడులు పెంచేందుకు ప్రోత్సహించే విధంగా ..ఇతర దేశాలకు దీటుగా దేశీయంగా పన్ను రేట్లను సవరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. ‘ఈక్విటీ, డెట్, కమోడిటీల మార్కెట్ల పన్ను రేట్లను సమీక్షిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెన్షన్ ఫండ్స్ నుంచి దేశీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు ఆకర్షించాలంటే పెద్ద ప్రతిబంధకంగా ఉంటోందన్న అభిప్రాయాల నేపథ్యంలో డీడీటీని గణనీయంగా తగ్గించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పన్నులను సమీక్షించేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. దీన్ని ఏకంగా తొలగిం చాలని సిఫార్సు చేసింది‘ అని వివరించారు. ఎల్టీసీజీ..డీడీటీ..ఏంటంటే.. షేర్ల విక్రయంతో ఇన్వెస్టరుకు లాభాలు వచ్చిన పక్షంలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పైబడి అట్టే పెట్టుకున్న షేర్లను విక్రయిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం ఎల్టీసీజీ అమల్లోకి వచ్చింది. ఒకవేళ లాభాలు రూ. లక్ష దాటితేనే ఇది వర్తిస్తుంది. ఏడాది వ్యవధి లోపే షేర్లను విక్రయించిన పక్షంలో స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ) ట్యాక్స్ 15% మేర వర్తిస్తుంది. ఇక, కంపెనీలు తమ వాటాదారులకు పంచే డివిడెండుపై ప్రస్తుతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(సెస్సులు, సర్‌చార్జీలన్నీ కలిపి) 20.35% స్థాయిలో ఉంటోంది. ఎల్టీసీజీ, డీడీటీలపై దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. రూ. 1.5 లక్ష కోట్ల ఆదాయానికి గండి.. పన్ను రేట్లలో కోతలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను మరింతగా విక్రయించడం, పన్ను రాబడులను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి చర్యలతో దీన్ని భర్తీ చేసుకోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత కొద్ది నెలలుగా పలు సంస్కరణలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై మరింత దూకుడు, బడ్జెట్లో జరిపిన కేటాయింపులను వినియోగించుకునేలా ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ బ్యాంకులు.. చిన్న సంస్థలకు రుణాలిచ్చేలా చర్యలు వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆగ్నేయాసియా మొత్తం మీద భారత్‌లోనే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువగా ఉంది. ఈ సంస్కరణలు.. దేశీ స్టాక్ మార్కెట్లకు, ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిస్తున్నాయి. ఆదాయపు పన్ను రేటూ తగ్గింపు: డీబీఎస్ కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటును కూడా భారత్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచవచ్చని వివరించింది. రూ. 5 లక్షలకు పైబడిన ఆదాయాలపైనా ట్యాక్స్ రేటును తగ్గించవచ్చని తెలిపింది. దీని వల్ల చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని, మధ్య స్థాయిలో ఉన్న వారికీ ఓ మోస్తరు ఊరట లభించగలదని.. పై స్థాయి శ్లాబ్‌లో ఉన్న వారికి మాత్రమే పన్ను భారం పెరగవచ్చని డీబీఎస్ బ్యాంకు పేర్కొంది. -
రాఘవ్ బాహల్ ఇంట్లో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మీడియా అధిపతి రాఘవ్ బాహల్ నివాసం, కార్యాలయంపై గురువారం ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దాడులు జరిపింది. నకిలీ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎల్టీసీజీ) పత్రాల కేసులో నోయిడాలోని రాఘవ్ బాహల్ నివాసంతోపాటు, క్వింట్ న్యూస్ పోర్టల్ కార్యాలయంపై గురువారం తమ అధికారులు సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇదే కేసులో జె.లల్వానీ, అనూప్ జైన్, అభిమన్యు అనే అధికారుల కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు. వీరితో వ్యాపార లావాదేవీలు జరిపిన ఇతర దేశాల్లోని సంస్థలపైనా తమ విచారణ కొనసాగుతుందని ఐటీ శాఖ పేర్కొంది. తనిఖీల సమయంలో ముంబైలో ఉన్న రాఘవ్ బాహల్ ట్విట్టర్లో స్పందిస్తూ..‘మా సంస్థ అన్ని పన్నులను చెల్లిస్తోంది. అవసరమైన అన్ని పత్రాలను అధికారులకు అందుబాటులో ఉంచుతాం. సోదాల్లో పాలుపంచుకుంటున్న యాదవ్ అనే పేరున్న ఐటీ అధికారితో ఫోన్లో మాట్లాడా. పాత్రికేయ సంబంధ కీలక పత్రాలు, మెయిళ్లు, ఇతర వస్తువులను చూడటం, తీసుకువెళ్లడం, ఫొటోలు తీయడం వంటివి చేయరాదని కోరాను. అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించా’అని పేర్కొన్నారు. ఎడిటర్స్ గిల్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా అయిన రాఘవ్ బాహల్ ది క్వింట్ న్యూస్ పోర్టల్‌తోపాటు నెట్వర్క్18 గ్రూప్‌ల వ్యవస్థాపకుడు. రాఘవ్ బాహల్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ‘ప్రేరేపిత’ ఐటీ దాడులు మీడియా స్వేచ్ఛకు భంగకరమనీ, ఇటువంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరింది. -
రేపటి నుంచే కొత్త పన్నులు
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) సహా పలు బడ్జెట్ ప్రతిపాదనలు 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 14 ఏళ్ల విరామం తర్వాత ఎల్టీసీజీ మళ్లీ అమలు కానుంది. షేర్లను కొని ఏడాది దాటిన తర్వాత విక్రయించినట్టయితే లాభం ఒక ఏడాదిలో రూ.లక్ష మించితే 10% పన్ను చెల్లించాలి. కొన్న తర్వాత ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చే లాభంపై 15% స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ప్రస్తుతం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. 2004 జూలైలో అప్పటి ప్రభుత్వం ఎల్‌టీసీజీని ఎత్తేసి దాని స్థానంలో సెక్యూరిటీల లావాదేవీల పన్నును (ఎస్టీటీ) ప్రవేశపెట్టింది. దీన్ని అలాగే ఉంచి, తిరిగి ఎల్టీసీజీ భారాన్ని మోపారు. కాకపోతే ద్రవ్యోల్బణ తరుగు ప్రయోజనాన్ని మినహాయించుకునే అవకాశం ఇవ్వడం ఒక్కటే కాస్త ఊరట. ఆదాయపన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పుల్లేవు. అమల్లోకి వచ్చే ప్రతిపాదనలు ఇవీ... ♦ వార్షికంగా రూ.250 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రయోజనం. ♦ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ స్థానంలో వేతన జీవులకు వార్షికంగా రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ తెచ్చారు. ప్రస్తుతం రూ.19,200 వరకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, రూ.15,000 వరకు మెడికల్ అలవెన్స్‌కు పన్ను లేదు. వీటిపై మినహాయింపులను ఎత్తేస్తూ ప్రామాణికంగా రూ. 40,000 పన్ను తగ్గింపునకు వీలు కల్పించారు. ♦ సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లుపైన) వార్షికంగా రూ.10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండగా, అది ఐదు రెట్లు పెరిగి రూ.50,000 అవుతోంది. ♦ 60 ఏళ్లు పైబడిన వారికి క్రిటికల్ ఇల్నెస్ కింద పన్ను మినహాయింపు రూ.60,000కు పెరుగుతోంది. అలాగే, 80ఏళ్లు దాటిన వృద్ధులకు ఇది రూ.80,000గా మారనుంది. ♦ సెక్షన్ 80డి కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వైద్య ఖర్చులకు చేసిన ఆదాయం ఇకపై రూ.50,000 వరకు పన్ను ఉండదు. ♦ అధిక ఆదాయ వర్గాలకు ఆదాయ పన్నుపై సెస్సు 3 నుంచి 4 శాతానికి పెరుగుతోంది. -
ఎల్టీసీజీ పన్ను.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
నేను సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో 2,3 ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మళ్లీ వచ్చింది కదా ! అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ అమ్మేసి, తిరిగి వేరే మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయమంటారా ? లేకుంటే సిప్‌లను అలాగే కొనసాగించమంటారా ? - నిరంజన్, హైదరాబాద్ దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) మళ్లీ వచ్చింది. అయితే ఈ పన్ను కారణంగా మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ అమ్మేసి, మళ్లీ కొనుగోలు చేయనవసరం లేదు. ఈ ఏడాది జనవరి 31 వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు వచ్చిన లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన లాభాలపై మాత్రమే పన్ను ఉంటుంది. మీరు ఏప్రిల్ 1 తర్వాత విక్రయిస్తేనే, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎల్టీసీజీ విధింపు అందరి ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలపై ఎల్టీసీజీ చాలా స్వల్పం. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నట్లయితే నిశ్చింతగా ఉండండి. మీ సిప్‌లను కొనసాగించండి. ఎల్టీసీజీ విధింపు కారణంగా ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకండి. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఏమేం చార్జీల భారం ఇన్వెస్టర్లపై ఉంటుంది ? బయటకు కనిపించని చార్జీలు ఏమైనా ఉంటాయా? -రాజేశ్, విజయవాడ మ్యూచువల్ ఫండ్స్ చార్జీలన్నీ పారదర్శకంగానే ఉంటాయి. బయటకు కనిపించని చార్జీల భారం ఏమీ ఇన్వెస్టర్లపై ఉండదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసేటప్పుడు ఒకే ఒక చార్జీ-ఎక్స్పెన్స్ రేషియో(దీంట్లోనే అన్ని చార్జీలూ కలసి ఉంటాయి) ఉంటుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియోలోనే మేనేజ్మెంట్ ఫీజు, విక్రయాల వ్యయాలు, నిర్వహణ చార్జీలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలసి ఉంటాయి. ఒకే మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన రెగ్యులర్ ప్లాన్‌కు, డైరెక్ట్ ప్లాన్‌కు ఈ ఎక్స్పెన్స్ రేషియో వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కు ఎక్స్పెన్స్ రేషియో 2.5 శాతం నుంచి 2.65 శాతం రేంజ్లో ఉంటుంది. ఇదే మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌కు అయితే ఎక్స్పెన్స్ రేషియో 50-75 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎక్స్పెన్స్ రేషియో ఇంకా తక్కువగా ఉంటుంది. ఇక తర్వాత ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను మీరు కొనుగోలు చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. వివిధ రకాల ఫండ్స్‌కు ఈ టైమ్ పీరియడ్ వేర్వేరుగా ఉంటుంది. డెట్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేసిన నెల రోజులు, మూడు నెలలలోపు విక్రయిస్తే, వాటిపై కూడా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌కు అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఎగ్జిట్ లోడ్ మళ్లీ మ్యూచువల్ ఫండ్‌లోకే వస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెళ్లదు. మ్యూచువల్ ఫండ్‌లోని ఇతర ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనం కలిగించే విషయమే. నా వయసు 25 సంవత్సరాలు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మార్కెట్ గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు మాలాంటి యువ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయవచ్చా ? లేక మార్కెట్ పడేంత వరకూ ఎదురు చూడాలా? - అనంత్, విశాఖపట్టణం మీరు యువకులు. టైమ్ అంతా మీ చెంతనే ఉంటుంది. అందుకని ముందుగా ఏదైనా కన్సర్వేటివ్ ఫండ్‌ను ఎంచుకోండి. దాంట్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం కొనసాగించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉందా, పతన బాటలో ఉందా అన్న విషయాన్ని పక్కన బెట్టి, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. 2016, 2017ల్లో కూడా మార్కెట్ గరిష్ట స్థాయిల్లోనే ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్ పతనమైన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఎదురు చూశారు. కానీ, మార్కెట్ పడకపోగా, మరింతగా పెరిగింది. దీర్ఘకాలం దృష్ట్యా చూస్తే, మార్కెట్ పతనం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. మీరు యువకులు కాబట్టి, మార్కెట్ అంటే భయపడవద్దు. మీకు మరో ఐదేళ్లపాటు అవసరం లేని సొమ్ములనే షేర్లలోనూ, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయాలి. ముందుగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ఇలా మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వస్తుంది. అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి వస్తారు. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత విద్యావసరాలు, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు తదితర దీర్ఘకాల ఆర్థిక అవసరాల కోసం చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. మరోవైపు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలి. సాధారణ జీవిత బీమా పాలసీలతో పోల్చితే టర్మ్ బీమా పాలసీల్లో చెల్లించాల్సిన ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది.