న్యూఢిల్లీ: పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మీడియా అధిపతి రాఘవ్ బాహల్ నివాసం, కార్యాలయంపై గురువారం ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దాడులు జరిపింది. నకిలీ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎల్‌టీసీజీ) పత్రాల కేసులో నోయిడాలోని రాఘవ్ బాహల్ నివాసంతోపాటు, క్వింట్ న్యూస్ పోర్టల్ కార్యాలయంపై గురువారం తమ అధికారులు సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇదే కేసులో జె.లల్వానీ, అనూప్ జైన్, అభిమన్యు అనే అధికారుల కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు. వీరితో వ్యాపార లావాదేవీలు జరిపిన ఇతర దేశాల్లోని సంస్థలపైనా తమ విచారణ కొనసాగుతుందని ఐటీ శాఖ పేర్కొంది. తనిఖీల సమయంలో ముంబైలో ఉన్న రాఘవ్ బాహల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ..‘మా సంస్థ అన్ని పన్నులను చెల్లిస్తోంది.
అవసరమైన అన్ని పత్రాలను అధికారులకు అందుబాటులో ఉంచుతాం. సోదాల్లో పాలుపంచుకుంటున్న యాదవ్ అనే పేరున్న ఐటీ అధికారితో ఫోన్‌లో మాట్లాడా. పాత్రికేయ సంబంధ కీలక పత్రాలు, మెయిళ్లు, ఇతర వస్తువులను చూడటం, తీసుకువెళ్లడం, ఫొటోలు తీయడం వంటివి చేయరాదని కోరాను. అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించా’అని పేర్కొన్నారు. ఎడిటర్స్ గిల్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా అయిన రాఘవ్ బాహల్ ది క్వింట్ న్యూస్ పోర్టల్‌తోపాటు నెట్‌వర్క్18 గ్రూప్‌ల వ్యవస్థాపకుడు. రాఘవ్ బాహల్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ‘ప్రేరేపిత’ ఐటీ దాడులు మీడియా స్వేచ్ఛకు భంగకరమనీ, ఇటువంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment