
ఈక్విటీ మార్కెట్‌లు ఇటీవల కాలంలో భారీగా పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక లాభాలపై వచ్చే రాబడులపై పన్నుల ప్రభావాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. భారత ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) నిర్మాణాన్ని సమీక్షించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. రెవెన్యూ ఆందోళనల కారణంగా పూర్తి పన్నును ఉపసంహరించుకోవడం సాధ్యం కానప్పటికీ, దాని నిర్మాణాన్ని సవరించాలని తెలియజేస్తున్నాయి. దానివల్ల భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఆశావహం వ్యక్తం చేస్తున్నాయి.
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల లాభాలపై పన్ను విధించే అతికొద్ది మార్కెట్లలో భారత్ ఒకటి. భారీ నష్టాలు, తక్కువ రాబడులు, పన్ను భారాలు భారతీయ ఈక్విటీ మార్కెట్‌లపై ఆకర్షణను తగ్గిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతో ఇన్వెస్టర్లలో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ మాట్లాడుతూ..విదేశీ, భారతీయ పెట్టుబడిదారులకు ఎల్టీసీజీ పన్నులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. అయితే, ప్రభుత్వ ఆదాయ అవసరాలను గుర్తించి పన్ను మినహాయింపుల హోల్డింగ్ వ్యవధిని ఏడాది నుంచి రెండు లేదా మూడేళ్లకు పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)పై ఎల్టీసీజీ పన్నులకు సంబంధించి హీలియోస్ క్యాపిటల్‌కు చెందిన సమీర్ అరోరా స్పందించారు. విదేశీ మార్కెట్లు మరింత అనుకూలమైన పన్ను విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో భారత్ ఎల్టీసీజీ వంటి పన్ను పద్ధతులను అనుసరించడం విదేశీ పెట్టుబడులను నిరోధించగలవని చెప్పారు.
ఇదీ చదవండి: భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..
ప్రస్తుత పన్ను విధానం ఇలా..
2024 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన లాభాల పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చారు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై ఎల్టీసీజీ పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సర్దుబాట్లు పన్ను నిర్మాణాన్ని సరళతరం చేయడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నట్లు కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్టీసీజీ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించడం వల్ల ఆదాయ పెరుగుదల, మార్కెట్ పోటీతత్వం మధ్య సమతుల్యత సాధించవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment