న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) సహా పలు బడ్జెట్ ప్రతిపాదనలు 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 14 ఏళ్ల విరామం తర్వాత ఎల్‌టీసీజీ మళ్లీ అమలు కానుంది. షేర్లను కొని ఏడాది దాటిన తర్వాత విక్రయించినట్టయితే లాభం ఒక ఏడాదిలో రూ.లక్ష మించితే 10% పన్ను చెల్లించాలి.
కొన్న తర్వాత ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చే లాభంపై 15% స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ప్రస్తుతం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. 2004 జూలైలో అప్పటి ప్రభుత్వం ఎల్‌టీసీజీని ఎత్తేసి దాని స్థానంలో సెక్యూరిటీల లావాదేవీల పన్నును (ఎస్‌టీటీ) ప్రవేశపెట్టింది. దీన్ని అలాగే ఉంచి, తిరిగి ఎల్‌టీసీజీ భారాన్ని మోపారు. కాకపోతే ద్రవ్యోల్బణ తరుగు ప్రయోజనాన్ని మినహాయించుకునే అవకాశం ఇవ్వడం ఒక్కటే కాస్త ఊరట. ఆదాయపన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పుల్లేవు.
అమల్లోకి వచ్చే ప్రతిపాదనలు ఇవీ...
♦ వార్షికంగా రూ.250 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రయోజనం.
♦ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థానంలో వేతన జీవులకు వార్షికంగా రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ తెచ్చారు. ప్రస్తుతం రూ.19,200 వరకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రూ.15,000 వరకు మెడికల్ అలవెన్స్‌కు పన్ను లేదు. వీటిపై మినహాయింపులను ఎత్తేస్తూ ప్రామాణికంగా రూ. 40,000 పన్ను తగ్గింపునకు వీలు కల్పించారు.
♦ సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లుపైన) వార్షికంగా రూ.10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండగా, అది ఐదు రెట్లు పెరిగి రూ.50,000 అవుతోంది.
♦ 60 ఏళ్లు పైబడిన వారికి క్రిటికల్ ఇల్‌నెస్ కింద పన్ను మినహాయింపు రూ.60,000కు పెరుగుతోంది. అలాగే, 80ఏళ్లు దాటిన వృద్ధులకు ఇది రూ.80,000గా మారనుంది.
♦ సెక్షన్ 80డి కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వైద్య ఖర్చులకు చేసిన ఆదాయం ఇకపై రూ.50,000 వరకు పన్ను ఉండదు.
♦ అధిక ఆదాయ వర్గాలకు ఆదాయ పన్నుపై సెస్సు 3 నుంచి 4 శాతానికి పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment