సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్‌ఆర్‌ఏ) 16 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా నిబంధనల మేరకు కొన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతమే ఇంటి అద్దె భత్యం వస్తోంది. అయితే ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు జనాభా నిబంధనలను ప్రభుత్వం సడలించింది. 12 శాతం ఇంటి అద్దె భత్యాన్ని 16 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పెంపుదల వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభా నిబంధనల మేరకు కొత్త జిల్లాల కేంద్రాలైన పార్వతీపురం, పాడేరు, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటిల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతం ఇంటి అద్దె భత్యాన్ని మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని 16 శాతానికి పెంచారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకేలా 16 శాతం ఇంటి అద్దె భత్యం అందుతుంది.
పీఎస్‌టీయూ హర్షం
రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 12 శాతం నుంచి 16 శాతానికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెంచడంపై ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్‌టీయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏసీవీ గురువారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ డిమాండ్లను పరిష్కరిస్తుండడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డీఏ బకాయిలు, ఆర్జిత సెలవులకు నగదు చెల్లింపు డిమాండ్లను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారు కోరారు.
సీఎం జగన్‌కు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కృతజ్ఞతలు
తమ సంఘం అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం హెచ్‌ఆర్‌ఏను పెంచడంపై ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. హెచ్‌ఆర్‌ఏను పెంచిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అలాగే తమకు ఇచ్చిన హామీ ప్రకారం అందరి ఉద్యోగులతోపాటు పోలీసు సిబ్బందికి కూడా సరెండర్ లీవులను మే నెలాఖరున వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏ ఎరియర్స్‌ను సెప్టెంబర్‌లోగా ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment