న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. డీఎ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన హెచ్‌ఆర్‌ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉండనుంది. హెచ్‌ఆర్‌ఏ పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది.
‘ఎక్స్’ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి, పెంపు 27 శాతం ఉంటుంది. ‘వై’, ‘జెడ్’ నగరాల్లో నివాసితులకు వరుసగా 18 శాతం, 9 శాతం హెచ్‌ఆర్‌ఏ పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, హెచ్‌ఆర్‌ఏ రేట్లు వరుసగా 30%, 20% , 10% కు సవరించబడతాయి.
X, Y, Z నగరాల వర్గాలు
X కేటగిరి నగరాలు 50 లక్షలకు పైగా జనాభా ఉన్నవి.
Y కేటగిరి నగరాలు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నవి
Z కేటగిరి ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నవి
అంతకుముందు X, Y, Z నగరాల్లో వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment