హెచ్‌ఆర్‌ఏ 30 శాతానికి పెంపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ(ఇంటి అద్దె భత్యం) 30 శాతానికి పెరగనున్నట్లు సమాచారం. ఆ మేరకు అలవెన్సుల్లో మార్పులు చేర్పుల కోసం ఏర్పాౖటెన అలవెన్సుల కమిటీ తన నివేదికను త్వరలో ఆర్థికమంత్రికి సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మూలవేతనంపై 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కమిటీ సూచించింది. జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం సిఫార్సుల్లోని మూల వేతనం, పెన్షన్ పెంపునకు కేంద్రం ఆమోదం తెలపగా... అలవెన్సులకు సంబంధించిన సూచనల్ని కమిటీకి అప్పగించింది. కేబినెట్ సూచన మేరకు జులై 2016న కేంద్ర ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో అలవెన్సుల కమిటీని ఏర్పాటుచేశారు.
ఏడో వేతన సంఘం 196 అలవెన్సుల్ని పరిశీలించి అందులో 51 రద్దు చేయాలని, అలాగే 37 అలవెన్సుల్ని వేరే వాటిలో కలపాలని సూచించింది. ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాల వారీగా మూలవేతనంపై 24, 16, 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలంటూ ఏడో వేతన సంఘం సూచించింది. ఒకవేళ డీఏ(కరవు భత్యం) 50 శాతం దాటితే హెచ్‌ఆర్‌ఏ 27 , 18, 9 శాతాలకు మార్చాలని, డీఏ 100 శాతం దాటిన పక్షంలో హెచ్‌ఆర్‌ఏ 30, 20, 10 శాతంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. తాజాగా అలవెన్సుల కమిటీ హెచ్‌ఆర్‌ఏ పెంపుతో పాటు మొత్తం 192 అలవెన్సుల్లో 52 రద్దు చేయాలని, 36 అలవెన్సుల్ని ప్రస్తుతమున్న వాటిలో లేదా కొత్త వాటిలో కలపాలంది.