seventh pay commission
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా...!
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. డీఎ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన హెచ్ఆర్ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్ఆర్ఏ పెంపు ఉండనుంది. హెచ్ఆర్ఏ పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ‘ఎక్స్’ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి, పెంపు 27 శాతం ఉంటుంది. ‘వై’, ‘జెడ్’ నగరాల్లో నివాసితులకు వరుసగా 18 శాతం, 9 శాతం హెచ్ఆర్ఏ పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా 30%, 20% , 10% కు సవరించబడతాయి. X, Y, Z నగరాల వర్గాలు X కేటగిరి నగరాలు 50 లక్షలకు పైగా జనాభా ఉన్నవి. Y కేటగిరి నగరాలు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నవి Z కేటగిరి ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నవి అంతకుముందు X, Y, Z నగరాల్లో వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం హెచ్ఆర్ఏ ఉండేది. -
అధ్యాపకులకు భారీగా పెరగనున్న వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఏడో వేతన కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో వేతనాల పెంపు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 3 వేల వరకు మంజూరైన బోధనా సిబ్బంది పోస్టులుండగా, అందులో 1,500కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 500 వరకు పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బంది పని చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారికి వేతనాల పెంపు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ప్రొఫెసర్‌కు ప్రస్తుత వేతనంపై అదనంగా రూ.28 వేలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.18 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.12 వేల వరకు అదనంగా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల డిప్యుటేషన్ అలవెన్సును రెట్టింపు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.డిప్యుటేషన్ అలవెన్సును 2.25 రెట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందని, 2017, జులై 1 నుంచి ఈ నిర్ణయం వర్తింపచేస్తామని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే స్టేషన్లో డిప్యుటేషన్‌కు సంబంధించి డిప్యుటేషన్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 5 శాతంగా ఉంటుందని గరిష్టంగా నెలకు రూ 4500 వరకూ పెరుగుతుందని, లొకేషన్ మారితే మూల వేతనంలో పది శాతం గరిష్టంగా రూ 9000 వరకూ డిప్యుటేషన్ అలవెన్స్ చెల్లిస్తారని నోటిఫికేషన్ తెలిపింది.ప్రస్తుతం డిప్యుటేషన్ అలవెన్స్‌ను ఈ రెండు కేటగిరీల్లో వరుసగా రూ2000, రూ 4000గా చెల్లిస్తున్నారు. -
హెచ్ఆర్ఏ 30 శాతానికి పెంపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ(ఇంటి అద్దె భత్యం) 30 శాతానికి పెరగనున్నట్లు సమాచారం. ఆ మేరకు అలవెన్సుల్లో మార్పులు చేర్పుల కోసం ఏర్పాౖటెన అలవెన్సుల కమిటీ తన నివేదికను త్వరలో ఆర్థికమంత్రికి సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మూలవేతనంపై 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కమిటీ సూచించింది. జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం సిఫార్సుల్లోని మూల వేతనం, పెన్షన్ పెంపునకు కేంద్రం ఆమోదం తెలపగా... అలవెన్సులకు సంబంధించిన సూచనల్ని కమిటీకి అప్పగించింది. కేబినెట్ సూచన మేరకు జులై 2016న కేంద్ర ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో అలవెన్సుల కమిటీని ఏర్పాటుచేశారు. ఏడో వేతన సంఘం 196 అలవెన్సుల్ని పరిశీలించి అందులో 51 రద్దు చేయాలని, అలాగే 37 అలవెన్సుల్ని వేరే వాటిలో కలపాలని సూచించింది. ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాల వారీగా మూలవేతనంపై 24, 16, 8 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలంటూ ఏడో వేతన సంఘం సూచించింది. ఒకవేళ డీఏ(కరవు భత్యం) 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ 27 , 18, 9 శాతాలకు మార్చాలని, డీఏ 100 శాతం దాటిన పక్షంలో హెచ్ఆర్ఏ 30, 20, 10 శాతంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. తాజాగా అలవెన్సుల కమిటీ హెచ్ఆర్ఏ పెంపుతో పాటు మొత్తం 192 అలవెన్సుల్లో 52 రద్దు చేయాలని, 36 అలవెన్సుల్ని ప్రస్తుతమున్న వాటిలో లేదా కొత్త వాటిలో కలపాలంది. -
ఏడో వేతన సంఘం.. బకాయిలు వస్తున్నాయి!
కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తున్న ఏడో వేతన సంఘం బకాయిలు (ఎరియర్స్) విడుదల కావడం మొదలైంది. ముందుగా సైన్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. మొత్తం ఎంతమంది డిఫెన్స్ పెన్షనర్లకు బకాయిలు ఇవ్వాల్సి వస్తుందోనన్న లెక్కలు తీస్తున్నారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్‌సభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో చెప్పారు. అన్నాడీఎంకే ఎంపీ ఎం.వాసంతి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరాలు జవాబుగా తెలిపారు. దేశంలో రక్షణ రంగ పెన్షనర్లలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4.21 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు ఉన్నట్లు లెక్క తేలింది. కనీస వేతనాలను రూ. 7వేల నుంచి రూ. 18 వేల వరకు పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. అయితే, దాన్ని రూ. 26వేలకు పెంచాలని జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలైతే లబ్ధిపొందుతారు. -
ఎన్నికలకు మోదీ చేతిలో బ్రహ్మాస్త్రం?
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఒకవిధంగా బహుముఖ పోటీ ఉంది. అయినా ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గానీ, బీజేపీ అగ్రనేతలు గానీ పెద్దగా ప్రచారపర్వంలోకి దిగినట్లు కనిపించలేదు. మరి ఇలాంటి తరుణంలో ఐదు రాష్ట్రాల ప్రజలను తమవైపు తిప్పుకోడానికి మోదీ చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది ఏమైనా ఉందా? ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయించాలని ప్రతిపక్షాలు కోరినా, ఎన్నికల కమిషన్ మాత్రం ఓటర్లను ఆకట్టుకునే వరాలు ఏవీ ఇవ్వొద్దంటూ కొన్ని షరతులతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. ప్రత్యేకంగా ఆ ఐదు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ భారీగా లబ్ధి చేకూర్చే ఏడో వేతన సంఘం సిఫార్సులను ఈసారి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం.. 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు, వాళ్ల కుటుంబ సభ్యులలో అత్యధికులు ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. హెచ్ఆర్ఏను 138.71 శాతం పెంచాలని, ఇతర అలవెన్సులను 49.79 శాతం పెంచాలని వేతన సంఘం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలుచేయడానికి ఎన్నికల సంఘం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. పెద్దనోట్ల రద్దుతో నగదు అందుబాటులో లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలు.. చాలా కాలం నుంచి జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు వేతన సంఘం సిఫార్సుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రకటిస్తే అది కచ్చితంగా ఎన్డీయేకు మేలు చేకూరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. భారం ఎంత? వేతన సంఘం సిఫార్సులను యథాతథంగా అమలుచేస్తే.. కేంద్ర ప్రభుత్వం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 29,300 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఇందులో రూ. 17,200 కోట్లు హెచ్ఆర్ఏ, 12,100 కోట్లు ఇతర అలవెన్సుల రూపంలో పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో భారీగా డబ్బులు డిపాజిట్ కావడం, పన్నుల రూపంలో కూడా ఆదాయం మెరుగుపడటంతో కేంద్రం ఈ సిఫార్సుల అమలుకు మొగ్గు చూపించవచ్చనే అంటున్నారు. -
సీఎం శుభవార్త అందించారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. దాదాపు 21 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులను ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది.. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. డిసెంబర్ 21 నుంచి నిర్వహించే రాష్ట్ర అసెంబ్లీ రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఐఏఎస్ అధికారి జీబీ పట్నాయక్ ఆధ్వర్యంలోని కమిటీ తన సిఫార్సులను గత వారం సీఎం కుఅందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా వేతనాలు అందించేలా సిఫారసు చేసింది. దీని ప్రకారం సుమారు 2.57 రెట్లు(జీతం, గ్రేడ్ పే)జీతాలు పెరగనున్నాయి. నాల్గవ తరగతి వేతన జీవులకు కనీసం జీతం రూ. 18000 గా ,గరిష్ట వేతనం రూ.2.25లక్షలుగా ఉండనుంది. 2017 నుంచి జనవరి నుంచి వీటిని అమలు చేయనున్నట్టు ఆ అధికారి ప్రకటించారు. రానున్న కీలక ఎన్నికల నేపథ్యంలో సీఎం అఖిలేశ్ ఉద్యోగులను ఈ వరాలను ప్రకటించిన ట్టుతెలుస్తోంది. -
రైతుకు ‘ఆదాయ విధానం’
విశ్లేషణ దేశ రైతాంగంలో 6 శాతానికి మాత్రమే కనీస మద్దతు ధరల వల్ల మేలు జరుగుతుంది. మిగతా వారంతా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. పైగా, సేకరణ ధరలు మొత్తం పంటల విలువలో 10 శాతం పరిమితికి మించరాదని ప్రపంచ వాణిజ్య సంస్థ సుస్పష్టంగా నిర్దేశించింది. కాబట్టి కనీస మద్దతు ధరను మరింత పెంచడానికి ఉన్న అవకాశం బాగా కుదించుకు పోతోంది. దీనితో ‘ధరల విధానానికి’ కాలం చెల్లిపోయింది. దాని స్థానే ‘ఆదాయ విధానం’ రావాల్సి ఉంది అనే అవగాహన అవసరం. ప్రభుత్వం ఈ సెప్టెంబర్‌లో వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను 42 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం రోజుకు రూ. 246 గా ఉన్న కనీస వేతనం రోజుకు రూ. 351కి పెరు గుతుంది. అంటే నెలకు రూ. 9,100 అవుతుంది. కార్మిక సంఘాలు మాత్రం ఈ విషయంలో అసంతృప్తితోనే ఉన్నాయి. ‘సి’ కేటగిరీ కార్మికుల కనీస చట్టబద్ధ వేతనం రూ. 18,000గా ఉండాలని అవి కోరుతున్నాయి. అదలా ఉంచితే, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపుదల వ్యవసాయేతర కార్మి కులకు మాత్రమేనని గమనించే ఉంటారు. ప్రభుత్వం ప్రకటిం చిన ఈ కనీస వేతనాలను వ్యవసాయ కార్మికులకు ఎందుకు వర్తింప చేయకూడదు? అని ప్రశ్నించాల్సి ఉంది. ఏదేమైనా వ్యవ సాయ కార్మికులు కూడా కష్టించి పనిచేస్తున్నారు. తర చుగా రోజుకు 12 గంటలకు పైగా కూడా పనిచేస్తుంటారు. వ్యవసాయ కార్మికులకు లభించే అత్యుత్తమ వేతనం ఏదైనా ఉన్నదంటే అది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో సంపాదించేదే. ఇది న్యాయం కాదనేది స్పష్టమే. నిజానికి దేశంలోని రైతులలో 50 శాతానికి పైగా భూమిలేని వారేనని 2011 జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. అంటే వారు వ్యవసాయేతర కార్మికుల వర్గం కిందికే వస్తారు. అయినా వారికి చట్టబద్ధమైన కనీస వేతనాన్ని నిరాకరిస్తున్నారు. 2017 ఆర్థిక సర్వే ప్రకారం 17 రాష్ట్రాలలోని రైతు కుటుంబాల సగటు ఆదాయం ఏడాదికి రూ. 20,000 లేదా నెలకు రూ. 1,667 మాత్రమే. అలాంటప్పుడు భూమిలేని రైతులకు ఏమి లభిస్తోందా అని ఆశ్చర్యం వేస్తుంది. బహుశా రోజుకు రూ. 50 కావచ్చు. మనిషి జీవన వేతనమేనా ఇది? కాలం చెల్లిన ‘ధరల విధానం’ రైతాంగానికి ప్రత్యేకంగా ఒక ఆదాయ కమిషన్ అవసరమని నేను కోరేది ప్రాథమికంగా అందుకే. అదే వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను కూడా లెక్కగడుతుంది. రైతుల కోసం ఇప్పటికే కనీస మద్దతు ధరల యంత్రాంగం (ఎమ్ఎస్పీ) ఉండగా, ఇంకా రైతులకు విడిగా ఒక ఆదాయ కమిషన్ కావాలనడంలోని హేతుబద్ధత ఏమిటో వివరించమని తరచుగా నన్ను అడుగుతుంటారు. అదీ కూడా దేశవ్యాప్తంగా రైతాంగమంతా... ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభాన్ని సూచించిన స్వామినాథన్ కమిటీ సూచనలను అమలు చేయమంటుండగా మనకు విడిగా కమిషన్ అవసరం ఏమిటి? అదే సరిపోదా? అని అడుగుతుంటారు. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలో భాగంగా రైతులకు 50 శాతం లాభం లభించాలనే విషయాన్ని నేనూ అంగీకరిస్తున్నాను. కాకపోతే దేశ రైతాంగంలో 6 శాతానికి మాత్రమే ఈ కనీస మద్దతు ధరల వల్ల మేలు జరుగుతుంది. మిగతా వారంతా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సిందేననే వాస్తవం అలాగే నిలిచి ఉంటుంది. పైగా, సేకరణ ధరలు మొత్తం పంటల విలువలో 10 శాతం పరిమితికి మించరాదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సుస్పష్టంగా నిర్దేశించింది. కాబట్టి కనీస మద్దతు ధరను మరింత పెంచడానికి ఉన్న అవకాశం బాగా కుదించుకు పోతోంది. కాబట్టి ‘ధరల విధానానికి’ కాలం చెల్లిపోయింది. దాని స్థానే ‘ఆదాయ విధానం’ రావాల్సి ఉంది అనే విషయంలో సుస్పష్టంగా ఉందాం. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సేకరణ ధరలను లెక్కించే పద్ధతిని పరిశీలిస్తే నాకో విషయం తెలిసి వచ్చింది. ఆ ధరలు బొటాబొటిగా ఉత్పత్తి వ్యయమూ, దానిలో 10 శాతం లాభానికీ మాత్రమే సరిపోతుంది. ఆ కొద్దిపాటి లాభం కూడా నిర్వహణా వ్యయంగానే లెక్క. మరోవంక, వ్యవసాయేతర కార్మికుల వేతనాలను 1957 నాటి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సూచనల ఆధారంగా లెక్కిస్తారు. వాటి ప్రకారం, కనీస వేతనానికి కనీస మానవ అవసరాలు ప్రాతిపదికగా ఉండాలి. ఆ కనీస అవసరాలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు: 1. ప్రామాణిక కార్మిక కుటుంబం అంటే.. మహిళలు, పిల్లలు, కౌమార్యంలోని పెద్ద పిల్లల ఆర్జనను లెక్కలోకి తీసుకోకుండా ఒక సంపాదనాపరునికి మూడు వినియోగ యూనిట్లు. 2. ఓ మోస్తరు పనిపాట్లు చేసే సగటు భారత వయోజనుడు నికరంగా వినియోగించాల్సింది 2,700 కేలరీలు. 3. ఏడాదికి తలసరి వస్త్ర వినియోగం 18 గజాలు. అంటే నలుగురు సభ్యుల సగటు కార్మిక కుటుంబానికి ఏడాదికి 72 గజాలు. 4. అల్ప ఆదాయ వర్గాలకు సబ్సిడీ పారిశ్రామిక గృహ పథకం కింద అందించే కనీస వైశాల్యపు వసతికి సమానమైన ఇంటి అద్దె. 5. ఇంధనం, దీపాలు తదితర చిల్లర మల్లర ఖర్చులు కనీస వేతనంలో 20 శాతంగా ఉంటాయి. రైతులకు కనీస అవసరాలు ఉండవా? కనీస వేతనాన్ని లెక్కించడానికి 1991లో సుప్రీంకోర్టు మరో ఆరు ప్రాతిపది కలను చేర్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక నివేదికలో తెలిపింది. అవి: పిల్లల విద్య, వైద్యపరమైన అవసరాలు, పండుగలు, ఆచార వ్యవహారాలు సహా కనీస వినోదం, వృద్ధాప్యానికి పొదుపు, పెళ్లి. ఇవి కనీస వేతనంలో 25 శాతంగా ఉండాలని సుప్రీంకోర్టు కోరింది. వీటికి తోడు కనీస వేతనంలో కరువు భత్యం భాగంగా ఉండాలి. మూడేళ్లకు ఒకసారి కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపేయాలి. ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరలను సూచించే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) సుప్రీం కోర్టు పేర్కొన్నట్టుగా ఆరు కనీస ప్రాతిపదికలను ఎందుకు ప్రకటించడం లేదు. ఈ భత్యాలలో వేటినైనా రైతులకు చెల్లిస్తున్నట్టు మీరు ఎన్నడైనా విన్నారా? రైతుల ఆదాయాన్ని లెక్కించ డానికి ఉన్న మార్గం ఒక్క కనీస మద్దతు ధర మాత్రమే. కాబట్టి కనీస మానవ అవసరాలను రైతులకు నిరాకరించడానికి లేదా వాటిని సేకరణ ధరలో చేర్చాల్సిన అవసరాన్ని గుర్తించక పోవడానికి కారణం నాకైతే ఏమీ కనిపించడం లేదు. ఏడవ పే కమిషన్‌ను అనుసరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్న 108 అలవెన్సులను నేనేమీ కోరడం లేదు. కేవలం రైతులకు విద్య, వైద్యం, గృహ వసతి, ప్రయాణ భృతులను మాత్రమే ఇవ్వాలని కోరు తున్నాను. 1966లో హరిత విప్లవాన్ని ప్రారంభించిన నాటి నుంచి వరుసగా 50 ఏళ్లుగా రైతులకు జీవన వేతనాలకు నిర్దేశించి ఆరు ప్రాతిపదికలతో కూడిన అవసరాలపై ఆధా రపడిన సేకరణ ధరలను నిరాకరిస్తున్నారు. ఏటేటా వ్యవసాయరంగం కష్టాలు పర్వతంలా ఎలా పేరుకు పోతున్నా యంటే, అవి గత 20 ఏళ్లుగా ఏటా 3 లక్షల మంది రైతులను ఉరి కంబం ఎక్కించడంలో ఆశ్చర్యమేం లేదు. రైతుల ఆదాయ, సంక్షేమ కమిషన్ కావాలి స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరడం వల్ల న్యాయం జరగదని రైతు నేతలు అర్థం చేసుకుని తీరాలి. ఒకటి, స్వామినాథన్ నివేదిక అమలు వల్ల కనీస మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ము కోగలిగిన 6 శాతం రైతులకు మాత్రమే మేలు కలుగుతుంది. మిగతా 94 శాతం నష్ట పోయిన వారిగానే మిగిలిపోతారు. రెండు, కనీస మద్దతు ధరను డబ్ల్యూటీఓ నిర్దేశించిన అనుమతించదగిన పరిమితికి మించి పెంచలేక పోవడం వలన ప్రభుత్వం రైతులకు నిజ ధరలను చెల్లించకుండా నిరాకరిస్తూనే ఉంటుంది. అందువల్లనే రైతు కుటుంబానికి కనీస నెలసరి ఆదాయానికి హామీని ఇచ్చే ప్యాకేజీని రూపొందించే రైతు ఆదాయ కమిషన్ ఏర్పాటు అవసరం. కనీస వేతనాల చట్టం, 1948కి సవరణను చేసి కాంట్రాక్టు కార్మికులకు కూడా ఆ ప్రయోజనాలను విస్తరింపజేయాలని కార్మిక సంఘాలు కోరు తున్నాయి. పది కార్మిక సంఘాలు ఒక్కటై కార్మిక హక్కుల కోసం పోరాడిన తీరును చూసి రైతు నేతలు నేర్చుకోవాలి. వారు కూడా ఈ ఆదాయ సమస్యలపై ఒకే అవగాహనను రూపొందించుకుని సీఏసీపీ పరిగణనలోకి తీసుకునే అంశాల ప్రాతిపదికలను మార్చేలా ఒక సవరణను కోరాలి. సీఏసీపీ ఇకపై వివిధ పంటల ఉత్పత్తి వ్యయాలను లెక్కించడానికి మాత్రమే పరి మితం కారాదు. రైతులకు కనీస మానవ అవసరాల ప్రాతిపదికపై ఆధారపడ్డ నెలసరి ఆదాయ ప్యాకేజీని లెక్కగట్టే దిశగా దృష్టిని కేంద్రీకరించాలి. కాబట్టి వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) పేరును ‘రైతుల ఆదాయ, సంక్షేమ కమిషన్’గా మార్చాలి. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com -
వేతన పెంపుపై నోటిఫికేషన్
-
వేతన పెంపుపై నోటిఫికేషన్
కేంద్ర ఉద్యోగుల మూల వేతనం 2.57 రెట్లు పెంపు న్యూఢిల్లీ : ఏడో వేతన సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల మూల వేతనాన్ని 2.57 రెట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం నోటిఫై చేసింది. దీనివల్ల కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. ఖజానాపై ఏటా సుమారు రూ. 1.02 లక్షల కోట్ల భారం పడనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ. ఏడు వేల నుంచి రూ. 18 వేలకు పెరిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఏడాదిలో జనవరి 1, జూలై 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు జూలై 1న మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తోంది. వార్షిక ఇంక్రిమెంట్‌కు రెండు తేదీలు ఇకపై ఉద్యోగులు అపాయింట్మెంట్ తేదీ, పదోన్నతి, పే స్కేలు మార్పులను బట్టి ఈ రెండు తేదీల్లో ఒక తేదీన వార్షిక ఇంక్రిమెంట్ పొందుతారని పేర్కొంది. అయితే అలవెన్సులకు సంబంధించిన సలహాలను మాత్రం ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలనకు పంపింది. 4 నెలల్లో ఈ కమిటీ దీనిపై నివేదిక సమర్పిస్తుంది. టెలికాం, బీమా, సెబీ లాంటి నియంత్రణ (రెగ్యులేటర్) కమిటీల చైర్పర్సన్లకు నెలకు రూ. 4.5 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ఈ కమిటీల సభ్యులు నెలకు రూ. 4 లక్షల ప్యాకేజీ పొందుతారు. పనిచేస్తేనే వేతన పెంపు ఆశించిన స్థాయిలో పనిచేయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు ఉండదని కేంద్రంతెలిపింది. పదోన్నతి, ఆర్థిక ప్రయోజనాల హెచ్చింపు కోసం ఉద్యోగుల పనితీరును మదింపు చేసే ప్రమాణాలను ‘గుడ్’ నుంచి ‘వెరీ గుడ్’కు పెంచారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ప్రకటన జారీ చేస్తూ ఆర్థిక శాఖ ఈమేరకు పేర్కొంది. ఉద్యోగ పదోన్నతి హామీ(ఎంఏసీపీ) పథకాన్ని ఇప్పటిలాగే 10, 20, 30 ఏళ్లకు అమలుచేస్తారు. తొలి 20 ఏళ్ల కెరీర్లో నిర్దేశిత ప్రమాణాలు అందుకోని ఉద్యోగుల వేతన పెంపుదలను నిలిపివేయాలన్న సంఘం సిఫార్సును కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. -
సమ్మె నాలుగు నెలలు వాయిదా
న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను నిరసిస్తూ ఈ నెల 11నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. వినతుల పరిష్కారానికి కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను 4 నెలలపాటు వాయిదా వేస్తున్నామన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జాతీయ ఉమ్మడి కార్యాచరణ మండలి (ఎన్‌జేసీఏ) కన్వీనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. అంతకుముందు ఆయా సంఘాల నేత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి తమ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. దీంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే కొత్త కమిటీని నియమిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, బీఎంఎస్ మాత్రం తొలుత నిర్ణయించినట్లు ఈనెల 8న తమ నిరసనలు కొనసాగుతాయంది. -
రామగుండంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
రామగుండం: ఏడో వేతన సంఘం సిఫారసుల్లో అన్యాయం జరిగిందంటూ రైల్వే కార్మికులు, సిబ్బంది కరీంనగర్ జిల్లా రామగుండంలో ఆందోళనకు దిగారు. స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
వేతనాల బొనాంజా
ఏడో వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం 23.5 శాతం పెరగనున్న జీతభత్యాలు - కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి - 2016 జనవరి 1 నుంచే వర్తింపు.. ఈ ఏడాదిలోనే బకాయిల చెల్లింపు - ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల భారం - ఇకపై కనీస వేతనం రూ.18 వేలు. గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు - అలవెన్సుల్లో కోతలపై నిర్ణయం పెండింగ్ - వేతనాలు బాగానే పెంచాం: అరుణ్‌జైట్లీ - ఏ మూలకూ సరిపోవు: ఉద్యోగ సంఘాలు.. సమ్మె చేస్తామనిహెచ్చరిక న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏడో వేతన సంఘం సిఫారసులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తమ్మీద జీతభత్యాలు 23.5 శాతం మేర పెరగనున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే సిఫారసులను అమలు చేయనున్నారు. అప్పట్నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ఈ ఏడాదిలోనే చెల్లించనున్నారు. వేతన సంఘం సిఫారసుల అమలుతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెరగబోయే వేతనాలతో ప్రభుత్వ ఖజానాపై 2016-17లో 1.02 లక్షల కోట్ల (జీడీపీలో 0.65 శాతం) భారం పడనుంది. ఇందులో వేతనాల వాటా రూ.39,100 కోట్లు, పెన్షన్ల వాటా రూ.33,700 కోట్లు ఉండనుంది. అలవెన్సుల రూపంలో ఖజానాపై అదనంగా రూ.29,300 కోట్ల భారం పడనుంది. ఆరో వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై అదనంగా పడిన భారం జీడీపీలో 0.77 శాతంగా నమోదైంది. ఇప్పుడు అది 0.7 శాతంగా ఉంటుందని అంచనా. కేంద్రం ప్రతీ పదేళ్లకు వేతన సంఘాన్ని నియమిస్తుంది. కనీస వేతనం రూ.18 వేలు! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుంది. ప్రస్తుతం రూ.7 వేల కనీస వేతనం ఉండగా.. దాన్ని రూ.18 వేలకు పెంచాలని వేతన సంఘం చేసిన సిఫారసు ఆమోదం పొందింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గరిష్ట వేతనాన్ని రూ.2.5 లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం కేబినెట్ కార్యదర్శి నెలకు రూ.90 వేల (గరిష్ట వేతనం) వేతనం అందుకుంటున్నారు. వేతన సంఘం సిఫారసులతో ఈ మొత్తం రూ.2.5 లక్షలకు పెరగనుంది. గతేడాది నవంబర్లోనే జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉద్యోగుల మూలవేతనంలో సగటున 14.27 శాతం పెంచాలని సిపారసు చేసింది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. గత 70 ఏళ్లలో వేతనాలు ఇంత తక్కువగా ఎన్నడూ పెంచలేదంటూ మండిపడ్డాయి. 14.27 శాతానికి ఇతర అలవెన్సులు కలపడంతో మొత్తంగా పెంపు 23.55 శాతానికి చేరింది. దీనికి బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. అలవెన్సుల్లో కోతలపై చేసిన కొన్ని సిఫారసులను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. వీటిపై ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలన జరుపుతోంది. వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై పడే అదన పు భారంలో రూ.60,608 కోట్లను వార్షిక బడ్జెట్ నుంచి తీసుకోనున్నారు. మరో రూ.24,325 కోట్లను రైల్వే బడ్జెట్ నుంచి ఖర్చుచేయనున్నారు. వేతనాలు గౌరవప్రదంగానే ఉన్నాయి ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు గౌరవప్రదంగానే ఉన్నాయని ఆర్థికమంత్రిజైట్లీ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేతనాలు, పెన్షన్లపై వేతన సంఘం చేసిన దాదాపు అన్ని సిఫారసులను ఆమోదించినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచే పెరిగిన వేతనాలు ఇస్తామని, బకాయిలను ఇదే ఏడాదిలో చెల్లిస్తామన్నారు. వేతనభారంతో ద్రవ్యలోటు పెరిగిపోతుందన్న భయాలేవీ లేవని, ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వేతనాల పెంపుతో మార్కెట్లోకి డబ్బు వస్తుందని, అందులో పన్నుల రూపంలో కొంత మొత్తం మళ్లీ ప్రభుత్వానికే చేరుతుందన్నారు. అయితే ద్రవ్యోల్బణంపై మాత్రం ఒత్తిడి ఉంటుందంటూ మున్ముందు ధరల పెరుగుదల తప్పకపోవచ్చన్న సంకేతాలిచ్చారు. ఏడో వేతన సంఘం సిఫారసులతో తలెత్తే లోటుపాట్లను సరిచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పెంపు చాలదు : కాంగ్రెస్ వేతనాల పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ పెంపు అల్పమని విమర్శించింది. ‘‘ చాలీచాలని పెంపుతో కేంద్రం ఉద్యోగులను మోసగించింది. ఇది వారిలో నిరుత్సాహానికి దారితీస్తుంది. ’’ అని కాంగ్రెస్ దుయ్యబట్టింది. 98 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని, గత ఏడు దశాబ్దాల్లో ఈ పెంపు అత్యల్పం అని పేర్కొంది. వేటిని ఆమోదించారు.. వేటిని పక్కనపెట్టారు? ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం రూ.7.5 లక్షల వరకు గృహ రుణాలు తీసుకునేందుకు వీలుంది. ఈ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని వేతన సంఘం చేసిన సిఫారసుకు ఆమోదం లభించింది. ► ఉద్యోగుల స్థాయిని బట్టి గ్రూప్ ఇన్సూరెన్స కోసం వారి వేతనంలో రూ.1,500-రూ.5 వేలు కోత పెట్టాల న్న ప్రతిపాదనను పక్కనపెట్టారు. ► ఏటా ఇస్తున్న 3 శాతం ఇంక్రిమెంట్‌ను యథాతథంగా ఉంచారు. ► వైద్య చికిత్స కోసం ఇచ్చే వడ్డీలేని అడ్వాన్సులు, ట్రావెల్ అలవెన్స్, ఎల్టీసీలు కూడా ఎప్పట్లాగే కొనసాగుతాయి. ఇతర వడ్డీ లేని అడ్వాన్సు లను రద్దు చేశారు. ► రక్షణ దళాలతోపాటు ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. డీఏ 50 శాతం పెరిగిన ప్రతీసారి ఈ గ్రాట్యుటీ 25 శాతం మేర పెరుగుతుంది. ► ఉద్యోగులు విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబీకులు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో రూ.10లక్షలు-రూ.20 లక్షలు ఉంది. దాన్ని రూ.25 లక్షలు-రూ.45 లక్షలకు పెంచారు. ► ఉద్యోగుల స్థాయిని ప్రస్తుతం గ్రేడ్ పే ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఇకపై పే మ్యాటిక్స్ ్రఆధారంగా నిర్ణయిస్తారు. అలవెన్సుల కోతపై ఏంచేస్తారో? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మొత్తంగా 196 రకాల అలవెన్సులు ఇస్తున్నారు. వాటిలో 53 అలవెన్సులను రద్దు చేయాలని వేతన సంఘం సిఫారసు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ అంశం కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉంది. ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. అప్పటిదాకా అలవెన్సులు ప్రస్తుత రేట్ల ప్రకారమే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందా? వేతన సంఘం సిఫారసుల అమలుతో వస్తు వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మార్కెట్లోకి ఒక్కసారిగా అదనంగా డబ్బు వచ్చి పడడం, ద్రవ్య చలామణి పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. సమ్మె చేస్తాం: ఉద్యోగ సంఘాల హెచ్చరిక వేతన సంఘం సిఫారసులు పెరిగిపోయిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా లేవని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే సవరణ చేసి వేతనాలను మరింత పెంచాలని ఆరెస్సెస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చేనెల 8న దేశవ్యాప్త ఆందోళలు చేస్తామని ప్రకటించింది. పెంపుపై పునఃసమీక్ష చేయకుంటే వచ్చేనెల 11న తలపెట్టిన నిరవధిక సమ్మెను వారం ముందు నుంచే ప్రారంభిస్తామని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.దురైపాండియన్ హెచ్చరించారు. అంతకుముందు సమాఖ్య ఆధ్వర్యంలో చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం రాజాజీ భవన్ ముందు ధర్నా చేశారు. -
మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!
న్యూ ఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఓవరాల్ గా ఈ సిఫారసుల అమలుతో వీరి ఆదాయం 23.5 శాతం మేర పెరుగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదీంచిన సిఫారసుల్లో ప్రధానంగా.. ఉద్యోగుల మూల వేతనం నెలకు 7 వేల నుంచి 18 వేలకు చేరుకోనుంది. కనీస పెన్షన్ సైతం 3,500 నుంచి 9 వేలకు పెంపును కేబినెట్ ఆమోదించింది. అలవెన్స్‌ల విషయంలో వేతన సంఘం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. వారి జీతభత్యాలు అమాంతంగా పెరగనున్నాయి. ఏకంగా 16శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలని ప్రతిపాదిస్తూ ఏడో వేతన సంఘం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక ఇచ్చింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 54 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధిచేకూరనుంది. కొత్త వేతనం జనవరి 1, 2016 నుంచి అమలుకానుంది. మొత్తం 23.5శాతం జీతభత్యాలు పెరగనున్నాయి. కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని కూడా వేతన సంఘం సిఫార్సు చేసింది. -
ఏడో వేతన సంఘం గడువు పెంపు
న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం గడువును కేంద్ర కేబినెట్ మరో నాలుగు నెలలు పొడిగించింది. దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్ల వేతనాల పెంపు కోసం ఫిబ్రవరి, 2014లో ఈ సంఘం ఏర్పాటైంది. కేంద్రం ప్రతి పదేళ్ల కోసం వేతన సంఘాన్ని(పే కమిషన్) ఏర్పాటు చేస్తుంది. 2014లో జస్టిస్ ఏకే మాథూర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఏడో పే కమిషన్ నిజానికి ఈ నెలాఖరుకు తమ సిఫారసులను కేంద్రానికి సమర్పించాలి. ఈ కమిషన్ తమ సిఫారసులు చేయడానికి గడువును డిసెంబరు 31 దాకా పొడిగించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ప్రభుత్వవర్గాలు బుధవారం వెల్లడించాయి. -
ఏడో వేతన సంఘానికి సై
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు తాయిలం ప్రకటించింది. దాదాపు 80 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లను పెంచుతూ సవరించేందుకు ఏడో వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలో నియమించబోయే ఈ వేతన సంఘం సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేస్తామని చెప్పింది. ‘‘ఏడో వేతన సంఘం (పే కమిషన్) ఏర్పాటును ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆమోదించారు. ఈ సంఘం సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేసే అవకాశముంది’’ అని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రక్షణ శాఖ, రైల్వే శాఖలతో సహా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, 30 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. అయితే.. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో పాటు.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలూ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఏడో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించటం గమనార్హం. ప్రతి పదేళ్లకోసారి వేతన సవరణ... వేతన సంఘం తన సిఫారసులను సిద్ధం చేయటానికి ప్రభుత్వం దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటుంది. కాబట్టి ఏడో వేతన సంఘం సిఫారసులు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశముందని చిదంబరం పేర్కొన్నారు. ఆరో వేతన సంఘం సిఫారసులు 2006 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఐదేళ్లకోసారి సవరించాలి: ఉద్యోగ సంఘాలు ఏడో వేతన సంఘం ఏర్పాటు చేస్తూ యూపీఏ-2 సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ కాంగ్రెస్‌తో పాటు ఉద్యోగ సంఘాలు హర్షం తెలి పాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసులను 2011 జనవరి 1 నుంచీ వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు కె.కె.ఎన్.కుట్టి డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాలను ప్రతి ఐదేళ్లకోసారి సవరిస్తున్నట్లుగానే.. కేంద్ర ఉద్యోగుల వేతనాలను కూడా సవరించాలన్నారు. ‘వేతన సంఘం పొందటం ఉద్యోగుల హక్కు. సంఘం సిఫారసులు వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం అమలుచేయగలదు’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. తమకు ప్రత్యేక పే కమిషన్ వద్దన్న వాయుసేన ఇదిలావుంటే.. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పేర్కొన్నట్లు సైనిక బలగాలకు ప్రత్యేక వేతన సంఘం అవసరం లేదని.. అయితే బుధవారం ప్రకటించిన ఏడో వేతన సంఘంలో సైనిక బలగాలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని కోరాయి. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ కూడా అయిన వాయుసేన అధిపతి ఎన్.ఎ.కె.బ్రోనె ఈ మేరకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీకి లేఖ రాసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సైనిక బలగాల వేతనాల్లో లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయాలని త్రివిధ దళాలు 2008లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పౌర ఉద్యోగులకు, సైనిక ఉద్యోగులకు వేతనాల్లో భేదం ఉండాలని కోరాయి. అలాగే.. ఒక హోదాకు ఒకే వేతనం, ఒక హోదాకు ఒకే పెన్షన్ నిబంధనను కూడా వర్తింపచేయాలని సైన్యం డిమాండ్ చేస్తోంది. దీనిపై పలు పరిణామాల అనంతరం.. ఇకపై సైనిక బలగాలకు ప్రత్యేక వేతన సంఘం ఏర్పాటు చేస్తామని ప్రధాని 2009లో రక్షణ శాఖకు తెలిపారు. తాజాగా ఏడో వేతన సంఘం ప్రకటన నేపధ్యంలో సైన్యానికి ప్రత్యేక వేతన సంఘం ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమయింది. కానీ.. అలాంటి ప్రత్యేక సంఘమేదీ అవసరం లేదని.. ఏడో వేతన సంఘంలోనే సైనిక బలగాలకు తగిన ప్రాదినిధ్యం కల్పిస్తే.. న్యాయం జరుగుతుందని వాయుసేన అధిపతి తాజా లేఖలో పేర్కొన్నారు. వేతన సంఘంతో అధిక ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ఏడో వేతన సంఘం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడటంతో పాటు, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచితే.. ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున కరిగిపోతాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతుంది’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ వ్యాఖ్యానించారు. ఏడో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వచ్చే సమయానికి (2016 జనవరి నాటికి) కేంద్రం ఆహార భద్రత చట్టం అమలు చేయటంతో పాటు, ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ పథకాల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ద్రవ్యలోటుతో పోరాడుతూ ఉండటం అవసరమా?’’ అని వ్యాఖ్యానించారు. పంపిణీ ఆర్థిక వ్యవస్థను, పంపిణీ వ్యవస్థ నిర్వహణను మెరుగుపరచేందుకు సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని.. తగిన మౌలిక సదుపాయాలు, పంపిణీ వ్యవస్థ లేకుండా ఆదాయ స్థాయిలను పెంచటం.. అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుమన్జ్యోతి ఖైతాన్ సూచించారు.