వేతనాల బొనాంజా | Bonanza of wages | Sakshi
Sakshi News home page

వేతనాల బొనాంజా

Published Thu, Jun 30 2016 12:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

వేతనాల బొనాంజా - Sakshi

వేతనాల బొనాంజా

ఏడో వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 
 23.5 శాతం పెరగనున్న జీతభత్యాలు
- కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
- 2016 జనవరి 1 నుంచే వర్తింపు.. ఈ ఏడాదిలోనే బకాయిల చెల్లింపు
ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల భారం
ఇకపై కనీస వేతనం రూ.18 వేలు. గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు
అలవెన్సుల్లో కోతలపై నిర్ణయం పెండింగ్
వేతనాలు బాగానే పెంచాం: అరుణ్‌జైట్లీ
ఏ మూలకూ సరిపోవు: ఉద్యోగ సంఘాలు.. సమ్మె చేస్తామనిహెచ్చరిక
 
 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏడో వేతన సంఘం సిఫారసులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తమ్మీద జీతభత్యాలు 23.5 శాతం మేర పెరగనున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే సిఫారసులను అమలు చేయనున్నారు. అప్పట్నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ఈ ఏడాదిలోనే చెల్లించనున్నారు. వేతన సంఘం సిఫారసుల అమలుతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెరగబోయే వేతనాలతో ప్రభుత్వ ఖజానాపై 2016-17లో 1.02 లక్షల కోట్ల (జీడీపీలో 0.65 శాతం) భారం పడనుంది. ఇందులో వేతనాల వాటా రూ.39,100 కోట్లు, పెన్షన్ల వాటా రూ.33,700 కోట్లు ఉండనుంది. అలవెన్సుల రూపంలో ఖజానాపై అదనంగా రూ.29,300 కోట్ల భారం పడనుంది. ఆరో వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై అదనంగా పడిన భారం జీడీపీలో 0.77 శాతంగా నమోదైంది. ఇప్పుడు అది 0.7 శాతంగా ఉంటుందని అంచనా. కేంద్రం ప్రతీ పదేళ్లకు వేతన సంఘాన్ని నియమిస్తుంది.

 కనీస వేతనం రూ.18 వేలు!
 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుంది. ప్రస్తుతం రూ.7 వేల కనీస వేతనం ఉండగా.. దాన్ని రూ.18 వేలకు పెంచాలని వేతన సంఘం చేసిన సిఫారసు ఆమోదం పొందింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గరిష్ట వేతనాన్ని రూ.2.5 లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం కేబినెట్ కార్యదర్శి నెలకు రూ.90 వేల (గరిష్ట వేతనం) వేతనం అందుకుంటున్నారు. వేతన సంఘం సిఫారసులతో ఈ మొత్తం రూ.2.5 లక్షలకు పెరగనుంది. గతేడాది నవంబర్‌లోనే జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉద్యోగుల మూలవేతనంలో సగటున 14.27 శాతం పెంచాలని సిపారసు చేసింది.

అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. గత 70 ఏళ్లలో వేతనాలు ఇంత తక్కువగా ఎన్నడూ పెంచలేదంటూ మండిపడ్డాయి. 14.27 శాతానికి ఇతర అలవెన్సులు కలపడంతో మొత్తంగా పెంపు 23.55 శాతానికి చేరింది. దీనికి బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. అలవెన్సుల్లో కోతలపై చేసిన కొన్ని సిఫారసులను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. వీటిపై ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలన జరుపుతోంది. వేతన సంఘం సిఫారసులతో ప్రభుత్వంపై పడే అదన పు భారంలో రూ.60,608 కోట్లను వార్షిక బడ్జెట్ నుంచి తీసుకోనున్నారు. మరో రూ.24,325 కోట్లను రైల్వే బడ్జెట్ నుంచి ఖర్చుచేయనున్నారు.

 వేతనాలు గౌరవప్రదంగానే ఉన్నాయి
 ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు గౌరవప్రదంగానే ఉన్నాయని ఆర్థికమంత్రిజైట్లీ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేతనాలు, పెన్షన్లపై వేతన సంఘం చేసిన దాదాపు అన్ని సిఫారసులను ఆమోదించినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచే పెరిగిన వేతనాలు ఇస్తామని, బకాయిలను ఇదే ఏడాదిలో చెల్లిస్తామన్నారు. వేతనభారంతో ద్రవ్యలోటు పెరిగిపోతుందన్న భయాలేవీ లేవని, ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వేతనాల పెంపుతో మార్కెట్‌లోకి డబ్బు వస్తుందని, అందులో పన్నుల రూపంలో కొంత మొత్తం మళ్లీ  ప్రభుత్వానికే చేరుతుందన్నారు. అయితే ద్రవ్యోల్బణంపై మాత్రం ఒత్తిడి ఉంటుందంటూ మున్ముందు ధరల పెరుగుదల తప్పకపోవచ్చన్న సంకేతాలిచ్చారు. ఏడో వేతన సంఘం సిఫారసులతో తలెత్తే లోటుపాట్లను సరిచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 ఈ పెంపు చాలదు : కాంగ్రెస్
 వేతనాల పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ పెంపు అల్పమని విమర్శించింది. ‘‘ చాలీచాలని పెంపుతో కేంద్రం ఉద్యోగులను మోసగించింది. ఇది వారిలో నిరుత్సాహానికి దారితీస్తుంది. ’’ అని కాంగ్రెస్ దుయ్యబట్టింది. 98 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని, గత ఏడు దశాబ్దాల్లో ఈ పెంపు అత్యల్పం అని పేర్కొంది.
 
 వేటిని ఆమోదించారు.. వేటిని పక్కనపెట్టారు?
► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం రూ.7.5 లక్షల వరకు గృహ రుణాలు తీసుకునేందుకు వీలుంది. ఈ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని వేతన సంఘం చేసిన సిఫారసుకు ఆమోదం లభించింది.
► ఉద్యోగుల స్థాయిని బట్టి గ్రూప్ ఇన్సూరెన్‌‌స కోసం వారి వేతనంలో రూ.1,500-రూ.5 వేలు కోత పెట్టాల న్న ప్రతిపాదనను పక్కనపెట్టారు.
► ఏటా ఇస్తున్న 3 శాతం ఇంక్రిమెంట్‌ను యథాతథంగా ఉంచారు.
► వైద్య చికిత్స కోసం ఇచ్చే వడ్డీలేని అడ్వాన్సులు, ట్రావెల్ అలవెన్స్, ఎల్‌టీసీలు కూడా ఎప్పట్లాగే కొనసాగుతాయి. ఇతర వడ్డీ లేని అడ్వాన్సు లను రద్దు చేశారు.
► రక్షణ దళాలతోపాటు ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. డీఏ 50 శాతం పెరిగిన ప్రతీసారి ఈ గ్రాట్యుటీ 25 శాతం మేర పెరుగుతుంది.
► ఉద్యోగులు విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబీకులు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో రూ.10లక్షలు-రూ.20 లక్షలు ఉంది. దాన్ని రూ.25 లక్షలు-రూ.45 లక్షలకు పెంచారు.
► ఉద్యోగుల స్థాయిని ప్రస్తుతం గ్రేడ్ పే ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఇకపై పే మ్యాటిక్స్ ్రఆధారంగా నిర్ణయిస్తారు.
 
 అలవెన్సుల కోతపై ఏంచేస్తారో?
 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మొత్తంగా 196 రకాల అలవెన్సులు ఇస్తున్నారు. వాటిలో 53 అలవెన్సులను రద్దు చేయాలని వేతన సంఘం సిఫారసు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ అంశం కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉంది. ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. అప్పటిదాకా అలవెన్సులు ప్రస్తుత రేట్ల ప్రకారమే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.
 
 ద్రవ్యోల్బణం పెరుగుతుందా?
 వేతన సంఘం సిఫారసుల అమలుతో వస్తు వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మార్కెట్‌లోకి ఒక్కసారిగా అదనంగా డబ్బు వచ్చి పడడం, ద్రవ్య చలామణి పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
 
 సమ్మె చేస్తాం: ఉద్యోగ సంఘాల హెచ్చరిక
 వేతన సంఘం సిఫారసులు  పెరిగిపోయిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా లేవని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే సవరణ చేసి వేతనాలను మరింత పెంచాలని ఆరెస్సెస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చేనెల 8న దేశవ్యాప్త ఆందోళలు చేస్తామని ప్రకటించింది.  పెంపుపై పునఃసమీక్ష చేయకుంటే వచ్చేనెల 11న తలపెట్టిన నిరవధిక సమ్మెను వారం ముందు నుంచే ప్రారంభిస్తామని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.దురైపాండియన్ హెచ్చరించారు. అంతకుముందు సమాఖ్య ఆధ్వర్యంలో చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం రాజాజీ భవన్ ముందు ధర్నా చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement