ఏడో వేతన సంఘానికి సై
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు తాయిలం ప్రకటించింది. దాదాపు 80 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లను పెంచుతూ సవరించేందుకు ఏడో వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలో నియమించబోయే ఈ వేతన సంఘం సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేస్తామని చెప్పింది. ‘‘ఏడో వేతన సంఘం (పే కమిషన్) ఏర్పాటును ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆమోదించారు. ఈ సంఘం సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేసే అవకాశముంది’’ అని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రక్షణ శాఖ, రైల్వే శాఖలతో సహా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, 30 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. అయితే.. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో పాటు.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలూ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఏడో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించటం గమనార్హం.
ప్రతి పదేళ్లకోసారి వేతన సవరణ...
వేతన సంఘం తన సిఫారసులను సిద్ధం చేయటానికి ప్రభుత్వం దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటుంది. కాబట్టి ఏడో వేతన సంఘం సిఫారసులు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశముందని చిదంబరం పేర్కొన్నారు. ఆరో వేతన సంఘం సిఫారసులు 2006 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.
ఐదేళ్లకోసారి సవరించాలి: ఉద్యోగ సంఘాలు
ఏడో వేతన సంఘం ఏర్పాటు చేస్తూ యూపీఏ-2 సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ కాంగ్రెస్‌తో పాటు ఉద్యోగ సంఘాలు హర్షం తెలి పాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసులను 2011 జనవరి 1 నుంచీ వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు కె.కె.ఎన్.కుట్టి డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాలను ప్రతి ఐదేళ్లకోసారి సవరిస్తున్నట్లుగానే.. కేంద్ర ఉద్యోగుల వేతనాలను కూడా సవరించాలన్నారు. ‘వేతన సంఘం పొందటం ఉద్యోగుల హక్కు. సంఘం సిఫారసులు వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం అమలుచేయగలదు’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు.
తమకు ప్రత్యేక పే కమిషన్ వద్దన్న వాయుసేన
ఇదిలావుంటే.. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నట్లు సైనిక బలగాలకు ప్రత్యేక వేతన సంఘం అవసరం లేదని.. అయితే బుధవారం ప్రకటించిన ఏడో వేతన సంఘంలో సైనిక బలగాలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని కోరాయి. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ కూడా అయిన వాయుసేన అధిపతి ఎన్.ఎ.కె.బ్రోనె ఈ మేరకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీకి లేఖ రాసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సైనిక బలగాల వేతనాల్లో లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయాలని త్రివిధ దళాలు 2008లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పౌర ఉద్యోగులకు, సైనిక ఉద్యోగులకు వేతనాల్లో భేదం ఉండాలని కోరాయి. అలాగే.. ఒక హోదాకు ఒకే వేతనం, ఒక హోదాకు ఒకే పెన్షన్ నిబంధనను కూడా వర్తింపచేయాలని సైన్యం డిమాండ్ చేస్తోంది.
దీనిపై పలు పరిణామాల అనంతరం.. ఇకపై సైనిక బలగాలకు ప్రత్యేక వేతన సంఘం ఏర్పాటు చేస్తామని ప్రధాని 2009లో రక్షణ శాఖకు తెలిపారు. తాజాగా ఏడో వేతన సంఘం ప్రకటన నేపధ్యంలో సైన్యానికి ప్రత్యేక వేతన సంఘం ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమయింది. కానీ.. అలాంటి ప్రత్యేక సంఘమేదీ అవసరం లేదని.. ఏడో వేతన సంఘంలోనే సైనిక బలగాలకు తగిన ప్రాదినిధ్యం కల్పిస్తే.. న్యాయం జరుగుతుందని వాయుసేన అధిపతి తాజా లేఖలో పేర్కొన్నారు.
వేతన సంఘంతో అధిక ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ఏడో వేతన సంఘం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడటంతో పాటు, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచితే.. ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున కరిగిపోతాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతుంది’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ వ్యాఖ్యానించారు. ఏడో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వచ్చే సమయానికి (2016 జనవరి నాటికి) కేంద్రం ఆహార భద్రత చట్టం అమలు చేయటంతో పాటు, ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ పథకాల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ద్రవ్యలోటుతో పోరాడుతూ ఉండటం అవసరమా?’’ అని వ్యాఖ్యానించారు. పంపిణీ ఆర్థిక వ్యవస్థను, పంపిణీ వ్యవస్థ నిర్వహణను మెరుగుపరచేందుకు సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని.. తగిన మౌలిక సదుపాయాలు, పంపిణీ వ్యవస్థ లేకుండా ఆదాయ స్థాయిలను పెంచటం.. అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుమన్‌జ్యోతి ఖైతాన్ సూచించారు.