ఏడో వేతన సంఘం.. బకాయిలు వస్తున్నాయి!
ఏడో వేతన సంఘం.. బకాయిలు వస్తున్నాయి!
Published Tue, Feb 7 2017 1:13 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తున్న ఏడో వేతన సంఘం బకాయిలు (ఎరియర్స్) విడుదల కావడం మొదలైంది. ముందుగా సైన్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. మొత్తం ఎంతమంది డిఫెన్స్ పెన్షనర్లకు బకాయిలు ఇవ్వాల్సి వస్తుందోనన్న లెక్కలు తీస్తున్నారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్‌సభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో చెప్పారు. అన్నాడీఎంకే ఎంపీ ఎం.వాసంతి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరాలు జవాబుగా తెలిపారు.
దేశంలో రక్షణ రంగ పెన్షనర్లలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4.21 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు ఉన్నట్లు లెక్క తేలింది. కనీస వేతనాలను రూ. 7వేల నుంచి రూ. 18 వేల వరకు పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. అయితే, దాన్ని రూ. 26వేలకు పెంచాలని జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలైతే లబ్ధిపొందుతారు.
Advertisement