హెచ్‌ఆర్‌ఏ – గృహ రుణం...ఏది బెటర్?
ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే సాధనాలు చాలా ఉన్నాయి. హెచ్‌ఆర్‌ఏ, హోమ్ లోన్ కూడా ఈ కోవకి చెందినవే. కాకపోతే వివిధ సందర్భాల్లో వీటి ద్వారా చేకూరే ప్రయోజనాల గురించి అవగాహన ఉంటే సరైన ప్రణాళిక వేసుకునేందుకు వీలవుతుంది. అందుకే.. హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), గృహ రుణాల ద్వారా లభించే ప్రయోజనాల మధ్య తేడాలను ఒకసారి చూద్దాం...
ఈ రెండూ ట్యాక్స్ డిడక్షన్ సాధనాలే అయినప్పటికీ.. రెండింటినీ ఏకకాలంలో క్లెయిమ్ చేయడానికి కుదరదు. సొంతిల్లు ఉన్నప్పుడు అద్దె కడుతున్నామంటూ హెచ్‌ఆర్‌ఏని క్లెయిమ్ చేయలేం. అలాగే అద్దె కడుతున్నట్లుగా హెచ్‌ఆర్‌ఏని క్లెయిమ్ చేసుకుంటూ.... గృహ రుణంతో తీసుకున్న సొంత ఇంటికి సంబంధించి కట్టే ఈఎంఐల్లో పన్ను ప్రయోజనాలు పొందడానికి కుదరదు. కాబట్టి , ఏయే సందర్భాల్లో గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందేందుకు ఈ రెండింటిలో ఏవి అనువైనవో తెలుసుకుందామా...
హౌస్ రెంట్ అలవెన్స్...
అద్దె ఇంట్లో ఉంటున్న ఉద్యోగులు కట్టే రెంట్‌ని.. వేతనంలో కొంత భాగంగా హెచ్‌ఆర్‌ఏ కింద చూపించడం జరుగుతుంది. ఈ కింది వాటిల్లో కనిష్టంగా ఉన్నదాన్ని పన్నులపరమైన మినహాయింపు పొందేందుకు హెచ్‌ఆర్‌ఏ కింద చూపించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
బేసిక్ శాలరీలో 50 శాతం
వాస్తవ హెచ్‌ఆర్‌ఏ
వాస్తవంగా కట్టిన అద్దె – బేసిక్ శాలరీలో 10 శాతం
ఒకవేళ ఏడాది పొడవునా ఈ అంకెల్లో ఎటువంటి మార్పూ లేకపోతే.. హెచ్‌ఆర్‌ఏని పూర్తి ఏడాదికి లెక్కించవచ్చు. అలా కాకుండా కొన్ని నెలల్లో మార్పులు చేర్పులు ఉన్న పక్షంలో నెలవారీగా .. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కలిపి లెక్క వేయాలి. ఉదాహరణకు సంతోష్ బేసిక్ శాలరీ నెలకు రూ. 40,000, హెచ్‌ఆర్‌ఏ రూ. 20,000 కాగా తను ఇంటి అద్దె కింద రూ. 25,000 కడుతున్నాడు అనుకుందాం. ఆర్థిక సంవత్సరం ఆసాంతం ఇందులో ఎటువంటి మార్పులు లేని పక్షంలో సంతోష్ హెచ్‌ఆర్‌ఏని ఈ కింది విధంగా లెక్కవేయడం జరుగుతుంది.
బేసిక్ శాలరీలో 50 శాతం = రూ. 20,000
వాస్తవ హెచ్‌ఆర్‌ఏ = రూ. 20,000
వాస్తవంగా కట్టిన అద్దె – బేసిక్ శాలరీలో 10 శాతం= రూ. 21,000
ఈ సందర్భంలో ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి కనిష్ట మొత్తం రూ. 20,000.. ఏడాదికి రూ. 2,40,000 హెచ్‌ఆర్‌ఏని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక, ఆదాయ పన్ను మినహాయింపు పొందడానికి ఇంటి అద్దె రసీదు, ఓనరు పాన్ నంబరు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులతో పాటు వారి పేరున ఉన్న ఇంట్లోనే నివసిస్తూ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేసిన పక్షంలో.. పిల్లలు కట్టిన అద్దె మొత్తాన్ని పేరెంట్స్ తమ ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ను పొందడానికి కరెంటు బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ లాంటి ఆధారాలు కూడా చూపాల్సి ఉంటుంది.
గృహ రుణాలు...
తొలిసారి సొంత ఇంటి కొనుగోలుకు హోమ్ లోన్ తీసుకుంటే.. ప్రతి నెలా కట్టే వాయిదాల్లో (ఈఎంఐ) అసలు భాగానికి .. గరిష్టంగా రూ. 1,50,000 దాకా సెక్షన్ 80 సి కింద ఆదాయ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతరత్రా మరికొన్ని పెట్టుబడులు కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఇక గృహ రుణంపై కట్టే వడ్డీకి కూడా సెక్షన్ 24బి కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 2,00,000 దాకా ఉంటుంది. వేతన జీవులు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం కల్పించేందుకే ఇలా గృహ రుణంపై ఆదాయ పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం.
హెచ్‌ఆర్‌ఏ.. హోమ్ లోన్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవడం ఉత్తమం అనే విషయానికొస్తే..
ప్రయోజనాలు..
సెక్షన్ 80సి కింద వచ్చే ఇతరత్రా సాధనాలకు అదనంగా హెచ్‌ఆర్‌ఏ డిడక్షన్స్ పొందవచ్చు. అంటే.. హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ గానీ ఉంటే.. మరింత ఎక్కువగా ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కించుకోవచ్చు.
వారసత్వంగా ప్రాపర్టీ ఏదైనా దక్కే అవకాశం ఉండి, కొత్తగా మరిన్ని ఇళ్లను కొనుగోలు చేయదల్చుకోని వారికి ఇది ఉపయోగకరం.
ప్రతికూలతలు..
ఒకవేళ కట్టే అద్దె కన్నా హెచ్‌ఆర్‌ఏ తక్కువగా ఉంటే కిరాయిని పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేయడానికి కుదరదని గమనించాలి.
n సొంత ఇల్లు లేనివారు, వారసత్వంగా ఇల్లు దక్కే అవకాశం లేనివారు.. కేవలం హెచ్‌ఆర్‌ఏ క్లెయిమింగ్ మీదే ఆధారపడితే కొత్తగా ప్రాపర్టీని సమకూర్చుకోవడానికి ఇది తోడ్పడదు.
హెచ్‌ఆర్‌ఏని క్లెయిమ్ చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవంగా అద్దె కట్టకుండా హెచ్‌ఆర్‌ఏని క్లెయిమ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.
గృహ రుణం ప్రయోజనాలు..
అసెట్‌ను సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.ఇతరత్రా సెక్షన్ కింద రుణంలో వడ్డీ మొత్తానికి కూడా పన్ను మినహాయింపులు కల్పిస్తుండటం వల్ల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి మరింత ఎక్కువగా లభించినట్లవుతుంది.