ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో కోత | Telangana: Cuts In HRA Of Government Employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో కోత

Published Sat, Jun 12 2021 2:52 AM | Last Updated on Sat, Jun 12 2021 2:52 AM

Telangana: Cuts In HRA Of Government Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ)లో కోత పడింది. కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సవరణ సంఘం జనాభా ప్రతిపాదిక రూపొందించిన హెచ్‌ఆర్‌ఏ ప్రామాణికతనే.. సీఆర్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని రాష్ట్ర తొలి వేతన సవరణ కమిషన్‌ కూడా సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటినే ఆమోదించింది. ఇందులో హెచ్‌ఆర్‌ఏ శాతాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు అందే ఫిట్‌మెంట్‌ ప్రయోజనాలు ఆ మేర తగ్గనున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉద్యోగులకు నష్టం ఎక్కువగా ఉండనుంది.


స్పష్టతతో ఉత్తర్వులు: ఉద్యోగులకు కేవలం ఏడు శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ తొలి పీఆర్‌సీ సిఫార్సు చేయగా.. సీఎం కేసీఆర్‌ దానిని 30 శాతానికి పెంచడం, కేబినెట్‌ ఆమోదించడం తెలిసిందే. కానీ పీఆర్సీలో హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు వద్దని, ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఫలితం రాలేదు. తాజాగా ఎక్కడెక్కడ ఉద్యోగులకు ఎంత హెచ్‌ఆర్‌ఏ లభిస్తుందన్న అంశంపై స్పష్టతనిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరువు భత్యం (డీఏ) 50శాతం దాటితే.. ఈ హెచ్‌ఆర్‌ఏ శాతాన్ని కూడా పెంచనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంటే 24 నుంచి 27 శాతానికి, 17 నుంచి 18.5 శాతానికి , 13 నుంచి 14 శాతానికి, 11 నుంచి 11.5 శాతానికి పెరుగుతాయని వివరించింది.


ఎక్కడెక్కడ ఎంత హెచ్‌ఆర్‌ఏ?
50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధి+ దానికి ఎనిమిది కిలోమీటర్ల పరిధి లోపల 24% హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 30 శాతంగా ఉంది)
రెండు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌లలో 17 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. (వీటిలో ఇప్పటివరకు 20 శాతంగా ఉంది)
యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య జనాభా ఉన్న పెద్ద పట్టణాలు/మున్సిపాలిటీలు: ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిద్దిపే ట, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాం డూరు, వనపర్తి, గద్వాల, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, జనగాం, కొత్తగూడెం, పాల్వంచ, జూలపల్లి, బాదేపల్లి, నస్పూర్, షాద్‌నగర్‌లలో 13 శాతం ఇస్తారు. (వీటిల్లో ఇప్పటివరకు 14.5 శాతంగా ఉంది)
యాభై వేల లోపు జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాలు.. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట, మెదక్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్, షామీర్‌పేట, శంషాబాద్‌లలో 13 శాతం అమలు చేస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 14.5 శాతంగా ఉంది)
50 వేలకన్నా తక్కువ జనాభా ఉన్న మండలాలు, గ్రామాల్లో 11 శాతం ఇస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 12 శాతంగా ఉంది)


ఎంత వచ్చేది.. ఎంత వస్తుంది?
రూ. 19 వేల మూత వేతనం ఉన్న ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుని చూస్తే.. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఎంత హెచ్‌ఆర్‌ఏ వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుందనే వివరాలివీ..

ప్రాంతం    ఇంతకుముందు    ప్రస్తుతం
జీహెచ్‌ఎంసీ+     5,700               4,569
పెద్ద పట్టణాలు    3,800             3,230
చిన్న పట్టణాలు    2,755            2,470
గ్రామీణ ప్రాంతాలు    2,280       2,090 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement