త్వరలో ఉద్యోగుల జీతాల పెంపు
న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ ఇతర భత్యాల పెంపును ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయనుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇటీవల యూనియన్ నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారని నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్(ఎన్‌జేఏసీ) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా చెప్పారు. ఏడో వేతన సంఘం నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ హెచ్‌ఆర్‌ఏ ప్రకటించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
భత్యాల పెంపుపై ఏడో వేతన సంఘం సిఫార్సుల్ని పరిశీలించిన అశోక్ లావాసా కమిటీ ఏప్రిల్ 27న నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. అనంతరం ఆ నివేదికను ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన సాధికారక కమిటీ పరిశీలించి కేబినెట్ భేటీలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఏడో వేతన సంఘం సిఫార్సుల్ని కేంద్రం గతేడాది ఆమోదించింది.