house rent allowance
-
ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..
సాధారణంగా పన్ను క్లెయిమ్ చేసే విధానంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లు కొన్ని కావాలని.. కొన్ని తెలియక చేసేవి ఉంటాయి. తప్పుడు క్లెయిమ్ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖవారు నోటీసులు ఇస్తున్నారు. వివరాలు అడుగుతున్నారు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టం’ అని సీబీడీటీ వారు అంటున్నప్పటికీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ కింద ఉదహరించిన కేసులన్నీ మీకు ఇబ్బంది కలిగించేవే. క్లెయిం రిజెక్షన్‌కు గురై పన్ను భారాన్ని పెంచేవి.. పెంచినవి కింద ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. ఈ పొరపాట్లు చేయకపోవడమే మీ ప్లానింగ్‌కి కీలకంగా ఉంటుంది.కామేశ్వర్రావుగారు ఠంచనుగా ప్రతి నెలా రెంట్ పే చేస్తారు. బ్యాంకు అకౌంటులో ఖర్చు కనిపిస్తుంది. అయితే, ఓనర్ గారు ఇండియాలో లేరు. అమెరికాలో స్థిరనివాసం. ఆయన గారికి ఈ ఇంటికి వచ్చి చూసేటంత టైం లేదు.. ఓపికా లేదు. ఇద్దరు మంచివారే. ‘అవసరం లేదు’ అనుకున్నారు అగ్రిమెంటు గురించి. ఏ కాగితాలు లేవు. అగ్రిమెంటు లేదు. సంతకాలూ లేవు. దీంతో ఇంటద్దె అలవెన్సు క్లెయిమ్ చేయడానికి వీల్లేని పరిస్థితి.వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మోతుబరి రైతు వామనరావుకు హైదరాబాద్‌లో లంకంత ఇల్లు ఉంది. దాన్ని అద్దెకిచ్చాడు. కానీ అగ్రిమెంటు రాయలేదు. బ్యాంకు చెల్లింపులు తీసుకోడు. అంతా నగదే. పిల్లల చదువుకని ఆ ఇంట్లోనే ఉంటున్నాడు విద్యాధర రావు. ఆయనకీ ఇంటద్దె అలవెన్స్ క్లెయమ్ చేయడానికి కాగితాలు లేవు.ముందు జాగ్రత్తగా అగ్రిమెంటు రాసుకున్నాడు వాసుదేవరావు. కానీ ఆస్తేమో ఓనరు పేరు మీద.. అగ్రిమెంటేమో భార్య వసుంధర పేరు మీద.. మ్యుటేషన్ జరగలేదు. దీంతో ఈ అగ్రిమెంటును కంపెనీవారు ఒప్పుకోలేదు.మావగారింట్లో బంటులా చేరి ఒంటెలా తయారయ్యాడు తాయార్రావు. మామగారు జరిగిపోయారు. అయినా అగ్రిమెంటు మీద తానే రెండు సంతకాలు పెట్టి, రశీదులు రాసి, పాన్ కార్డు వాడుతున్నాడు సదరు మంచి అల్లుడు.తప్పుడు సమాచారంతో అగ్రిమెంటు బనాయించాడు బాబూరావు. అసలు ఆ ఇల్లు లేదు. అద్దె లేదు.. ఓనరు లేడు .. వ్యవహారం లేదు. అద్దె మాత్రం ఏడాది మొత్తం మీద రూ.1,00,000 దాటకుండా మేనేజ్ చేస్తున్నాడు.అద్దె ఇంటి అగ్రిమెంట్లలో తప్పులు.. సమాచారం తప్పు.. తేదీలు తప్పు.. అమౌంటు తప్పు.. రెన్యువల్ జరగదు. బ్యాంకులో జమకి, వ్యవహారంలో మొత్తానికి పొంతనే లేదు. అన్నీ తేడానే. ఏ సమాచారంలో నిజమెంతో సరిపోలదు. పేమెంట్ చేసినట్లు ప్రూఫ్‌లు చూపించడం లేదు. ఇలా చేయడమూ తప్పే.కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. తండ్రి కొడుక్కి అద్దె ఇస్తున్నట్లు కాగితాలు సృష్టించారు. నిజానికి ఏ వ్యవహారం లేదు.ఇలాగే విదేశాల్లోని పిల్లల పేరు మీద ఆస్తులుంటాయి. అగ్రిమెంట్లు, తల్లిదండ్రుల పేరు మీద ఎడాపెడా ఎంటర్ అవుతున్నాయి. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం వారి అకౌంట్లలో పడుతోంది. అయినా వారు అకౌంట్లలో చూపించడం లేదు .. పోనీ పిల్లల అకౌంట్లలోనూ చూపించడం లేదు. ‘అక్కడ ఏమీ వద్దని’ ఆ పిల్లలు చెప్పడం.. వారి మాటను పెద్దలు జవదాటని వైనం. ఎంత రిస్కో చూడండి.హైదరాబాదులో సొంతిల్లు. అందులో ఉండటం.. అద్దె ఇచ్చినట్లు దొంగ రశీదులు ఇవ్వడం.. అమ్మ పేరు మీదో .. ఆలి పేరు మీదో దొంగ రశీదు.చిన్న చిన్న ఊళ్లలో ఎక్కువ అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు.సగం బ్యాంకు ద్వారా ఇవ్వడం, సగం నగదు ఇవ్వడం వల్ల బ్యాంకు వ్యవహారానికి మాత్రమే క్లెయిం చేసుకోగలరు.తనకెన్ని ఇళ్లు ఉన్నాయో తనకే తెలియదు ఒక ఓనరుకు. అంతా నగదు వసూళ్లే. ఎవరికీ రసీదు ఇవ్వరు. తన పాన్ కార్డు కాపీ ఇవ్వరు.ఇదీ చదవండి: మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ఇలా ఎందరో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఏ పొరపాటు చేయకపోవడమే ప్లానింగ్‌లో ముఖ్యమైనది. భయపెట్టడమని కాదు. కానీ ఒక చేదు నిజం ఏమిటంటే దాదాపు 90,000 మంది అసెస్సీలతో రూ.వెయ్యి కోట్ల మినహాయింపును విత్‌డ్రా చేయించి మరీ వారితో పన్ను కట్టించారు. యజమానులు, సంస్థలు జాగ్రత్తగా ఉండాలని హితవు చెబుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది డిపార్టుమెంటు. మనమూ జాగ్రత్తపడదాం.- కే.సీ.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..
మీరు ఉద్యోగస్తులైతే, మీకిచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. గవర్నమెంటు, పబ్లిక్ సంస్థల్లో అయితే, వారివారి రూల్స్/ఒప్పందం ప్రకారం ఉంటాయి. అలాగే చెల్లిస్తారు. మీ ప్రమేయమే ఉండదు. ఇచ్చింది.. ఇచ్చినట్లు తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థల్లో కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా బలమైన ఉద్యోగ సంస్థలుంటే మన పప్పులుడకవ్! మీరు ఆ సంస్థలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైతే, ఉద్యోగిగానే కొనసాగుతుంటే బేరసారాలతో పాటు అలవెన్సుల సంగతిలోనూ వెసులుబాటు అడగవచ్చు. ఆ గొడవలన్నీ పక్కన పెడితే, యజమాని ఇచ్చే ‘ఇంటద్దె అలవెన్సు’ జీతంలో ఒక అంశం. మొత్తం జీతభత్యాలతో కలిసి ఉంటుంది. ఈ అలవెన్సును ఆదాయంగా పరిగణిస్తారు. పన్నుకి గురి అవుతుంది. అయితే, అద్దె ఇంట్లో ఉంటూ, మీరు అద్దె ఇచ్చినట్లయితేనే చట్టప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఈ అలవెన్సు ఉద్దేశం, మీరు ఆ మొత్తం ఇచ్చి అద్దె ఇంట్లో ఉండటం. అద్దె కోసం ఆ మొత్తాన్ని వినియోగించడం జరగాలి. ఈ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.మీరు ఆ సంస్థలో ఉద్యోగిగానే ఉండాలి.మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లిస్తుండాలి.అద్దె చెల్లిస్తున్నట్లు కాగితాలు, రుజువులు ఉండాలి.సొంత వ్యాపారస్తులకు, వృత్తి ఉన్నవారికి ఇది వర్తించదు.అద్దె అంటే వసతి కోసం ఇచ్చే అద్దె, నిర్వహణ ఖర్చులు మాత్రమే. కరెంటు చార్జీలు, నీటి చార్జీలు మొదలైనవి కావు.సొంత ఇంట్లో ఉంటూ ఈ మినహాయింపు పొందకూడదు. కుటుంబ సభ్యులతో ఉంటూ అద్దె చెల్లించకపోతే ఈ మినహాయింపు ఇవ్వరు.ఇచ్చే జీతభత్యాల్లో ఈ అలవెన్సు లేకపోతే ఎటువంటి మినహాయింపు ఇవ్వరు.ఈ మూడింట్లో తక్కువ దాన్నే మినహాయిస్తారు. (a) వచ్చిన అలవెన్సు (b) చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం జీతం తీయగా, మిగిలిన మొత్తం (c) మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో జీతాల్లో 40 శాతంచెల్లించినట్లు రుజువు కావాలి. అవసరమైతే అగ్రిమెంటు, మీ బ్యాంకు అకౌంటు, ఓనర్ పాన్ కార్డు, ఓనర్ బ్యాంకు అకౌంటు, రశీదులు మొదలైనవి కావాలి.ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఉండకూడదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో అద్దె చెల్లించాలి.ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చుభార్యభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఇద్దరూ మినహాయింపు పొందకండి. ఇద్దరూ వేర్వేరు అగ్రిమెంటు ద్వారా పెద్ద ఇల్లు తీసుకుంటే ఎక్కువ అద్దె అయితే, అగ్రిమెంట్లు వేరు, చెల్లింపులు వేరు, రశీదులు వేరు, లెక్కలు వేరు.ఒక్కరే ఉద్యోగి అయి, మిగతావారు ఓనర్ అయితే, అగ్రిమెంటు రాసుకోండి. చెల్లింపులు సక్రమంగా చేయండి. పాన్ తీసుకోండి. అటు పక్క వ్యక్తికి సంబంధించిన ఇన్‌కంట్యాక్స్ లెక్కల్లో ఆదాయంగా చూపించండి.అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, మావగారింట్లో చూరు పట్టుకు వేళ్లాడుతున్నా.. అగ్రిమెంట్లు ముఖ్యం. చెల్లింపులు, రశీదులు, లెక్కలు పక్కాగా ఉండాలి.దొంగ ఇంటి నంబర్లు వేసి క్లెయిమ్ చేయకండి.మీ ఇంటికి మీరే ఓనర్ అని ఎడమ చేత్తో సంతకం పెట్టి క్లెయిమ్ చేయకండి.హైదరాబాదులాంటి మహానగరంలో స్వంత ఇల్లు ఉండగా అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వంత ఇల్లు మీద అద్దె ఆదాయంగా చూపిస్తూ, క్లెయిమ్ చేయండి.కె.సి.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
అద్దె విషయంలో అవకతవకలు.. ఇలా చేయకండి!
యజమాని చెల్లించే జీతభత్యాల్లో ‘‘ఇంటద్దె అలవెన్సు’’ ఒక ముఖ్యమైన అంశం. పెద్ద అంశం. దీని వెనుక రహస్యం ఏమిటంటే ‘‘ఇంటద్దె అలవెన్స్’’తో పన్నుపరంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇతర అలవెన్సుల కన్నా ఇక్కడ అవకాశమూ, వెసులుబాటు ఎక్కువ. తండ్రి పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో ఉంటూ, తండ్రికి అద్దె ఇచ్చినట్లు రసీదు చూపించి, ఇంటద్దె అలవెన్స్‌కి పూర్తిగా మినహాయింపు పొందే సుపుత్రులు ఎందరో. ఈ కట్టుకథని నిజం చేయాలంటే నిజంగానే తండ్రి అకౌంటులో అద్దె జమ చేయండి. తండ్రి ఆదాయంలో ఈ మొత్తాన్ని ఆదాయంగా చూపించి బైటపడండి. ఇలా అద్దె పుచ్చుకున్న వారు ట్యాక్స్ లిమిట్స్‌లోకి రాకుండా జాగ్రత్త పడండి.. నాన్నకు ప్రేమతో నమస్కారం పెట్టండి. ‘‘ఇల్లరికంలో ఉంది మజా’’ అంటూ మావగారింట్లో పూర్తిగా తిష్టవేసిన అల్లుళ్లు ఉన్నారు. ‘‘అల్లుడా ..మజాకా’’ అని మావగారు భయపడకుండా పైన చెప్పినట్లు చేయండి. అలా చేస్తే ఉభయకుశలోపరి. ఆఫీసులోని అధికారితో గల ప్రేమో, అభిమానమో, నాటకమో, చొరవో, చనువో .. దొంగ రసీదు ఇచ్చి క్లెయిం చేసే ప్రబుద్ధులెందరూ. స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యుల పేరుతో రసీదు, లేని ఇంటి నంబరుతో రసీదు, తప్పుడు ఇంటి పేరు మీద రసీదు, నాన్ రెసిడెంటు సంతానం పేరున రసీదు, భార్యభర్తలు కలిసి ఉంటూ ఒక ఇంటి మీద చెరొక రసీదు లేదా చెరొక ఇంటి నంబరుతో రసీదు, కుడి చేత్తో ఒక రసీదు .. ఎడమ చేత్తో ఒక రసీదుపై సంతకాలు పెట్టడం .. తన పేరు మీద ఇల్లున్నా ఏదో ఒక నంబరుపై రసీదు చూపించడం వంటివి ఎన్నో జరుగుతుంటాయి. హైదరాబాదులో అసలే ఇంటి నంబర్లు పది అంకెలు దాటి ఉంటాయి. ఒకో నంబరుకు నాలుగు బైలు(/) .. రెండేసి ఇంగ్లీషు అక్షరాలు కూడా ఉంటాయి. పోస్ట్‌మ్యాన్‌కి దొరక్కపోవచ్చు. గూగుల్ మ్యాప్‌కి కూడా అందకపోవచ్చు. కానీ డిపార్టుమెంటుకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా? ఈ డమ్మీ ఆటకు పేకాటలో ‘‘రమ్మీ’’లో జోకర్లాంటి వెసులుబాటు ఉంది. మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు ఎవరినైతే సృష్టించారు ఆ వ్యక్తి నిజంగానే ఉండాలి. ఆ ఇల్లు ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి. అప్పుడు అద్దెను వారు తమ ఆదాయంగా డిక్లేర్ చేసి, ఇన్‌కంట్యాక్సు రిటర్నుల్లో ఇన్కమ్గా వేయాలి. పన్ను పరిధిలోకి రాకపోతే సమస్య లేదు. తక్కువ శ్లాబులు పడ్డా మీకు లాభమే. పన్ను భారం తగ్గకపోతే ఆ జోలికి వెళ్లకండి. లక్ష రూపాయల్లోపల రసీదులు అడగరు. బీ హ్యాపీ. ఇదీ చదవండి: ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు! జీవిత భాగస్వామి పేరు మీద ఇల్లు ఉండి, ఆ వ్యక్తి పన్ను పరిధిలోకి రాకపోతే ఈ ప్లానింగ్ చేయండి. కానీ నిజంగా చెల్లించడం, అటు పక్క వ్యక్తికి ఆదాయంగా చూపించడం, నిజమైన రసీదు, నిజమైన డిక్లరేషన్స్తో అంతా నిఖార్సయిన వ్యవహారంగా ఉండాలి. ఎందుకంటే, డిపార్ట్మెంట్ వారి దగ్గర దొంగ రశీదుల వ్యవహారం రుజువులతో సహా ఉంది. అద్దె విషయంలో అవకతవకలకు పాల్పడకండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఏపీ 11వ పీఆర్సీ నివేదిక.. కేంద్రం తరహాలోనే!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఏడు రకాల విశ్లేషణలు చేసిన సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) మాదిరిగానే ఇవ్వాలని సిఫారసు చేసింది. 11వ పీఆర్సీ నివేదికను సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందచేసిన అనంతరం వెలగపూడి సచివాలయంలో కార్యదర్శుల కమిటీ సభ్యులతో కలసి సీఎస్ మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ మూడు సార్లు సమావేశమైందని, ఉద్యోగ సంఘాలతో ఒకసారి సమావేశం నిర్వహించామని చెప్పారు. అనంతరం నివేదిక రూపొందించామని, దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎంత ఇస్తే ఎంత భారం? ఫిట్మెంట్ ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశాలను విశ్లేషిస్తూ ఏడు మోడల్స్ సూచించాం. 23 శాతం ఫిట్మెంట్ అయితే ప్రభుత్వంపై ఏటా రూ.11,557 కోట్ల అదనపు భారం పడుతుంది. 27 శాతం అయితే రూ.13,422 కోట్లు, కేంద్ర వేతన సంఘం అమలు చేస్తున్న 14.29 శాతం అయితే రూ.9,150 కోట్లు భారం పడుతుంది. ఏడో సీపీసీ ప్రకారం ఇస్తే... 23 శాతం ఫిట్మెంట్ ఇస్తే అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏతో రూ.10,211 కోట్ల అదనపు భారం పడుతుంది. 23.5 శాతం ఫిట్మెంట్ అయితే అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏతో రూ.11,413 కోట్లు భారం పడుతుంది. 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి హెచ్ఆర్ఏ, క్వాంటమ్ పెన్షన్ 7వ సీపీసీ ప్రకారం ఇస్తే రూ.12,736 కోట్ల అదనపు భారం పడుతుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర వేతన సంఘం ఇస్తున్న ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సిఫారసు చేశాం. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది మంచి విధానం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే అమలు చేస్తున్నారు. ఇక్కడా కూడా ఇది అమలు చేయాలి. 2018 నుంచి అమలు ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలని సిఫారసు చేశాం. ఈ ఏడు సిఫారసుల్లో ఏది అమలు చేసినా ప్రభుత్వంపై సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద సుమారు రూ.16 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్.. ఉద్యోగ సంఘాలకు ప్రతి 11 పీఆర్సీ నివేదికను ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. ఉద్యోగ సంఘాల నేతలకు కాపీని అందచేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, హోంగార్డులను పీఆర్సీ నివేదికలో కలిపాం. గతంలో ఈ విధానం లేదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా చేర్చాం. ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇతర సంక్షేమ చర్యలను కూడా సూచించాం. వైద్యం, ఇతర సౌకర్యాలపైనా సిఫారసులు చేశాం. జీతాల వ్యయం ఏపీలో 36 శాతం.. తెలంగాణలో 21 శాతం నివేదిక తయారు చేసే క్రమంలో ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాలను కూడా పోల్చి చూశాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో ఉద్యోగుల జీతాల వ్యయం ఏపీలో ప్రస్తుతం 36 శాతం ఉంది. చత్తీస్‌ఘడ్‌లో 32 శాతం, మహారాష్ట్రలో 31, పశ్చిమబెంగాల్ 31, ఒరిస్సా 29, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం, తెలంగాణలో 21 శాతం ఉంది. మిగతావి కూడా పరిష్కరిస్తాం.. సీపీఎస్‌కి పీఆర్సీకి సంబంధం లేదు. నివేదిక తయారు చేసేముందు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో వేతనాలు, గత 30 సంవత్సరాల్లో వేతనాలపై అధ్యయనం చేశాం. భవిష్యత్తులో ఎలా ఉండాలో చూసి నివేదిక ఇచ్చాం. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటి కాగా మిగిలిన వాటిపై రాష్ట్ర, జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ పరిశీలిస్తున్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తాం. హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ) 11వ పీఆర్సీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలివెళ్లిన ఉద్యోగులకు మూల వేతనంలో 30 శాతం లేదా నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 22 శాతం లేదా నెలకు రూ.22,500లు ఇవ్వాలి. రెండు నుంచి పది లక్షల జనాభా లోపు ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 20 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా ఇవ్వాలి. 50 వేల నుంచి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 14.5 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 12 శాతం లేదా నెలకు రూ.17 వేలకు మించకుండా ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: కేంద్ర ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 24 శాతం, 5 లక్షల నుంచి 50 లక్షలలోపు ఉన్న నగరాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 16 శాతం, ఐదు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 8 శాతాన్ని హెచ్ఆర్ఏగా ఇవ్వాలి. సిటీ కాంపెంసేటరీ అలవెన్స్(సీసీఏ) 11వ పీఆర్సీ కమిటీ: విశాఖపట్నం, విజయవాడల్లో రూ.400 నుంచి రూ.1000, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.300 నుంచి రూ.750 చొప్పున ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: కేంద్ర ఆరో వేతన సంఘం సీసీఏను రద్దు చేసింది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఏను రద్దు చేయాలి. అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ 11వ పీఆర్సీ: ఉన్నత అర్హతలు సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇవ్వకూడదు. సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ కమిటీ సిఫార్సును అమలు చేయాలి. కరవు భత్యం(డీఏ) 11వ పీఆర్సీ: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరహాలోనే ఏడాదికి రెండు సార్లు జనవరి 1, జూలై 1న డీఏలు ఇవ్వాలి. 1–1–2019 నుంచి కేంద్రం డీఏను ఒక శాతం పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం పెంచాలి. సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ చేసిన సిఫార్సును అమలు చేయాలి. -
నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్ కార్యాలయం ఆదేశించినట్టు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్(యూఎఫ్ఆర్టీఐ) ప్రతినిధులు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తమకు గవర్నర్ కార్యాలయం సమాచారమిచ్చిందని వారు వెల్లడించారు. యూఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు నిమ్మగడ్డపై గత డిసెంబర్ 14న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ యూఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, నస్రీన్‌బేగంలు తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం కోరారు. దీనికి గవర్నర్ కార్యాలయ కార్యదర్శి ముఖేష్‌కుమార్ బదులిస్తూ.. ఆ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్ 24న ఆదేశించినట్టు తెలిసినట్టు వారు పేర్కొన్నారు. (చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!) ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం -
కారు...కార్యాలయం...సహాయకుడు
ఇంటి అద్దె, కంప్యూటరు, ఫోనూ కావాలట.. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల డిమాండ్ సిటీబ్యూరో: ‘ఓ కారు... నడపడానికి డ్రైవర్... కార్యాలయం... సహాయకుడు... కంప్యూటరు... ఫోను...’ ఇవన్నీ మన కార్పొరేటర్లకు కావాలట.. పనిలో పనిగా ఇంటి అద్దె అలవెన్స్, హెల్త్‌కార్డులు కూడా కావాలంటున్నారు. కంప్యూటర్‌కు ప్రింటర్, స్కానర్, కారుకు డీజిల్ అదనం...ఇవన్నీ ‘సేవ’ కోసమేనట. ఇక వేతనాల పెంపు డిమాండ్ ఎలాగూ ఉన్నదే. ఓ వైపు తమ చాంబర్లలో మార్పులు చేయాలని... త గినన్ని గదులు ఇవ్వాలని... ఇతర కార్యాలయ గదులను తమ కార్యాలయాల్లో విలీనం చేయాలని మేయర్.. డిప్యూటీ మేయర్లు కోరుతున్నారు. మరోవైపు వేతనాలు పెంచాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి కొత్త కార్పొరేటర్లు వచ్చాక తొలి సమావేశం ముగిసిందో... లేదో...వేతనాలు పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని కొంతమంది కార్పొరేటర్లు పల్లవి అందుకున్నారు. ఈ మేరకు నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పైన చెప్పినవన్నీ కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇవన్నీ సమకూరిస్తే సేవాభావం ఉన్న కార్పొరేటర్లు నిజాయితీగా పని చేయగలుగుతారని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.5 లక్షలుగా నిర్ణయించారని... ప్రస్తుత గౌరవ వేతనం నెలకు రూ.6వేలని చెప్పారు. ఐదేళ్లకు ఈ మొత్తాన్ని లెక్కిస్తే రూ.3.60 లక్షలు మాత్రమే అవుతుందని లేఖలో ప్రస్తావించారు. కనీసం ఎన్నికల ఖర్చు కూడా ఈ వేతనంతో తిరిగి రాదని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కార్పొరేటర్లు ఈ వేతనంతో నెట్టుకురావడం కష్టమని ఏకరువు పెట్టారు. వేతనం పెంచకపోయినా... కనీసం పైన పేర్కొన్న సదుపాయాలు కల్పిస్తే నిజాయితీగా సేవ చేయగలుగుతారని, లేని పక్షంలో అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని తెలిపారు. -
ఓవైపు విరాళాలు ...మరోవైపు విపరీతమై ఖర్చులా?
-
ఓవైపు విరాళాలు ...మరోవైపు విపరీతమై ఖర్చులా?
హైదరాబాద్ : ఓవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందంటూనే మరోవైపు ప్రభుత్వం మంత్రుల ఇంటి అద్దె అలవెన్స్నులను పెంచింది. ఇప్పటివరకూ మంత్రుల ఇంటి అద్దె అలవెన్సు రూ.50వేలు ఉండగా, దాన్ని ప్రభుత్వం లక్షకు పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉందంటూనే ఈ దుబారా ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని కోసం ఓవైపు విరాళాలు అడుగుతూ...మరోవైపు విపరీతంగా ఖర్చులు పెడుతున్నారని కోటంరెడ్డి మండపడ్డారు. -
మీ ఓనర్‌కు పాన్‌కార్డుందా?
ముందస్తు పన్ను కోత (టీడీఎస్) నుంచి తప్పించుకోవాలంటే మీ ఆదాయ వ్యయాలు, సేవింగ్స్ వంటి వివరాలను ఈ నెలాఖరులోగా మీమీ ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆదాయానికి అనుగుణంగా పన్ను లెక్కించి వచ్చే మూడు నెలల జీతం నుంచి టీడీఎస్ రూపంతో కోతలు తప్పవు. వీటిని తప్పించుకోవడానికి ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్, వచ్చే మూడు నెలల్లో చేయబోయే వాటి వివరాలను తప్పకుండా ఇవ్వాలి. వీటితో పాటు పన్ను భారం తగ్గించుకోవడంలో ఇంటద్దె అలవెన్స్ది (హెచ్ఆర్ఏ) కీలకపాత్ర. అయితే మనలో చాలా మంది ఇంటద్దెను ఎంత ఎక్కువ చూపిస్తే అంత పన్ను భారం తగ్గుతుందనుకుంటారు. కానీ హెచ్ఆర్ఏపై గరిష్టంగా ఎంత ప్రయోజనం లభిస్తుందనేదానికి మూడు సూత్రాలున్నాయి. ఈ మూడింట్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని గరిష్టంగా లభించే హెచ్ఆర్ఏగా భావించి ఆ మొత్తాన్ని మీ ఆదాయం లోంచి తగ్గిస్తారు. ఈ మినహాయింపు లెక్కించేటప్పుడు నాలుగంశాలను చూస్తారు. వాటిలో మొదటిది జీతం. ఇక్కడ జీతం అంటే గ్రాస్ పే కాకుండా బేసిక్ శాలరీ, డీఏ మాత్రమే. కంపెనీలిచ్చే ఇతర అలవెన్సులు, పెర్క్స్‌ను లెక్కలోకి తీసుకోరు. ఇక రెండవది కంపెనీ హెచ్ఆర్ఏ రూపంలో ఇస్తున్న అలవెన్స్ మొత్తం. మూడోది మీరు వాస్తవంగా చెల్లిస్తున్న అద్దె. చివరగా నాల్గోది.. ఎంతో కీలకమైనది.. మీరు నివసిస్తున్న నగరం. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని గరిష్టంగా ఇంటద్దె అలవెన్స్ ఎంత లభిస్తుందన్నది లెక్కిస్తారు. ఇలా లెక్కిస్తారు ఎ. జీతంలో 40 శాతం (ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై మెట్రో నగరాల్లో అయితే 50 శాతం) బి. కంపెనీ ఇంటద్దె అలవెన్స్‌గా (హెచ్ఆర్ఏ) ఇచ్చే మొత్తం. సి. చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం ఇప్పుడో ఉదాహరణ చూద్దాం... హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నగేష్ వార్షిక జీతం(బేసిక్+డీఏ) రూ.3,00,000. ఇంటద్దె అలవెన్స్ రూ.50,000. అంటే నగేష్ మొత్తం వార్షిక జీతం రూ.3,50,000. నగేష్ నెలకు రూ.5,000 చొప్పున సంవత్సరానికి అద్దెకింద రూ.60,000 చెల్లిస్తున్నాడు. ఇప్పుడు నగేష్‌కి హెచ్ఆర్ఏ క్లెయిమ్ ఎంత లభిస్తుందో చూద్దాం. ఎ. జీతంలో 40 శాతం అంటే రూ. 3,00,000లో 40 శాతం = రూ.1,20,000 బి. ఇంటద్దె అలవెన్సు = రూ.50,000 సి. చెల్లిస్తున్న అద్దెలోంచి జీతంలో 10 శాతం మినహాయించగా మిగిలిన మొత్తం రూ. 60,000 - 30,000 ( 3,00,000లో 10 శాతం) = రూ. 30,000 ఈ మూడింటిలో తక్కువ మొత్తమైన రూ.30,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతే కాని అద్దెకింద చెల్లిస్తున్న రూ.60,000 కాదు కదా, కనీసం కంపెనీ హెచ్ఆర్ఏ కింద ఇస్తున్న రూ.50,000 కూడా క్లెయిమ్ చేసుకోలేం. కనీసం కంపెనీ ఇస్తున్న హెచ్ఆర్ఏ మొత్తమైనా పొందాలనుకుంటే అద్దె కింద కనీసం రూ.80,000 చూపించాల్సి ఉంటుంది. అప్పుడు హెచ్ఆర్ఏ అలవెన్స్ కింద లభిస్తున్న రూ.50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా అద్దెను మరింత పెంచి చూపిస్తే ఏ మేరకు ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. నగేష్ నెలకు రూ.8,000 అద్దె చెల్లిస్తున్నట్లయితే సంవత్సరంలో రూ.96,000 చెల్లిస్తాడు. ఎ. జీతంలో 40 శాతం అంటే రూ. 3,00,000లో 40 శాతం = రూ. 1,20,000 బి. ఇంటద్దె అలవెన్సు = రూ. 50,000 సి. చెల్లిస్తున్న అద్దెలోంచి జీతంలో 10 శాతం మినహాయించగా మిగిలిన మొత్తం రూ. 96,000 - 30,000 ( 3,00,000లో 10 శాతం) = రూ. 66,000 ఈ మూడింటిలో కంపెనీ హెచ్ఆర్ఏగా ఇస్తున్న మొత్తమే తక్కువగా ఉండటంతో ఈ కేసులో కూడా గరిష్టంగా రూ.50,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇలా ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్లు చూపించినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేకపోగా మారిన నిబంధనలు ప్రకారం మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా.. టీడీఎస్ కోత నుంచి తప్పించుకోవాలంటే సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చే అన్ని అంశాలు అంటే... ట్యూషన్ ఫీజులు, బీమా, పీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, హౌసింగ్ లోన్ వంటి అంశాలను, వాటికి చెల్లించిన రశీదులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే... విరాళాలు, వైద్య బీమా, క్యాపిటల్ గెయిన్ మినహాయింపులు వంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఇవ్వడం ద్వారా అనవసర పన్ను కోత నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే మార్చి తర్వాత రిటర్నులు దాఖలు చేయడం ద్వారా అధికంగా చెల్లించిన పన్నులను రిటర్నుల రూపంలో పొందాలి. ముందుగా మేలుకుంటే ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చు.