ఇంటి అద్దె, కంప్యూటరు, ఫోనూ కావాలట..
జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల డిమాండ్
సిటీబ్యూరో: ‘ఓ కారు... నడపడానికి డ్రైవర్... కార్యాలయం... సహాయకుడు... కంప్యూటరు... ఫోను...’ ఇవన్నీ మన కార్పొరేటర్లకు కావాలట.. పనిలో పనిగా ఇంటి అద్దె అలవెన్స్, హెల్త్‌కార్డులు కూడా కావాలంటున్నారు. కంప్యూటర్‌కు ప్రింటర్, స్కానర్, కారుకు డీజిల్ అదనం...ఇవన్నీ ‘సేవ’ కోసమేనట. ఇక వేతనాల పెంపు డిమాండ్ ఎలాగూ ఉన్నదే. ఓ వైపు తమ చాంబర్లలో మార్పులు చేయాలని... త గినన్ని గదులు ఇవ్వాలని... ఇతర కార్యాలయ గదులను తమ కార్యాలయాల్లో విలీనం చేయాలని మేయర్.. డిప్యూటీ మేయర్లు కోరుతున్నారు. మరోవైపు వేతనాలు పెంచాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీకి కొత్త కార్పొరేటర్లు వచ్చాక తొలి సమావేశం ముగిసిందో... లేదో...వేతనాలు పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని కొంతమంది కార్పొరేటర్లు పల్లవి అందుకున్నారు. ఈ మేరకు నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పైన చెప్పినవన్నీ కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇవన్నీ సమకూరిస్తే సేవాభావం ఉన్న కార్పొరేటర్లు నిజాయితీగా పని చేయగలుగుతారని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.5 లక్షలుగా నిర్ణయించారని... ప్రస్తుత గౌరవ వేతనం నెలకు రూ.6వేలని చెప్పారు. ఐదేళ్లకు ఈ మొత్తాన్ని లెక్కిస్తే రూ.3.60 లక్షలు మాత్రమే అవుతుందని లేఖలో ప్రస్తావించారు. కనీసం ఎన్నికల ఖర్చు కూడా ఈ వేతనంతో తిరిగి రాదని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కార్పొరేటర్లు ఈ వేతనంతో నెట్టుకురావడం కష్టమని ఏకరువు పెట్టారు. వేతనం పెంచకపోయినా... కనీసం పైన పేర్కొన్న సదుపాయాలు కల్పిస్తే నిజాయితీగా సేవ చేయగలుగుతారని, లేని పక్షంలో అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని తెలిపారు.