హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టికెట్లు లభించాయి. వీరిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఇటీవలే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి చాలాకాలం క్రితమే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్లుచింది. పోటీ చేసేందుకు వీరు తమ కార్పొరేటర్ల పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచే టికెట్ పొందిన జీహెచ్‌ఎంసీని ఆనుకునే ఉన్న మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ సైతం చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పనిలేదు.
ఆయన పార్టీ కూడా మారలేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినా, మారకపోయినా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా కొనసాగుతున్న వారు ఎమ్మెల్యే వంటి ఇతర పదవులకు పోటీ చేయడానికి ముందే తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మున్సిపల్ యాక్ట్, నియమ నిబంధనల మేరకు స్థానిక సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న వారు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యే, ఇతరత్రా పదవులకు పోటీ చేయవచ్చని మున్సిపల్ చట్టాల నిపుణులు తెలిపారు. పోటీ చేసి, గెలిచాక మాత్రం పాత పదవిని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. ఏకకాలంలో రెండు పదవుల్లో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఓడిపోతే పాత పదవిలోనే యథాతథంగా కొనసాగవచ్చు.
కార్పొరేటర్లకు వర్తించదు
ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే ఎమ్మెల్యేల విషయంలోనే సవ్యంగా అమలు కావడం లేదు. ఆ చట్టం ఉన్నప్పటికీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇక ఎలాంటి చట్టమూ లేని కార్పొరేటర్లకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. పార్టీలు మారితే ఆమేరకు పాత పారీ్టకి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
– పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
ఒక్క పదవిలోనే ఉండాలి
జీహెచ్‌ఎంసీ యాక్ట్‌లోని సెక్షన్ 5–డి మేరకు కార్పొరేటర్ కంటే ఉన్నతమైన పదవిని పొందినవారు పదిహేను రోజుల్లోగా తాను కొత్త పదవిలో చేరనున్నట్లు కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయనకు కార్పొరేటర్ పదవి రద్దవుతుంది. ఎమ్మెల్యే పదవనే కాదు.. మరే ఇతర పదవైనా సరే రెండో పదవిలో ఉండటం చెల్లదు. ఏకకాలంలో ఒకే పదవిలో మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యేగా పోటీచేసేవారు గెలవని పక్షంలో యథావిధిగా తమ కార్పొరేటర్ పదవిలో కొనసాగవచ్చు. సాంకేతికంగానూ ఎలాంటి విధివిధానాలంటూ లేవు.
– జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారి
మారిన వారెందరో..
జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే పలువురు పారీ్టలు మారారు. ఆమేరకు వారు సాంకేతికంగా ఆచరించాల్సిన విధానాలంటూ ఏమీ లేకపోవడంతో సర్వసభ్య సమావేశాలప్పుడు మాత్రం మారిన పార్టీ సభ్యులతో కలిసి కూర్చుంటున్నారు. అంతకుమించి పాటించిన విధానాలేమీ లేవు.
Comments
Please login to add a commentAdd a comment