ప్రతి అడుగూ ప్రజాపక్షమే..
వర్థమాన నేతల అభిమతం
గ్రేటర్ బరిలోకి తొలిసారి దిగినవారు.. గెలుపు వీరులుగా నిలిచారు. గతంలో రాజకీయ అనుభం లేనివారు కొందరు.. ఇంటికే పరిమితమైన స్త్రీమూర్తులు మరికొందరు.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధపడినవారు ఒకరు. ఎన్నికల వేళ గల్లీగల్లీ తిరిగారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశారు. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ‘ఇలాంటి’ ప్రాంతాలు కూడా ఉన్నాయా..! అన్న అనుమానం అప్పుడు.. అనుక్షణం కష్టించి తమకు పట్టం కట్టినవారికి అండగా నిలిచి.. కష్టాలు తొలగించాలనే దృఢ నిశ్చయం ఇప్పుడు. తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికై, బల్దియా ప్రధాన కార్యాలయంలో నేడు అడుగుపెడుతున్న వర్ధమాన నేతలు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే.. - సాక్షి నెట్‌వర్క్
గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా
ఆదర్శ డివిజన్ రూపకల్పనే లక్ష్యం
ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో పర్యటించినప్పుడు చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారానికి ఈనెల 15 నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తా. అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తా. ఇకపై తరచూ ఇలాంటి పర్యటనలు చేస్తునే ఉంటాను. చేసిన ప్రతి పనిపైనా.. అది ప్రజలకు ఎంతవరకు మేలు చేకూరిందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా చూస్తూ తరచూ ప్రజలతో మమేకమయ్యేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. డివిజన్ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న, చేయని పవర్ బోర్ల వివరాలు తెలుసు కుంటున్నాం. వాటి మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకునేలా చేస్తాం. పైప్‌లైన్ ద్వారా తాగునీరు మరింత మెరుగ్గా సరఫరా అయ్యేలా అధికారులు చేస్తున్నారు. హైటెక్ జోన్‌గా పేరున్నా గచ్చిబౌలిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అన్ని కాలనీలు,బస్తీలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. అయిదేళ్లలో ఓపెన్ డ్రైనేజీ అనేది లేకుండా చేయాలన్నది నా లక్ష్యం. చీకటి పడితే వీధుల్లో వెలగని వీధి లైటు అన్నది లేకుండా చూస్తా. త్వరలో అధికారులతో సమావేశమై వీధిదీపాలు అన్ని చోట్ల వెలిగేలా చూస్తాను.
ప్రజలు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తేవాలని కోరుతున్నా. గోపన్‌పల్లి శ్మశానవాటిక అభివృద్ధి పనులు సాగుతున్నాయి. నానక్‌రాంగూడలో స్థానికులు అభివృద్ధికి ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు. పార్కులు కేవలం టెలికాం నగర్, జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోనే ఉన్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేస్తాం. కాలనీ, బస్తీల్లో సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తాం. వారంతా కనీసం నెలకోమారు సమావేశమయ్యేలా చూస్తాను. వారంతా ఏకగ్రీవంగా చెప్పే పనులను వెంటనే అమలు చేసేందుకు కృషి చేస్తా.
మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్
ప్రధాన సమస్యలపై తొలిపోరు..
నా డివిజన్‌లో కాలనీలు చాలా తక్కువ. అత్యధికంగా అపార్ట్‌మెంట్లు, మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అంతే కాకుండా శిథిల రోడ్లు, వెలగని విద్యుద్దీపాలు వంటి సమస్యలు చాలా ఉన్నాయి. డివిజన్‌లో అన్ని కాలనీలు, అపార్ట్‌మెంట్లకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకుచర్యలు తీసుకుంటాను. వివాదాస్పద స్థలంలో ఉన్న ఇళ్లకు ఇంటి నంబర్లు, పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని గ్రేటర్ ఎన్నికల్లో హామీ ఇచ్చాను. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తా. మురికివాడలైన ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, మక్తా మహబూబ్‌పేట్, బాలాజీ నగర్, న్యూకాలనీ, నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్, ప్రశాంత్ నగర్, కృషి నగర్, మయూరి నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. వీటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. మియాపూర్ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేస్తా. మంత్రి కేటీఆర్ మా డివిజన్ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, అదేవిధంగా ఇంటింటికీ నల్లా, మార్కెట్ల నిర్మాణం, అధునాతన శ్మశానవాటిక ఏర్పాటు తప్పకుండా ఏర్పాటు చేస్తా. వృద్ధులు అందరికీ ‘ఆసరా’ పథకం అందేలా చూ స్తాం. నా ప్రధాన ఎజెండా ప్రజా సమస్యలు తీర్చడమే. గెలిపించిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటా.
ఉప్పల్ కార్పొరేటర్ అనలారెడ్డి
అందుబాటులో ఉంటా..
డివిజన్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించగలిగే పనులన్నీ పూర్తి చేస్తాం. స్థానికుల సహకారంతో మెరుగైన పాలనకు శ్రీకారం చుడతా. డంపింగ్ యార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, తాగునీటి కాలుష్యం.. వంటి సమస్యలను గుర్తించాం. ప్రధానంగా ఉప్పల్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ వద్ద ఉన్న చెత్త డంపింగ్ పాయింట్ (ట్రాన్సిట్ పాయింట్) వల్ల స్థానికంగా 25 కాలనీల్లో కలుషిత వాతావరణం ఏర్పడింది.
ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారిస్తాం. తొలుత డంపింగ్ పాయింట్‌ను వేరేచోటుకు తరలించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరస్వతి కాలనీ, విజయపురి కాలనీ, సూర్యానగర్, శాంతినగర్, తదితర ప్రాంతాలు ఓపెన్ నాలాల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితమవుతున్నాయి. ఈ సమస్యను కూడా ప్రాధాన్యం ఇస్తాను. ఔట్‌లెట్ లేని కారణంగా డివిజన్‌లో చాలా వరకు కాలనీలు మురుగుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దోమల బెడద, మురుగు కాలువలు పందులకు అవాసాలుగా మారాయి. అధికారుల సహాయంతో ఈ సమస్యను కూడా పరిష్కరిస్తాం. సౌత్ స్వరూప్‌నగర్‌తో పాటు మరికొన్ని కాలనీలలో మంచినీటి పైప్‌లైన్ లేదు. దేవేందర్‌నగర్‌లో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే నీరు అందుతోంది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రాంతాల్లో పైప్‌లైన్లు వేయిస్తాం. మంచినీటి సమస్యను పూర్తిగా తీరుస్తాం.
గరీబోళ్లకు అండగా ఉంటా..
మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్
నిరుపేద కుటుంబంలో జన్మించిన నాకు సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై అనుభవం ఉంది. నగరంలో సొంత ఇల్లు లేకుండే పేదలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అది నాకు అనుభవమే. ఇప్పటికీ నాకు సొంత ఇల్లంటూ లేదు. అందుకే నా తొలి ప్రాధాన్యం గరీబోళ్లకే. పేదరికంలో మగ్గుతున్న నా కుటుంబానికి కొన్నేళ్లుగా నందకిషోర్ వ్యాస్ ట్రస్ట్ అండగా నిలిచింది. ట్రస్ట్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అంతేగాక కార్పొరేటర్‌గా టికెట్ ఇప్పించి గెలిపించారు. స్థానిక ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారు. నా డివిజన్‌లో అధికంగా నిరుపేదలే ఉన్నారు. వారికి ముఖ్యమంత్రి ప్రకటించిన డబుల్ బెడ్‌రూమ్ పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేయించేందుకు నా వంతు కృషి చేస్తాను. చాలా కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నాయి. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. నాకు చిన్ననాటి నుంచి గరీబీతనం తెలుసు. గరీబోళ్ల సంక్షేమమే నా ధ్యేయం.
మూసీ ప్రాంతం సుందరీకరణే లక్ష్యం..
కొత్తపేట కార్పొరేటర్ సాగర్‌రెడ్డి
డివిజన్‌లోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీరు, సీసీరోడ్లు వంటి మౌలిక వసతులు లేవు. ఎన్నికల ప్రచారంలో వాటిని గుర్తించా. ప్రతి సమస్యను నోట్ చేసుకున్నా. ఇకపై అక్కడ సదుపాయాల కల్పనకే నా ప్రథమ ప్రాధాన్యం ఇస్తాను. డివిజన్‌ను ఆనుకుని ఉన్న మూసీ ప్రాంత సుందరీకరణకు నా వంతు ప్రయత్నం చేస్తాను. మూసీ వెంట లుంబినీ పార్కులా అందమైన పార్కు ఏర్పాటు చేయడమే నా కల. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాను. చదువుకునే రోజులలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవాడిని. అక్కడి నేలంతా పచ్చని పొలాలతో ఎంతో బాగుంది. ఇక్కడ మాత్రం నీరు లేక ఇబ్బందులు పడేవారు. అక్కడి స్ఫూర్తితో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. హైటెక్‌సిటీ బిల్డింగ్ కన్‌ష్ట్రక్షన్స్‌లో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉద్యోగం మానేసి ఉద్యమంలో భాగమయ్యా. డివిజన్‌లో ప్రతి ఒక్కరూ ఉపాధి బాట పట్టాల్సిందే. అదే నాధ్యేయం. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తాను. అధికారులతో కలిసి డివిజన్‌ను అభివృద్ధి పథాన నడిపిస్తాను. ఇందుకోసం అందరి సహకారం తీసుకుంటాను.
కార్మికుల పక్షాన నిలుస్తా..
చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి
డివిజన్‌లో అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా చిన్నారులకు పౌష్టికాహారం సరిగా అందడం లేదు. దీంతో చిన్నారులకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్యను పెంచడం, వాటికి నాణ్యమైన సరుకులు అందించేలా దృష్టి పెడతా. మంజీరా పైప్‌లైన్ లేని ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్ విభాగాలు నీరు అందిస్తున్నాయి. కానీ అది ప్రజలకు అరకొరగానే అందుతోంది. వచ్చేది వేసవి కావడంతో తాగునీటి సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీరు అక్రమ మార్గాలకు తరలకుండా చర్యలు తీసుకుంటాం. ఉదయం వేళల్లో మహిళలు రోడ్లు ఊడుస్తూ శానిటేషన్ నిర్వహిస్తున్నారు. కొంతమంది స్వార్థం వల్ల వారికి సరైన జీతభత్యాలు అందడం లేదని తెలిసింది. కొన్నిచోట్ల అందరూ వచ్చినట్టు హాజరు పట్టికలో ఉన్నా.. కేవలం ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తున్నట్టు గుర్తించాం. పనిచేసేవారికి ప్రభుత్వం ఇచ్చే జీతం సక్రమంగా అందేటట్టు చూస్తా. ప్రధానంగా చందానగర్ నుంచి అమీన్‌పూర్ వైపు వెళ్లే రోడ్డును 150 అడుగులు వెడల్పున వేయాలి. రోడ్డు కోసం స్థలం వదిలినా రోడ్డు మాత్రం వేయలేదు. దీంతో ఇరువైపులా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ రోడ్డును వేసేందుకు వెంటనే చర్యలు చేపడతాను.
అర్హులకు ఇళ్లు ఇప్పిస్తా..
అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి
ఇటీవల ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంతో పాటు అందరికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఎన్నికలకు ముందు వ్యవసాయం, వ్యాపార వ్యవహారాలను చూసుకోవడంలో భర్త శ్రీనివాస్‌రెడ్డికి తోడుగా ఉండేదాన్ని. మామ కనకారెడ్డి ఎమ్మెల్యే. ఆయన వద్దకు వచ్చే ప్రజలకు అవసరమయ్యే సహాయ సహకారాలు అందించేవారు. అప్పుడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేవారు. డివిజన్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడు చాలా సమస్యలను నేను గుర్తించాను. వీటీలో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించాను. వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా. డివిజన్‌లోని అర్హులైన వారందరికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరు చేయించడం నా ప్రధమ కర్తవ్యం. ప్రతి ఇంటింటికి తాగు నీరు, కొత్త చెరువు, చిన్న రాయుని చెరువులను సుందరీకరణకు చర్యలు తీసుకుంటా. అల్వాల్ ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంచి పునర్నిర్మాణం చేయడం నాలక్ష్యం.
సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ
పూర్తి సమయం ప్రజలకే..
ఎన్నికల ప్రచారంలో డివిజన్‌లోని గల్లీగల్లీ తిరిగాను. ఎన్నికలు, ప్రచారం, ప్రజా సమస్యల గురించి పూర్తిగా అప్పుడే తెలుసుకున్నాను. రెండు రోజులు ఇబ్బంది పడ్డా.. ఆ తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి శాయాశక్తులా కృషి చేయాలని నిశ్చయించుకున్నా. నగరంలోనే భారీ మెజారిటీ రావడం పట్ల కార్పొరేటర్‌గా నా బాధ్యత మరింత పెరిగింది. నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. సీతాఫల్‌మండిలో జూనియర్ కళాశాల ఏర్పాటనేది 25 ఏళ్ల కల. ఎన్నికలకు ముందే మంత్రి పద్మారావు ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించారు. డిగ్రీ కళాశాలకు కూడా. ఈ రెండు కళాశాలల ఏర్పాటులో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉంది. వీటితో పాటు ఇక్కడి ప్రభుత్వ విద్యాసంస్థలను ఆధునికీకరించి సీతాఫల్‌మండి డివిజన్‌ను విద్యా సంస్థలకు నిలయంగా మార్చాలని ఉంది. వాస్తవానికి ఎంబీఏ తర్వాత జెన్‌ప్యాక్, గూగుల్ సంస్థల్లో పనిచేశా. ఎంఎస్ కోసం ఫారిన్ వెళ్లాలని అన్నీ సిద్ధం చేసుకున్నా. మా నాన్న కరాటే రాజు కార్పొరేటర్‌గా గెలవగానే అమెరికాకు విమానం ఎక్కాలకున్నాను. ఒక్కరోజులోనే వ్యవహారమంతా మలుపు తిరిగింది. మహిళా రిజర్వేషన్ కారణంగా మా నాన్నకు అవకాశం లేకపోయింది. దీంతో నన్ను ఎన్నికల బరిలోకి దింపమని మంత్రి పద్మారావు సూచించారు. దీంతో అమెరికా చదువు కోరికను పక్కనబెట్టి బల్దియాలో అడుగుపెట్టాను. ఇక ఉద్యోగం, చదువు లేదిప్పుడు. పూర్తి సమయం డివిజన్ ప్రజలకే కేటాయిస్తా. తాగునీరు, డ్రైనేజీ వంటి ఇబ్బందులు చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నిత్యం డివిజన్‌లో తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. అధికారులను సమన్వయ పరిచి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతా. రాజకీయాల కు నేను కొత్తే అయినా ప్రజల ఆదరణ పట్టుదలను పెంచింది. బాధ్యతతో మసులుకుంటా, నిస్వార్థంగా సేవ చేస్తా.
యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్ గౌడ్
రాజకీయాలకు తావుండదు..
మా తండ్రి మురళి గౌడ్ గతంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా పనిచేయడం, నేను ఇక్కడే పుట్టి పెరగడంతో డివిజన్ పైన, ఇక్కడి అన్ని రకాల సమస్యలపైనా పూర్తిఅవగాహన ఉంది. డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, అక్రమ కట్టడాలు సహా అన్ని సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరుచుకొని పదవీకాలంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తా. అత్యవసరమైన పనులకు తొలి ప్రాధాన్యం ఇస్తా. ప్రధానంగా ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజలకు నీటి సమస్యలు ఏర్పడకుండా చేయాల్సిన ఏర్పాట్లపై త్వరలోనే అధికారులతో కలిసి కార్యచరణ రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాను. పెండింగ్‌లో ఉన్న వరదనీటి కాలువ నిర్మాణ పనులకు త్వరగా నిధులు మంజూరయ్యేలా అధికారులపై ఒత్తిడి తెస్తాను. అక్రమ కట్టడాలు అనేవి నగరవ్యాప్తంగా ఉన్న సమస్య. అక్రమ కట్టడాలను ప్రోత్సహించేది లేదు. తాతల కాలం నాడు వేసిన మురుగునీటి పైప్‌లైన్లు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. వీటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాను. నిర్మాణాత్మక సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తాను. అన్ని పార్టీలు, నాయకులను కలుపుకుపోతూ సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేస్తా. రాజకీయాలను పక్కనపెట్టి పూర్తిస్తాయిలో అభివద్ధిపై దృష్టి పెడతా. అవినీతికి దూరంగా పారదర్శకంగా వ్వవహరిస్తాను. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తెస్తే సాధ్యమైనంత వేగంగా పరిష్కారానికి కృషి చేస్తాను. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటా. నా ఫోన్ నెంబర్, వాట్సప్, ఫేస్‌బుక్ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి..
ప్రజల కోసం దేనికైనా సిద్ధమే..
ప్రజల సమస్యలను ఏడాది కాలం నుంచి దగ్గర నుంచి చూసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి బంజారాహిల్స్ ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాను. వాటి పరిష్కార మార్గాలు సైతం అప్పుడే ఆలోచించాను. నాపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. దాన్ని కాపాడుకుంటా. మా తండ్రి కేకే అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ప్రజలకోసం ఏమైనా చేయాలనే తెగింపు ఆయన ద్వారానే నాకు వచ్చింది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవాలని ఆయన ఇచ్చిన సలహా ఎన్నికల ముందు బాగా పనిచేసింది. అందుకే భారీ మెజారిటీ వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో మహిళా భవన్ నిర్మాణం నా కలల ప్రాజెక్ట్. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఇక్కడ మహిళా భవన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడమే కాకుండా సీఎం కేసీఆర్‌తో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించాం. త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభమవుతాయి. ప్రచారంలో భాగంగా ప్రతి గల్లీ తిరిగాను. చాలాచోట్ల రోడ్లు దెబ్బతినడం చూశాను. పలుచోట్ల డ్రెయినేజీ సమస్యను కూడా కళ్లారా చూశాను.
అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దగ్గర నుంచి గమనించాను. వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టడం, పురోగతిపై వారి వెంటపడటం జరుగుతుంది. త్వరలోనే నేను చూసిన, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలను నూరు శాతం పరిష్కరిస్తా. అమెరికాలో 18 ఏళ్ల పాటు ఉన్నా నా చదువంతా నగరంలోనే సాగింది. ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి కళాశాల యూనియన్ ఉపాధ్యక్షురాలిగా, ఇంకోసారి యూనియన్ జాయింట్ సెక్రటరీగా గెలిచాను. ఆ అనుభవం కార్పొరేటర్‌గా నాకు ఉపయోగపడుతుంది.