
మీ ఓనర్‌కు పాన్‌కార్డుందా?
ముందస్తు పన్ను కోత (టీడీఎస్) నుంచి తప్పించుకోవాలంటే మీ ఆదాయ వ్యయాలు, సేవింగ్స్ వంటి వివరాలను ఈ నెలాఖరులోగా మీమీ ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆదాయానికి అనుగుణంగా పన్ను లెక్కించి వచ్చే మూడు నెలల జీతం నుంచి టీడీఎస్ రూపంతో కోతలు తప్పవు. వీటిని తప్పించుకోవడానికి ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్, వచ్చే మూడు నెలల్లో చేయబోయే వాటి వివరాలను తప్పకుండా ఇవ్వాలి. వీటితో పాటు పన్ను భారం తగ్గించుకోవడంలో ఇంటద్దె అలవెన్స్‌ది (హెచ్‌ఆర్‌ఏ) కీలకపాత్ర. అయితే మనలో చాలా మంది ఇంటద్దెను ఎంత ఎక్కువ చూపిస్తే అంత పన్ను భారం తగ్గుతుందనుకుంటారు.
కానీ హెచ్‌ఆర్‌ఏపై గరిష్టంగా ఎంత ప్రయోజనం లభిస్తుందనేదానికి మూడు సూత్రాలున్నాయి. ఈ మూడింట్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని గరిష్టంగా లభించే హెచ్‌ఆర్‌ఏగా భావించి ఆ మొత్తాన్ని మీ ఆదాయం లోంచి తగ్గిస్తారు. ఈ మినహాయింపు లెక్కించేటప్పుడు నాలుగంశాలను చూస్తారు. వాటిలో మొదటిది జీతం. ఇక్కడ జీతం అంటే గ్రాస్ పే కాకుండా బేసిక్ శాలరీ, డీఏ మాత్రమే. కంపెనీలిచ్చే ఇతర అలవెన్సులు, పెర్క్స్‌ను లెక్కలోకి తీసుకోరు. ఇక రెండవది కంపెనీ హెచ్‌ఆర్‌ఏ రూపంలో ఇస్తున్న అలవెన్స్ మొత్తం. మూడోది మీరు వాస్తవంగా చెల్లిస్తున్న అద్దె. చివరగా నాల్గోది.. ఎంతో కీలకమైనది.. మీరు నివసిస్తున్న నగరం. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని గరిష్టంగా ఇంటద్దె అలవెన్స్ ఎంత లభిస్తుందన్నది లెక్కిస్తారు.
ఇలా లెక్కిస్తారు
ఎ. జీతంలో 40 శాతం (ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై మెట్రో నగరాల్లో అయితే 50 శాతం)
బి. కంపెనీ ఇంటద్దె అలవెన్స్‌గా (హెచ్‌ఆర్‌ఏ) ఇచ్చే మొత్తం.
సి. చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం
ఇప్పుడో ఉదాహరణ చూద్దాం...
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నగేష్ వార్షిక జీతం(బేసిక్+డీఏ) రూ.3,00,000. ఇంటద్దె అలవెన్స్ రూ.50,000. అంటే నగేష్ మొత్తం వార్షిక జీతం రూ.3,50,000. నగేష్ నెలకు రూ.5,000 చొప్పున సంవత్సరానికి అద్దెకింద రూ.60,000 చెల్లిస్తున్నాడు.
ఇప్పుడు నగేష్‌కి హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ ఎంత లభిస్తుందో చూద్దాం.
ఎ. జీతంలో 40 శాతం అంటే రూ. 3,00,000లో 40 శాతం = రూ.1,20,000
బి. ఇంటద్దె అలవెన్సు = రూ.50,000
సి. చెల్లిస్తున్న అద్దెలోంచి జీతంలో 10 శాతం మినహాయించగా మిగిలిన మొత్తం రూ. 60,000 - 30,000 ( 3,00,000లో 10 శాతం) = రూ. 30,000
ఈ మూడింటిలో తక్కువ మొత్తమైన రూ.30,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతే కాని అద్దెకింద చెల్లిస్తున్న రూ.60,000 కాదు కదా, కనీసం కంపెనీ హెచ్‌ఆర్‌ఏ కింద ఇస్తున్న రూ.50,000 కూడా క్లెయిమ్ చేసుకోలేం.
కనీసం కంపెనీ ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏ మొత్తమైనా పొందాలనుకుంటే అద్దె కింద కనీసం రూ.80,000 చూపించాల్సి ఉంటుంది. అప్పుడు హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్ కింద లభిస్తున్న రూ.50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.
అలా కాకుండా అద్దెను మరింత పెంచి చూపిస్తే ఏ మేరకు ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. నగేష్ నెలకు రూ.8,000 అద్దె చెల్లిస్తున్నట్లయితే సంవత్సరంలో రూ.96,000 చెల్లిస్తాడు.
ఎ. జీతంలో 40 శాతం అంటే రూ. 3,00,000లో 40 శాతం = రూ. 1,20,000
బి. ఇంటద్దె అలవెన్సు = రూ. 50,000
సి. చెల్లిస్తున్న అద్దెలోంచి జీతంలో 10 శాతం మినహాయించగా మిగిలిన మొత్తం రూ. 96,000 - 30,000 ( 3,00,000లో 10 శాతం) = రూ. 66,000
ఈ మూడింటిలో కంపెనీ హెచ్‌ఆర్‌ఏగా ఇస్తున్న మొత్తమే తక్కువగా ఉండటంతో ఈ కేసులో కూడా గరిష్టంగా రూ.50,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది.
కాబట్టి ఇలా ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్లు చూపించినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేకపోగా మారిన నిబంధనలు ప్రకారం మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇవి కాకుండా..
టీడీఎస్ కోత నుంచి తప్పించుకోవాలంటే సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చే అన్ని అంశాలు అంటే... ట్యూషన్ ఫీజులు, బీమా, పీఎఫ్, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, హౌసింగ్ లోన్ వంటి అంశాలను, వాటికి చెల్లించిన రశీదులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే... విరాళాలు, వైద్య బీమా, క్యాపిటల్ గెయిన్ మినహాయింపులు వంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఇవ్వడం ద్వారా అనవసర పన్ను కోత నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే మార్చి తర్వాత రిటర్నులు దాఖలు చేయడం ద్వారా అధికంగా చెల్లించిన పన్నులను రిటర్నుల రూపంలో పొందాలి. ముందుగా మేలుకుంటే ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చు.