మీరు ఉద్యోగస్తులైతే, మీకిచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. గవర్నమెంటు, పబ్లిక్ సంస్థల్లో అయితే, వారివారి రూల్స్/ఒప్పందం ప్రకారం ఉంటాయి. అలాగే చెల్లిస్తారు. మీ ప్రమేయమే ఉండదు. ఇచ్చింది.. ఇచ్చినట్లు తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థల్లో కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా బలమైన ఉద్యోగ సంస్థలుంటే మన పప్పులుడకవ్! మీరు ఆ సంస్థలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైతే, ఉద్యోగిగానే కొనసాగుతుంటే బేరసారాలతో పాటు అలవెన్సుల సంగతిలోనూ వెసులుబాటు అడగవచ్చు. ఆ గొడవలన్నీ పక్కన పెడితే, యజమాని ఇచ్చే ‘ఇంటద్దె అలవెన్సు’ జీతంలో ఒక అంశం. మొత్తం జీతభత్యాలతో కలిసి ఉంటుంది. ఈ అలవెన్సును ఆదాయంగా పరిగణిస్తారు. పన్నుకి గురి అవుతుంది. అయితే, అద్దె ఇంట్లో ఉంటూ, మీరు అద్దె ఇచ్చినట్లయితేనే చట్టప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఈ అలవెన్సు ఉద్దేశం, మీరు ఆ మొత్తం ఇచ్చి అద్దె ఇంట్లో ఉండటం. అద్దె కోసం ఆ మొత్తాన్ని వినియోగించడం జరగాలి.
ఈ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.
మీరు ఆ సంస్థలో ఉద్యోగిగానే ఉండాలి.
మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లిస్తుండాలి.
అద్దె చెల్లిస్తున్నట్లు కాగితాలు, రుజువులు ఉండాలి.
సొంత వ్యాపారస్తులకు, వృత్తి ఉన్నవారికి ఇది వర్తించదు.
అద్దె అంటే వసతి కోసం ఇచ్చే అద్దె, నిర్వహణ ఖర్చులు మాత్రమే. కరెంటు చార్జీలు, నీటి చార్జీలు మొదలైనవి కావు.
సొంత ఇంట్లో ఉంటూ ఈ మినహాయింపు పొందకూడదు. కుటుంబ సభ్యులతో ఉంటూ అద్దె చెల్లించకపోతే ఈ మినహాయింపు ఇవ్వరు.
ఇచ్చే జీతభత్యాల్లో ఈ అలవెన్సు లేకపోతే ఎటువంటి మినహాయింపు ఇవ్వరు.
ఈ మూడింట్లో తక్కువ దాన్నే మినహాయిస్తారు.
(a) వచ్చిన అలవెన్సు
(b) చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం జీతం తీయగా, మిగిలిన మొత్తం
(c) మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో జీతాల్లో 40 శాతంచెల్లించినట్లు రుజువు కావాలి. అవసరమైతే అగ్రిమెంటు, మీ బ్యాంకు అకౌంటు, ఓనర్ పాన్ కార్డు, ఓనర్ బ్యాంకు అకౌంటు, రశీదులు మొదలైనవి కావాలి.
ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఉండకూడదు.
మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో అద్దె చెల్లించాలి.
ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు
భార్యభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఇద్దరూ మినహాయింపు పొందకండి. ఇద్దరూ వేర్వేరు అగ్రిమెంటు ద్వారా పెద్ద ఇల్లు తీసుకుంటే ఎక్కువ అద్దె అయితే, అగ్రిమెంట్లు వేరు, చెల్లింపులు వేరు, రశీదులు వేరు, లెక్కలు వేరు.
ఒక్కరే ఉద్యోగి అయి, మిగతావారు ఓనర్ అయితే, అగ్రిమెంటు రాసుకోండి. చెల్లింపులు సక్రమంగా చేయండి. పాన్ తీసుకోండి. అటు పక్క వ్యక్తికి సంబంధించిన ఇన్‌కంట్యాక్స్ లెక్కల్లో ఆదాయంగా చూపించండి.
అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, మావగారింట్లో చూరు పట్టుకు వేళ్లాడుతున్నా.. అగ్రిమెంట్లు ముఖ్యం. చెల్లింపులు, రశీదులు, లెక్కలు పక్కాగా ఉండాలి.
దొంగ ఇంటి నంబర్లు వేసి క్లెయిమ్ చేయకండి.
మీ ఇంటికి మీరే ఓనర్ అని ఎడమ చేత్తో సంతకం పెట్టి క్లెయిమ్ చేయకండి.
హైదరాబాదులాంటి మహానగరంలో స్వంత ఇల్లు ఉండగా అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వంత ఇల్లు మీద అద్దె ఆదాయంగా చూపిస్తూ, క్లెయిమ్ చేయండి.
కె.సి.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment